జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్
సిరా న్యూస్,జగిత్యాల;
గరీబోళ్లకు గొంతుకై.. అన్నార్థులకు ఆపన్నహస్తమై.. ఉద్యమకారులకు ఉక్కుపిడికిలై.. మేరా సఫర్.. జనతా కే సాథ్ అంటూ కడవరకూ తపించి… తెలంగాణ కోసమే శ్వాసించిన మహనీయుడు కాకా అని జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ అన్నారు.
శనివారం రోజున కలెక్టరేట్ ప్రాంగణంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మాజీ కేంద్రమంత్రి శ్రీ జి. వెంకటస్వామి (కాకా) జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేసి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అనేక కార్మిక ఉద్యమాలలో ప్రత్యక్షంగా పోరాటం చేశారని, కార్మికుల పక్షాన అనేక ఉద్యమాలు నిర్వహించి లక్షలాది మంది కార్మికుల జీవితాలకు బాటలు వేశారని తెలిపారు. బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం నిర్విరామంగా కృషి చేశారని, కాకను స్పూర్తిగా తీసుకోవాలని ఈ సందర్భంగా కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు పి. రాంబాబు, గౌతమ్ రెడ్డి, కలెక్టరేట్ ఏ. ఓ. హన్మంత రావు, జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ది అధికారి సాయిబాబా, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.