మేడారం జాతరకు వేగంగా పనులు

సిరా న్యూస్,వరంగల్;

తెలంగాణ కుంభమేళాగా ప్రతిద్ధి చెందిన మేడారం సమ్మక్క – సారమ్మ మహాజాతర తేదీలు ఖరారయ్యాయి. రెండేళ్లకోసారి ఆదివాసీ, గిరిజన సంప్రదాయ పద్ధతిలో నిర్వహించే ఈ జాతరను ఈసారి 2024, ఫిబ్రవరి 21 నుంచి 24వ తేదీ వరకు నిర్వహించాలని పూజారుల సంఘం నిర్ణయించింది. ఈ మేరకు షెడ్యూల్‌ను ప్రకటించారు. ఫిబ్రవరి 14న మాఘశుద్ధ పంచమి బుధవారం రోజు మండెమెలగడం, గుడి శుద్ధీకరణతో జాతర ప్రక్రియను ప్రారంభించాలని నిర్ణయించారు.మేడారం మహాజాతర తేదీలను పూజారులు ఈసారి పది నెలల ముందే ఖరారు చేశారు. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వ ఉన్నతాధికారుల సూచన మేరకు తేదీలను ముందుగానే ప్రనకటించారు. గత అనుభవాల దృష్ట్యా ఈసారి జాతరలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పనులు చేపట్టేందుకు ప్రభుత్వం నిధులు కూడా మంజూరు చేసింది.మేడారం మహాజాతర తేదీల ఖరారు కోసం పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు, ఉపాధ్యక్షుడు కాక సారయ్య, ప్రధాన కార్యదర్శి చందా గోపాల్, పూజారులు సిద్దబోయిన మునేందర్, సిద్దబోయిన మహేశ్, లక్ష్మణ్‌రావు, కాక వెంకటేశ్వర్లు, కాక భుజంగరావు, చందా రఘుపతి, కొక్కెర కృష్ణయ్య, కొక్కెర రమేశ్, భోజారావు, జనార్దన్, అరుణ్‌కుమార్‌లు సమావేశం అయ్యారు. మహా జాతర తేదీలను ప్రకటించే ముందు పూజారులు ఆనవాయితీ ప్రకారం అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహాజాతర విజయవంతంగా సాగాలని అమ్మవార్లను వేడుకున్నారు.
జాతర తేదీలు ఇవే..
ఫిబ్రవరి 21 : మాఘశుద్ధ ద్వాదశి బుధవారం సాయంత్రం గద్దెల మీదకు సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజుల రాక
ఫిబ్రవరి 22 : చిలకలగుట్ట నుంచి సమ్మక్క దేవత రాక.
ఫిబ్రవరి 23 : సమ్మక్క–సారలమ్మ అమ్మవార్లకు మొక్కుల సమర్పణ.
ఫిబ్రవరి 24 : మాఘశుద్ధ పౌర్ణమి శనివారం అమ్మవార్ల వన ప్రవేశంతో మహా జాతర ముగింపు.
ఫిబ్రవరి 28 : మాఘశుద్ధ బహుళ పంచమి బుధవారం రోజు తిరుగువారం పండుగ నిర్వహిస్తారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *