సిరా న్యూస్, ఆదిలాబాద్
జోగురామన్న చొరవతోనే గ్రామాల అభివృద్ధి
* రూరల్ మండల ఎంపీపీ గండ్రత్ రమేష్
* బాలూరి గోవర్ధన్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించిన బీఆర్ ఎస్ నాయకులు
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో కోట్లాది రూపాయల నిధుల వ్యయంతో గ్రామాల అభివృద్ధి జరిగిందని రూరల్ మండల ఎంపీపీ గండ్రత్ రమేష్ అన్నారు. సోమవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మాజీ మంత్రి జోగురామన్న చొరవతో నియోజకవర్గంలోని అన్ని గ్రామాలూ అభివృద్ధి పథంలో నడిచాయన్నారు.ఇటివల డీసీసీబీ డైరెక్టర్ బాలూరి గోవర్ధన్ రెడ్డి లాండ సంగి గ్రామంలో చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. మాజీ మంత్రి జోగురామన్న కృషితోనే నేడు గ్రామాలలో అభివృద్ధి చూడగలిగామని తెలిపారు. ఎన్నికల ముందు పార్టీలు మారిన కాంగ్రెస్ నాయకులు కళ్ళుండి అభివృద్ధిని చూడలేక నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం తగదన్నారు. గ్రామంపై కక్షి సాధింపుగా వ్యవహరించారని వ్యాఖ్యలు చేయడం సరికాదని మండిపడ్డారు. గత ఆర్ధిక సంవత్సరం బడ్జెట్ లోనే లాండ సాంగి గ్రామంలో వివిధ అభివృద్ధి పనుల నిమిత్తం 57 లక్షల నిధులను కేటాయించిన విషయాన్నీ గుర్తు చేశారు. అభివృద్ధి కార్యక్రమాల సమయంలో కనీస ప్రోటోకాల్ పాటించని కాంగ్రెస్ నేతలు తమపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. మాజీ మంత్రి జోగురామన్నపై విమర్శలు చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ నేతలు వ్యవహరించడం సరికాదని పేర్కొన్నారు. ఈ సమావేశంలో డైరెక్టర్ పరమేశ్వర్, సోనేరావు, మోతీరామ్, నాగన్న,మల్లేష్, తదితరులు పాల్గొన్నారు.