సిరా న్యూస్, బేల:
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య…
ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని పాఠన్ గ్రామానికి చెందిన లచ్చరెడ్డి అనే రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు, పోలీసులు తెలిపారు. వారి కథనం ప్రకారం… లచ్చరెడ్డి తనకున్న 2.5 ఎకరాల భూమితో పాటు మరో 15 ఎకరాల భూమిని కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నాడు. గత కొన్ని సంవత్సరాలుగా వాతావరణం పెద్దగా సహకరించకపోవడంతో, దిగుబడి లేక కుదేలయ్యాడు. వ్యవసాయానికి పెట్టిన పెట్టుబడి కూడ తిరిగి రాకపోవడంతో అప్పుల పాలయ్యాడు. కాగా శుక్రవారం తన చేన్లోనే పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన స్థానికులు అతని కుటుంబీకులకు, పోలీసులకు సమాచారం అందించారు. అనతరం అతని శవాన్ని పోస్టు మార్టం కోసం జిల్లా కేంద్రంలోని రిమ్స్‌కి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.