సిరాన్యూస్, ఆదిలాబాద్
అన్నదాతలను దగా చేసిన సీఎం రేవంత్‌రెడ్డి : మాజీ మంత్రి జోగు రామన్న
* ఆర్ అండ్ బీ గెస్ట్ హౌజ్ ప్రాంగణంలో బీఆర్ఎస్ నాయకుల ధర్నా
అన్నదాతలకు బేషరతుగా రెండు లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి గద్దెనెక్కిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారిని నిలువునా దగా చేశారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జోగురామన్న అన్నారు. రుణమాఫీ లో రైతులకు జరిగిన అన్యాయాన్ని ఖండిస్తూ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు గురువారం రైతు మహా ధర్నా నిర్వహించారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బీ గెస్ట్ హౌజ్ ప్రాంగణంలో నిర్వహించిన ధర్నాలో పెద్ద ఎత్తున రైతులతో పాటు పార్టీ నేతలు హాజరయ్యారు. రైతుల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా గులాబి శ్రేణులు గలమేత్తాయి. ప్రభుత్వ విధానాలను ఖండిస్తూ పెద్ద పెట్టున నినాదాలతో హోరెత్తించారు. ఈసందర్బంగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జోగురామన్న మాట్లాడారు. ముఖ్యమంత్రి స్వంత నియోజకవర్గంలోనే రైతులకు సంపూర్ణ రుణమాఫీ కాకపోవడం ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని అన్నారు. ఎటువంటి ఆంక్షలు లేకుండా రుణమాఫీ చేస్తామని ప్రసిద్ధ పుణ్య క్షేత్రాల్లో ఒట్లు వేసిన ముఖ్యమంత్రి హామీని నెరవేర్చడంలో విఫలమయ్యారని పేర్కొన్నారు. రైతు భరోసా కింద ఇస్తామన్న ఆర్ధిక సహాయం గురించి ప్రభుత్వం కనీసం ప్రస్తావించడం లేదన్నారు.అన్నదాతలకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. రైతులను అయోమయానికి గురి చేయడమే కాకుండా… వారికి అండగా నిలబడితే ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఆందోళనకు గురైన రైతులు నిరసన తెలిపితే వారిపై కేసులు నమోదు చేశారని, ఎన్ని కేసులు పెట్టినా న్యాయం జరిగేంత వరకు రైతుల పక్షాన నిలబడి పోరాటం చేస్తామని పునరుద్ఘాటించారు. కార్యక్రమంలో పార్టీ నేతలు రోకండ్ల రమేష్, విజ్జగిరి నారాయణ, యాసం నర్సింగ్ రావు, యూనుస్ అక్బని, పట్టణ అధ్యక్షులు అజయ్, సతీష్ పవార్, లింగారెడ్డి, సాజితుద్దీన్,తదితరులు పాల్గొన్నారు.