సిరా న్యూస్,హైదరాబాద్;
అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సరైన స్థానాలు దక్కని నియోజకవర్గల్లో మెదక్ ఒకటి. లోకల్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో అన్ని జిల్లాలపై ఫోకస్ పెట్టిన కాంగ్రెస్ పార్టీ మెదక్‌పై ప్రత్యేక దృష్టి సారించింది. ఇందిరాగాంధీ ఎంపీగా గెలిచిన నేల కావడంతో పూర్వ వైభవం కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ క్రమంలోనే మంగళవారం గాంధీ భవన్‌లో కీలక సమావేశం నిర్వహించింది. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దీపాదాస్ మున్షి, మంత్రులు దామోదర్ రాజ నర్సింహ, పొన్నం ప్రభాకర్, ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాథన్, ఎమ్మెల్యే రోహిత్ రావ్, ఐసీసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తుందని మహేష్ గౌడ్ అన్నారు. ఎన్నికలలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ముందున్నామని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు అద్భుతమైన పాలన చేస్తున్నారని కొనియాడారు. ఇందిరమ్మ ఇళ్లు, ఉద్యోగాల కల్పన, ఫ్రీ బస్, రుణ మాఫీ, 500 రూపాయలకు గ్యాస్, 200 యూనిట్ల ఫ్రీ కరెంట్, స్కిల్ యూనివర్సిటీ ఇలా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించాలని చెప్పారు. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి విరివిగా తీసుకెళ్లాలని జిల్లా నేతలకు పిలుపునిచ్చారు.
ప్రజల మద్దతు ప్రభుత్వానికి సంపూర్ణంగా ఉండేలా కృషి చేయాలన్నారు. క్షేత్ర స్థాయిలో మరింత లోతుగా పని చేయాలని, రాబోయే ఎన్నికలలో మరింత గట్టిగా పని చేయాలని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని, నియోజకవర్గ నాయకులు కలిసికట్టుగా పని చేయాలని సూచించారు. మెదక్ జిల్లాలో మంచి ఫలితాలు సాధించే దిశగా పని చేయాలని చెప్పారు. దీపాదాస్ మున్షి మాట్లాడుతూ, మెదక్ అంటే కాంగ్రెస్ పార్టీకి అత్యంత ప్రాధాన్యత ఉన్న జిల్లా అని అన్నారు. ఇక్కడ ఇందిరా గాంధీ గతంలో ఎంపీగా పని చేశారని గుర్తు చేశారు. ‘‘కార్యకర్తలకు మెదక్ అంటే ఎంతో ప్రేమ, అభిమానం ఉంది. మెదక్ జిల్లాలో కేసీఆర్, హరీష్ రావు లాంటి బీఆర్ఎస్ లీడర్స్ ఉన్నారు. అక్కడ మనం చాలా కష్టపడి పని చేయాలి. మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి వెళ్లాయి. బీజేపీ, బీఆర్ఎస్ కలిసి పని చేస్తున్నాయి. రాబోయే లోకల్ బాడీ ఎన్నికల్లో మనం మంచి వ్యూహంతో పని చేయాలి. మంచి ఫలితాలు వచ్చేలా అందరూ క్షేత్రస్థాయిలో గట్టి పట్టుదలతో ముందుకు వెళ్లాలి’’ అని సూచించారు మున్షి.