సిరా న్యూస్,హైదరాబాద్;
భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు అరవింద్ అలిశెట్టి అనే వ్యక్తి తెలంగాణ భవన్ దగ్గర చక్కర్లు కొట్టేవాడు. కేటీఆర్ కు అత్యంత సన్నిహితంగా ఉండేవాడు. ఒకానొక దశలో కేటీఆర్ కు సలహాలు సూచనలు ఇచ్చే స్థాయికి ఎదిగాడు. నగరంలో ఎక్కడ చూసినా అరవింద్ అలిశెట్టి పేరుతో ఫ్లెక్సీలు ఉండేటివి. కెసిఆర్, కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు, కవిత పేర్లతో విరివిగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసేవాడు. అరవింద్ అలిశెట్టి కేటీఆర్ కు అత్యంత సన్నిహితంగా ఉండటంతో అధికారులు కూడా విపరీతమైన గౌరవ మర్యాదలు ఇచ్చేవారు. ఆయన చేయమన్న పనులు చేసేవారు. కేటీఆర్ తో ఉన్న సాన్నిహిత్యాన్ని అనుకూలంగా మలచుకున్న అరవింద్.. ఆయన పేరుతో ఐదు కోట్లు వసూలు చేశాడని ఆరోపణలు ఉన్నాయి. పైగా కేటీఆర్ పేరును విస్తృతంగా వాడుకొని పలుచోట్ల ఆస్తులు కూడపెట్టాడు అనే విమర్శలున్నాయి. అయితే అరవింద్ కు డబ్బులు ఇచ్చిన వారంతా ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు రంగంలోకి దిగారు. పైగా ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న నేపథ్యంలో పోలీసులకు విస్తృత అధికారాలు ఇవ్వటంతో వారు విచారణకు దిగారు.. దీంతో అరవింద్ అసలు నిజస్వరూపం బయటపడింది. కేటీఆర్ పేరు చెప్పి ఐదు కోట్లు వసూలు చేయడంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అతడు పోలీసుల విచారణ ఎదుర్కొంటున్నాడు. కేవలం ఈ ఐదు కోట్లు మాత్రమే కాకుండా బెంగళూరు ప్రాంతంలోనూ వసూలు చేశాడని.. ఇంకా ఈయన వెనుక అనేక మంది ఉన్నారని పోలీసులు చెబుతున్నారు. లోతుగా విచారిస్తే మరిన్ని విషయాలు బయటపడతాయని వారు చెబుతున్నారు.ఇక అరవింద్ తెలంగాణ భవన్ మాత్రమే కాకుండా హైదరాబాద్ నగర వ్యాప్తంగా విపరీతంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాడు. అంతేకాదు ఇటీవల తెలంగాణకు బలం, దళం బలగం, కేటీఆర్ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో.. ఆ వ్యాఖ్యలను ఉటంకిస్తూ అరవింద్ ఫ్లెక్సీ కూడా ఏర్పాటు చేశాడు. ఎప్పుడైతే అరవింద్ వ్యవహారం తెరపైకి వచ్చిందో అప్పుడే భారత రాష్ట్ర సమితి వర్గాలు జాగ్రత్త పడ్డాయి. తెలంగాణ భవన్ వద్ద అరవింద్ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని తొలగించాయి. కేటీఆర్ ఆదేశాల మేరకు హైదరాబాద్ నగరంలోని ఇతర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను కూడా తొలగించే విధంగా భారత రాష్ట్ర సమితి వర్గాలు అడుగులు వేస్తున్నాయి. అరవింద్ ఉదంతంతో భారత రాష్ట్ర సమితి అధిష్టానం గతంలో మంత్రుల వద్ద పీఏలుగా, పిఆర్వోలుగా పని చేసిన వారికి సంబంధించిన వ్యవహారాలపై ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది. అయితే గతంలో పనిచేసిన కొంతమంది మంత్రుల వ్యక్తిగత కార్యదర్శులు వివిధ వివాదాల్లో తల దూర్చిన నేపథ్యంలో… వారిపై కూడా ప్రత్యేకంగా దృష్టి సారించినట్టు ప్రచారం జరుగుతున్నది. గతంలో వారు ఎలాంటి వ్యవహారాల్లో తల దూర్చారు? భూములు కొనుగోలు చేశారా? ప్రభుత్వాధికారులను ఇబ్బంది పెట్టారా? అనే కోణాల్లో ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి అరవింద్ ఎపిసోడ్ తో ఒక్కసారిగా భారత రాష్ట్ర సమితి డిఫెన్స్ లో పడింది. అరవింద్ ఉదంతం నేపథ్యంలో కేటీఆర్ కోటరీలోకి కొత్త వ్యక్తులు ఎవరిని కూడా అనుమతించడం లేదని ప్రచారం జరుగుతున్నది.