ఫ్యాన్ ఉక్కపోత… ఇక మిగిలేది ఎవరు…

సిరా న్యూస్,గుంటూరు;
ఎంపీలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు… జడ్పీ, మున్సిపల్ చైర్మన్లు.. ఇలా ఒకరేంటి వరుసగా వైసీపీని వీడుతున్న నేతల సంఖ్య చాంతాడులా పెరిగిపోతూనే ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత నైరాశ్యంలో కూరుకుపోయిన పార్టీలో పునరుత్తేజం నింపాల్సిన నేతలు… పూర్తిగా డీలా పడిపోతున్నారా? అనే అనుమానం వ్యక్తమవుతోంది. వరుసగా నేతల వలసలను పరిశీలిస్తే వైసీపీ నాయకత్వంపై నమ్మకం లేక తట్టాబుట్టా సర్దేస్తున్నారా? అనే సందేహమే ఎక్కువగా వ్యాపిస్తోంది. పదవులు లేని వారు…. మాజీలైన నేతలు అధికార దాహంతో పక్క పార్టీల్లోకి జంప్ చేస్తున్నారని సరిపెట్టుకుందామన్నా…. రాజ్యసభ సభ్యులు, మండలి సభ్యులు కూడా తమ పదవులను వదులుకుని కొత్త పార్టీల్లోకి వెళ్లేందుకు పోటీ పడటమే విచిత్రంగా అనిపిస్తోందంటున్నారు పరిశీలకులు.ఇలా పార్టీని వీడుతున్న వారిలో చాలామంది ఇంతవరకు కొత్తగా ఏ పార్టీలో చేరనేలేదు. ఒకరిద్దరికి టీడీపీ, జనసేనలో తీసుకునేందుకు ఆయా పార్టీలు కూడా ఓకే చేశాయంటున్నారు. కానీ, ఏ పార్టీతోనూ మాట్లాడకుండానే పెద్ద ఎత్తున నేతలు ఎందుకు రాజీనామా చేస్తున్నారనే సందేహం వ్యక్తమవుతోంది. ఇప్పటివరకు వైసీపీని వీడిన వారిలో రాజ్యసభ సభ్యులైన మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్‌రావు, ఎమ్మెల్సీలు పోతుల సునీత, కర్రి పద్మశ్రీ, బల్లి కల్యాణ్‌ చక్రవర్తి తమ పదవులకు సైతం రాజీనామా చేశారు.ఐతే వీరిలో మోపిదేవికి టీడీపీ నుంచి ఆహ్వానం ఉండగా, మిగిలిన వారు జంక్షన్‌లో జామ్‌ అయినట్లు కనిపిస్తున్నారు. పదవులు పోయినా పర్వాలేదు కానీ, వైసీపీలో కొనసాగలేకే వీరంతా పార్టీకి రాం రాం చెప్పేశారంటున్నారు. ఇక మాజీ మంత్రులు బాలినేని శ్రీనివాస్‌రెడ్డి, ఆళ్ల నాని, మాజీ ఎమ్మెల్యేలు కిలారు రోశయ్య, మద్దాల గిరి, పెండెం దొరబాబు ఇప్పటికే రాజీనామా ప్రకటన చేశారు. ఇప్పుడు ఈ లిస్టులో మరో మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను పేరు కూడా వినిపిస్తోంది.బాలినేని, సామినేని ఇప్పటికే జనసేనతో టచ్ ఉన్నట్లు ప్రచారం జరుగుతుండగా, మిగిలిన నేతల రాజకీయ భవిష్యత్‌పై ఇంతవరకు క్లారిటీ లేదు. కానీ, వారు మాత్రం వైసీపీతో జర్నీకి ఇష్టపడటం లేదు. దీంతో కొన్నాళ్లు ఖాళీగా ఉన్నా పర్వాలేదు… వైసీపీలో మాత్రం కొనసాగలేమంటూ రాజీనామాలు చేసేశారు. ఐతే ఐదేళ్లు పార్టీలో అన్ని హోదాలు అనుభవించిన ఈ నేతలు ఎందుకు పార్టీని వీడుతున్నారంటే… పార్టీ హైకమాండ్ తమను పట్టించుకోలేదనే ఏకైక కారణం చెబుతున్నారు. మంత్రులుగా పనిచేసిన బాలినేని, ఆళ్ల నాని, ప్రభుత్వ విప్‌గా పనిచేసిన సామినేని ఉదయభాను సైతం పార్టీపై అసంతృప్తి వ్యక్తం చేయడాన్ని వైసీపీ వర్గాలు జీర్ణించుకోలేకపోతున్నాయి.ఐనా, వీరు పార్టీ మారతామంటే ఎవరూ ఆపే ప్రయత్నం చేయకపోవడాన్ని తప్పుపడుతున్నాయి. ఇప్పటివరకు దాదాపు డజను మంది నేతలు పార్టీని వీడగా, ఒక్క బాలినేనితో మాత్రమే అధిష్టానం సంప్రదింపులు జరిపింది. అది కూడా బాలినేని కన్నా జూనియర్ అయిన మాజీ మంత్రి విడదల రజినితో రాయబారం నెరపడం కూడా బెడిసి కొట్టిందంటున్నారు. వెళ్లే వారు వెళ్లనీ అన్నట్లు పార్టీ అధిష్టానం వ్యవహరిస్తుండటంతో ఈ వలసలు మరింతగా పెరుగుతున్నాయంటున్నారు.ప్రస్తుతం బయటపడిన పేర్లు కొన్ని మాత్రమేనని… ఇంకా లిస్టులో చాలా మందే ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల నుంచి త్వరలో భారీ వలసలు ఉండొచ్చని చెబుతున్నారు. వైసీపీలో ఉంటే తమ రాజకీయ భవిష్యత్ ప్రమాదంలో పడినట్లేననే భయంతో కాపు సామాజికవర్గం నేతలు ఎక్కువగా పక్క చూపులు చూస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో ఎమ్మెల్యేలు, మంత్రులుగా పనిచేసిన వారు పార్టీని వీడుతుంటే తామేం తక్కువా? అన్నట్లు జిల్లా పరిషత్ చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్లు కూడా టీడీపీ, జనసేనల్లో చేరిపోతున్నారు.చిత్తూరు, నెల్లూరు, ఏలూరు కార్పొరేషన్లలో మెజార్టీ కార్పొరేటర్లు టీడీపీలో చేరిపోయారు. పుంగనూరుతోపాటు చాలా మున్సిపాలిటీల్లో వైసీపీ జెండాను దించేశారు. గుంటూరు, ఏలూరు జిల్లా పరిషత్ లను కూడా టీడీపీ కైవసం చేసుకుంది. ఇంకొన్ని జెడ్పీల్లో కూడా టీడీపీ జెండా ఎగిరేలా ప్లాన్ జరుగుతోందని చెబుతున్నారు. ఇలా పార్టీకి ప్రతి దశలోనూ డ్యామేజ్ జరుగుతున్నా, వైసీపీ అధిష్టానంలో చలనం కనిపించడం లేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఎవరు వెళ్లినా తానొక్కడిని చాలన్నట్లు అధినేత జగన్ వ్యవహరిస్తుండటమే అంతుచిక్కడం లేదంటున్నారు పరిశీలకులు. మొత్తానికి వైసీపీ అంతర్గత సంక్షోభం…. వలసలకు కారణమవుతోంది. ఈ పరిస్థితుల్లో వైసీపీలో చివరికి మిగిలేది ఎందరు అన్న సందేహం వ్యక్తమవుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *