పోలవరం నుంచి తుంగభద్ర దాకా…!

సిరా న్యూస్;
ఆనకట్టలు ఆధునిక భారతావని అభివృద్ధికి చిహ్నాలు. అందుకే బాక్రానంగల్ ఆనకట్ట నిర్మాణం ప్రారంభిస్తూ ఆనకట్టలు ఆధునిక భారతదేశం దేవాలయాలు అన్నారు మాజీ ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ. క్రీ.శ. రెండవ శతాబ్దంలో రాజు కరికాల చోళుడు మొదటి ఆనకట్టగా కల్లనై డ్యామ్ నిర్మించాడు. ఇప్పుడు 6వేల ఆనకట్టలతో భారత్ ప్రపంచంలో మూడో స్థానంలో ఉంది. ఈ డ్యామ్‌లలో 80 శాతానికి పైగా నిర్మించి 25 ఏళ్లు దాటినవి కాగా 234 డ్యాముల వయస్సు వందేళ్లు దాటింది. ఇప్పుడు వాటి భద్రతకు అత్యంత ప్రాముఖ్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. డ్యాముల భద్రత, నిర్వహణ కోసం కేంద్ర ప్రభుత్వం దార్శనిక దృష్టితో 2021లో ఆనకట్టల భద్రతా చట్టం (డిఎస్ఏ) రూపొందించడం జరిగింది.ఆనకట్ట నిఘా, తనిఖీ, భద్రతపై జాతీయ కమిటీ, కేంద్ర స్థాయిలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎస్‌ఏ) రాష్ట్ర స్థాయిలో డ్యామ్ భద్రత కమిటీ ఏర్పాటు చేయడం తప్పనిసరి అని ఈ చట్టం నిర్దేశిస్తోంది. అంతే కాకుండా డ్యామ్ వద్ద ప్రత్యేక డ్యామ్ సేఫ్టీ యూనిట్‌ని కలిగి ఉండాలి. క్రమం తప్పకుండా సమగ్ర భద్రతా మూల్యాంకనాలను నిర్వహించాలి. ప్రధానంగా డ్యామ్ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేట్ ఏజెన్సీలు కలిసి పనిచేసి ఆనకట్టల భద్రతను నిర్ధారించాల్సి ఉంటుంది.ఆనకట్టల భద్రత, నిర్వహణ విషయంలో కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నందువలన ఆనకట్టల భద్రతా చట్టం (డి‌ఎస్‌ఏ) నిష్ప్రయోజనంగా మారుతోంది. రాజకీయ ప్రయోజనాల కోసం కేవలం ఉచితాలకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తూ, అత్యంత ముఖ్యమైన సాగునీరు అందించే ప్రాజెక్టుల ప్రాముఖ్యతను విస్మరిస్తున్నారు. ఇక ఏపీలో అయితే గత ఐదేళ్లలో సాగునీటి ప్రాజెక్టుల్లో జరిగినంత నిర్లక్ష్యం, విధ్వంసం బహుశా ఎన్నడూ జరగలేదు. రెండు తెలుగు రాష్ట్రాలలోని సుమారు 13 లక్షల ఎకరాలకు సాగు నీరందించే శ్రీశైలం ప్రాజెక్టులో డ్యాం ఎదురుగా వంద మీటర్ల లోతున భారీ గొయ్యి ఏర్పడి డ్యాం భద్రతకే ముప్పులా పరిణమిస్తోంది. దీని మరమ్మత్తులకు రూ.10 కోట్లు అవసరమని కోరినా గత ప్రభుత్వం పట్టించుకోలేదు. ఏప్రాన్, షార్ట్ కాంక్రీటింగ్ పనులు, ఇతర మరమ్మతులకు రూ.174 కోట్లు అవసరమని అధికారులు ప్రతిపాదనలు పంపితే గత ప్రభుత్వం ఇచ్చింది రూ.10 లక్షలు మాత్రమే.ఉమ్మడి గోదావరి జిల్లాల్లో సుమారు 10.16 లక్షల ఎకరాలకు సాగు నీరందించే ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ 175 గేట్లలో దాదాపు 100 గేట్లకు మరమ్మత్తులు చేయాల్సి ఉంది. పులిచింతల ప్రాజెక్టులో గేట్ల నిర్వహణ సరిగా లేక 2021 ఆగస్టు 5న 16వ నెంబరు గేటు కొట్టుకుపోయింది. గేట్ల నిర్వహణకు, ఇతర పనులకు అధికారులు ప్రతిపాదించిన రూ.1.66 కోట్లు నిధులు ఇవ్వనందున పైనుండి వరద నీరొస్తున్నా పూర్తి స్థాయిలో నింపకుండా, దిగువకు వదిలేసారు. గుండ్లకమ్మ ప్రాజెక్టులో గేట్ల మార్పిడికి రూ.3 కోట్లు ఇవ్వకపోవడం వలన 2022 ఆగస్టు 31న మూడో నంబరు గేటు, మరుసటి ఏడాది రెండో నంబరు గేటు కొట్టుకుపోయాయి. 2021లో పింఛా ప్రాజెక్టు మట్టికట్ట కొట్టుకుపోయింది. అదే ఏడాది ప్రాజెక్టు నిర్వహణా లోపం వల్ల అన్నమయ్య జలాశయం మట్టికట్ట కొట్టుకుపోయి 39 మంది అసువులు బాసారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని సుంకేసుల, మైలవరం, జూరాల, నెల్లూరు జిల్లాలోని సోమశిల, శ్రీ సత్యసాయి జిల్లాలోని ఎగువ పెన్నా తదితర జలాశయాల నిర్వహణ రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వనందువలన అధ్వానంగా మారింది. డ్రిప్-2 పధకం క్రింద ప్రాజెక్టు మరమ్మత్తులకు కేంద్రం నుండి 70 శాతం నిధులు వచ్చే అవకాశం ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం వినియోగించుకోలేదు.ఇక ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రస్తుత స్థితిగతులు, నిర్మాణ జాప్యానికి, వ్యయం పెరుగుదలకు రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణ సంస్థను మార్చడం, భూసేకరణ – సహాయ పునరావాస కార్యక్రమాల్లో తీవ్ర జాప్యం, ఆమోదం పొందిన డిపిఆర్‌లోని డిజైన్లలో మార్పులు కారణమని ఇటీవలే కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ తేల్చి చెప్పింది. కర్ణాటక, తెలంగాణ, రాయలసీమ జిల్లాల్లోని లక్షలాది ఎకరాలకు సాగు నీరందించే తుంగభద్ర జలాశయం నిండుగా ఉన్న సమయంలో 19వ నెంబరు గేటు ఇటీవలే కొట్టుకుపోయింది. అప్రమత్తమైన ప్రభుత్వం గేట్ల రూపకల్పన నిపుణుడు నాగినేని కన్నయ్య నాయుడు ఆధ్వర్యంలో ఇంజనీర్ల బృందం కొట్టుకుపోయిన క్రస్ట్ గేట్ స్థానంలో స్టాప్ లాగ్ గేటు బిగించి నీటి వృథాను అరికట్టింది.
ఎంతో వ్యయ ప్రయాసలకోర్చి, వందల, వేల కోట్లు వెచ్చించి నిర్మించిన ప్రాజెక్టుల నిర్వహణకు ప్రభుత్వాలు నిధులు సక్రమంగా, సకాలంలో విడుదల చేయనందున నిర్వహణ పనులు చేయడానికి గుత్తేదారులు ముందుకు రావడం లేదు. ఫలితంగా నిర్వహణా లోపం వల్ల తరచూ గేట్లు కొట్టుకుపోయి జలాశయాల్లోంచి అత్యంత విలువైన నీరు సముద్రం పాలై, ప్రాజెక్టు పరిధిలోని లక్షల ఎకరాలు సాగుకు నోచుకోని పరిస్థితి దాపురిస్తోంది. డ్రిప్ పధకాన్ని ఉపయోగించుకుని పాతతరం నాటి జలాశయ ప్రాజెక్టుల ఆధునికీకరణ, అవసరమైన జలాశయాల మరమ్మత్తులు చేపట్టాలి. రాష్ట్ర ప్రభుత్వాల దయాదాక్షిణ్యాల మీద కాకుండా ప్రాజెక్టు స్థాయిని బట్టి ప్రాజెక్టు భద్రత, నిర్వహణ కోసం విధిగా నిధులు కేటాయించే వ్యవస్థను ఏర్పాటు చేయాలి. తాగునీరు, సాగునీరు, జలవిద్యుత్, వరదల రక్షణ, నానాటికీ పెరుగుతున్న నీటి డిమాండ్‌ను తీర్చడంలో బహుముఖ పాత్ర పోషిస్తున్న జలాశయాల రక్షణకు, నిర్వహణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం తమ ప్రథమ బాధ్యత అని ప్రభుత్వాలు గుర్తెరగాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *