EX Minister Jogu Ramanna: హైడ్రా బాధితులకు అండగా మాజీ మంత్రి జోగు రామన్న

సిరాన్యూస్‌, ఆదిలాబాద్‌
హైడ్రా బాధితులకు అండగా మాజీ మంత్రి జోగు రామన్న
* పేదల ఇండ్లను కూల్చే ప్రయత్నాలు చేస్తే సహించేది లేదు

నిరుపేదల ఇండ్లను కూల్చే ప్రయత్నాలు చేస్తే సహించేది లేదని, పేదలకు ఇబ్బంది కలిగించేలా వ్యవహరిస్తే వారికి న్యాయం జరిగేంత వరకు అండగా నిలిచి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడతామని మాజీ మంత్రి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జోగురామన్న స్పష్టం చేశారు. ఇటివల అధికారుల బృందం సర్వే చేసి వెళ్ళడంతో తీవ్ర భయందోలనకు గురవుతున్న ఆదిలాబాద‌ఖ జిల్లా కేంద్రంలోని ఖానాపూర్ చెరువు పరిసరాల్లో సోమవారం ఆయన పర్యటించారు. స్థానిక ఖానాపూర్, కొలిపుర, తెర్పెల్లి, అంబేద్కర్ నగర్ తదితర కాలనీలలో శ్రేణులతో కలిసి పర్యటించారు. బాధితులకు ధైర్యం చెప్పారు. పేదల ఇండ్లను కూల్చే ప్రయత్నాలు చేస్తే సహించేది లేదని, ఎంతటివారినైనా అడ్డుకుని అండగా ఉంటామని భరోసా కల్పించారు. సర్వే చేసిన నాటి నుండి తాము మానసికంగా ఎంతటి క్షోభను అనుభవిస్తున్నామో స్థానికులు మాజీ మంత్రికి వివరిస్తూ… బాధపడ్డారు. బాధితులకు అండగా నిలుస్తామని స్పష్టం చేసిన ఆయన… ఎటువంటి ఆందోళనకు గురి కావొద్దని ధైర్యం చెప్పారు. కడుపు కాలే రెండు మాటలంటే వారిపై కేసులు నమోదు చేయడం సమంజసం కాదని, వారికి అండగా ఉంటామని తెలిపారు.కాలనీ లలో విస్తృతంగా పర్యటిస్తూ స్థానికులకు భరోసా కల్పించే ప్రయత్నం చేశారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సైతం పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ మేరకు మాజీ మంత్రి జోగురామన్న మాట్లాడుతూ దశాబ్దాల కాలంగా నిరుపేదలు ఇండ్లు నిర్మించుకుని జీవిస్తుంటే ప్రభుత్వం వారిపై దయ చూపకుండా వ్యవహరించడం సరికాదన్నారు. ఇదే కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో ఇక్కడి వారికి ఇందిరమ్మ ఇండ్లు నిర్మించారని గుర్తు చేశారు. చెరువును కబ్జా చేశారని ఆరోపిస్తూ సర్వే జరపడంతో పేద ప్రజలు భయందోలనకు గురవుతున్నారని, కొందరు వృద్ధులైతే తీవ్ర మనోవేదనను అనుభవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పేదల ఇండ్లు కూలుస్తామంటే ఉపేక్షించేది లేదన్న ఆయన… అభివృద్ధిపై దృష్టి సారించకుండా ప్రభుత్వం నిరుపేదల ఇండ్లను లక్ష్యంగా చేసుకోవడం ఎంతమేరకు సమంజసమని ప్రశ్నించారు. ఏ రాత్రయినా తనకు గాని, పార్టీ శ్రేణులకు గాని ఫోన్ చేస్తే నిమిషాల్లో అక్కడికి చేరుకుంటామని, బాధితులు అధైర్యపడవలసిన అవసరం లేదని భరోసా కల్పించారు. ఇచ్చిన హామీలను గాలికి వదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం డబ్బులను సంపాదించడమే లక్ష్యంగా ప్రజానీకాన్ని ఇబ్బందులకు గురి చేస్తోందని ఆరోపించారు.కార్యక్రమంలో జిల్లా సమన్వయ అధ్యక్షులు రోకండ్ల రమేష్ , పట్టణ అధ్యక్షులు అలాల్ అజయ్, సాజిదోద్దీన్, పండ్ల శీను,స్వరూప రాణి, విజ్జగిరి నారాయణ, పవన్ నాయక్ ధర్మపాల్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *