మరో నలుగురు గ్యారంటీ

సిరా న్యూస్,హైదరాబాద్;
పార్లమెంటు ఎన్నికల వేళ తెలంగాణలో అత్యంత గడ్డు పరిస్థితి ఎదుర్కుంటున్న పార్టీ ఏదైనా ఉంది అంటే అది పదేళ్లు రాష్ట్రాన్ని ఏలిన బీఆర్‌ఎస్సే. అధికారం కోల్పోయిన వెంటనే ఇన్నాళ్లూ ఆ పార్టీలో పదవులు అనుభవించిన నేతలు గులాబీ పార్టీకి గుడ్‌బై చెబుతున్నారు. అధికారం ఎక్కడ ఉంటే.. తాము అక్కడ అన్నట్లు చొక్కాలు మార్చినంత ఈజీగా పార్టీ మారుతున్నారు. ఇప్పటికే ఇద్దరు సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు, ముగ్గురు సిట్టింగ్‌ ఎంపీలు జంప్‌ అయ్యారు. ఇక కీలక, సీనియర్‌ నాయకులు సైతం సెలవంటూ వెళ్లిపోతున్నారు. ఇంకా అనేక మంది అధికార పార్టీతో టచ్‌లో ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది.ఇక బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల చేరిక విషయంలో అధికార కాంగ్రెస్‌ కూడా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. గోప్యత పాటిస్తోంది. తుక్కుకూడ సభలో చేరేవారి పేర్లు వెల్లడించడంలేదు. ఇటు గులాబీ భవన్, అటు గాంధీ భవన్‌ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. నలుగురు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ తీర్ధం పుచ్చుకుంటారని ప్రచారం జరుగుతోంది. మరోవైపు పది మంది వరకు ఉన్నట్లు కూడా తెలుస్తోంది. ఈమేరకు ఇప్పటికే చర్చలు, సంప్రదింపులు పూర్తయినట్లు గాంధీ భవన్‌ నుంచి సమాచారం అందుతోంది.గతంలో కాంగ్రెస్‌లో పనిచేసి పీసీసీ చీఫ్‌గా బాధ్యతలు నిర్వర్తించి పదేళ్ల క్రితం బీఆర్‌ఎస్‌లోచేరిన నేత కే.కేశవరావు. ఇటీవలే మళ్లీ సొంతగూటికి వచ్చారు. ఇప్పుడు ఆపరేషన్‌ ఆకర్ష్‌లో భాగంగా సీఎం రేవంత్‌రెడ్డి.. బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లో చేరే నేతలు, ఎమ్మెల్యేలను చూసుకోవాల్సిన బాధ్యతలను కేకేకు అప్పటించినట్లు తెలుస్తోంది. ఆ పార్టీతో పదేళ్లు తనకు ఉన్న పరిచయాలతో వీలైనంత ఎక్కువ మందిని కాంగ్రెస్‌లోకి తీసుకురావాలని యత్నిస్తున్నట్లు సమాచారం. ఈమేరకు కేకే మంతనాలు జరుపుతున్నారని తెలుస్తోంది. టీడీపీ నేతలను కూడా కాంగ్రెస్‌లో చేరుందకు కేకేతో చర్చలు జరుతున్నట్లు సమాచారం.10 సంవత్సరాలు ఒక వెలుగు వెలిగి.. అంతకుముందు ఉద్యమ పార్టీగా మన్ననలు అందుకున్న భారత రాష్ట్ర సమితికి ఇంతటి దుస్థితి రావడానికి కారణం ఏంటి? అసలు ఏం జరిగింది? వీటన్నింటికీ గులాబీ శ్రేణులు నోరు మెదపక పోయినప్పటికీ.. తాజా పరిణామాలను చూస్తే తెలంగాణ భవన్ కు వాస్తు మార్పులు చేయాలని భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ నిర్ణయించినట్టు ప్రచారం జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, నేతల అరెస్టు, ఎమ్మెల్యే, ఎంపీలు వలస వెళ్తుండడంతో.. కేసీఆర్ తెలంగాణ భవన్ వాస్తు పై ఫోకస్ చేసినట్టు తెలుస్తోంది. తెలంగాణ భవన్లోకి ఎంట్రీ తో పాటు ఎగ్జిట్ మార్గాలలో సమూల మార్పులు చేస్తున్నట్టు తెలుస్తోంది.. ఇప్పటివరకు తెలంగాణ భవన్ ఎంట్రీ, ఎగ్జిట్ మార్గాలకు భారత రాష్ట్ర సమితి నేతలు వాయవ్య గేటును ఉపయోగించేవారు. ఇకపై వాయవ్య గేటు నుంచి కాకుండా ఈశాన్య గేటు నుంచి రాకపోకలు సాగించాలని కేసీఆర్, ఇతర భారత రాష్ట్ర సమితి కీలక నేతలకు వాస్తు పండితులు సూచించారని తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఈశాన్యం గేటు నుంచి రాకపోకలు సాగించేలా కొత్తగా ర్యాంప్ ఏర్పాటు చేశారు. వాయవ్య గేటు కూడా మూసి వేసినట్టు తెలుస్తోంది. సో.. మొత్తానికి భారత రాష్ట్ర సమితి ఓటమికి ఆ గేటు సరిగా లేకపోవడమే కారణమా? ఇప్పుడు గేటు సరి చేశారు కాబట్టి ఇకపై భారత రాష్ట్ర సమితికి అంతా లాభమే జరుగుతుందా.. పార్లమెంటు ఎన్నికల్లో గణనీయమైన సంఖ్యలో స్థానాలు గెలుచుకుంటుందా? ఏమో దీనికి కాలమే సమాధానం చెప్పాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *