సిరా న్యూస్, డిజిటల్:
పాత పాయల్ బెటరా? కొత్త కంది బెటరా?
+ తర్జనభర్జనలో జంపింగ్ జపాంగ్‌లు
+ ఎటూ తేల్చుకోలేక సతమతం
+ జోగు నుండి జారుకునే ఆలోచనలో పలువురు
ఒకరేమో కేంద్రంలో అధికారంలో ఉన్న జాతీయ పార్టి బీజేపీ నుండి గెలుపొందిన ఎమ్మెల్యే… మరొకరెమో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన మరో జాతీయ పార్టీ కాంగ్రేస్‌కు చెందిన బడా లీడర్… ఈ ఇద్దరిలో ఎవరిని ఎంచుకోవాలో తెలియక ఆదిలాబాద్ నియోజక వర్గంలోని పలువురు బీఆర్‌ఎస్ నాయకుల సతమతం అవుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు ఎంతో ధీమాతో ఉన్న బీఆర్‌ఎస్ నాయకులు జోగు రామన్న ఓటమితో ఒక్కసారిగా కూలిపోయారు. 14సంవత్సరాలు ఏకధాటిగా ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి ఒక్కసారిగా పదవి లేకుండా పోవడంతో బీఆర్‌ఎస్ శ్రేణులు చిన్నాభిన్నం అయ్యారు. జోగు రామన్నకు అత్యంత సనిహితులు, ఆప్తులుగా ఉన్న పలువురు నాయకలు ఇటీవలే పార్టీని వీడి, కంది శ్రీనివాస్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రేస్ కండువా కప్పుకోవడంతో, బీఆర్‌ఎస్ ద్వితీయ శ్రేణి నేతల్లో ఆందోళన మొదలైంది. సర్పంచ్‌లు, ఎంపిటీసీలు, నామినేటెడ్ పోస్టుల్లో ఉన్న నాయకులతో పాటు పట్టణ కౌన్సిలర్లు, ద్వితీయ శ్రేణి నేతలు సందిగ్దంలో పడిపోయారు. కాంగ్రేస్ నాయకులు కంది శ్రీనివాస రెడ్డి ఇప్పటికే చేరికల విషయంలో కొంత దూకుడు ప్రదర్శిస్తున్నారని చెప్పవచ్చు. ఎన్నికల తరువాత కాంగ్రెస్‌లో చేరికలు బాగానే జోరందుకోవడంతో, బీఆర్‌ఎస్ వలసలకు ఆదిలాబాద్ కాంగ్రేస్‌లో ఆహ్వానం ఉన్నట్లు సంకేతాలు ఇవ్వడం జర్గింది. కానీ బీజేపీలో పరిస్థితి అలా లేదు. పాయల్ శంకర్ ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత నుండి పెద్దగా చేరికలు జరలేదు. అయితే ఈ విషయాన్ని ఎలా చూడాలో అర్థం కాక జంపింగ్ జపాంగ్‌లు తలలు పట్టుకుంటున్నారు. ఏళ్లుగా తనకంటూ స్వంత క్యాడర్ తయారు చేసుకొని రాజకీయా క్షేత్రంలో ఉన్న పాయల్ శంకర్, బీజేపీలో వలసలను ప్రొత్సహిస్తారా? లేదా? అన్న సందేహం కూడ నెలకొంది. తన కోసం జెండా మోసిన వాళ్లను కాదని, బీఆర్‌ఎస్ వాళ్లను పార్టిలో జాయిన్ చేసుకోవడం కరెక్ట్ కాదనే భావనలో ఉన్నారా? లేదంటే తన వద్ద ఇప్పుడున్నSక్యాడర్ సరిపోతుంది అన్న ధీమాలో ఉన్నారా? అనేది స్పష్టం కావడం లేదు.
ఇప్పటికే గేట్లు తెరిచిన కాంగ్రేస్…వాస్తవంగా చెప్పాలంటే కంది శ్రీనివాస రెడ్డి ఆదిలాబాద్ రాజకీయాల్లో అడుగుపెట్టిన టైంలో ఆదిలాబాద్‌లో కాంగ్రేస్ మూడు ముక్కలుగా చీలి, తన ఉనికిని కాపాడుకోవడానికి అగచాట్లు పడుతున్న పరిస్థితి ఉండేది. కంది శ్రీనివాస రెడ్డి కాంగ్రేస్‌లో జాయిన్ అయిన తరువాత తన వెంట చెప్పుకోదగ్గ నాయకులు ఎవరూ లేకున్నప్పటికీ తానే అన్ని వర్గాల ప్రజలతో మమేకమౌతూ, ప్రజల్లోకి వెళ్లాడు. ఎన్నికల ముందు బాలూరి గోవర్ధన్ రెడ్డి కాంగ్రెస్ జాయిన్ అయినప్పటికీ, అంతకు ముందు సంతోష్ రావ్, భారత్ వాగ్మారే, ఇలా ఒకరిద్దరు మాత్రమే కొంత పలుకుబడి కలిగిన నాయకుల ఆయన వెంట ఉన్నారు. కంది శ్రీనివాస రెడ్డి వచ్చి రాగానే ఆదిలాబాద్ ఎమ్మెల్యే పదవికి గురిపెట్టడంతో, చాలా మంది అతను అట్టర్‌ఫ్లాఫ్ కావదం ఖాయమని భావించారు. కానీ ఎన్నికల్లో దాదాపు 50వేల ఓట్ల సాధించడంతో, పబ్లిక్‌లో ఆయన ఇమేజ్ పూర్తిగా మారిపోయింది. దీంతో బీఆర్‌ఎస్‌లో ఉన్న చాలా మంది ఇప్పుడు కంది శ్రీనివాస రెడ్డి నాయకత్వంలో పనిచేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇటీవలే కాంగ్రేస్‌లో జాయిన్ అయిన తుమ్మల వెంకట్ రెడ్డితో చాలా మంది టచ్‌లో ఉన్నట్లు టాక్ నడుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల సమయానికి భారీగా వలసలను పార్టీలో చేర్చుకునే దిశగా ఆదిలాబాద్ కాంగ్రేస్ పావులు కదుపుతున్నట్లు పక్కా సమాచారం.
బీజేపీలో వలసలకు నో చాన్స్..!?రాజకీయంలో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరనేది అందరికి తెలిసిన నానుడి. ఈ ఎన్నికల్లో బద్ద శత్రువులుగా కనిపించిన నాయకులే, ఇంకో ఎన్నికల్లో కలిసి తిరగడం సర్వసాధారణంగా చూస్తుంటాము. వీరిలో ద్వితీయ శ్రేణి నాయకులు అయితే అధికారం ఎటు ఉంటే అటు వాలిపోవడం అత్యంత సాధారణ అంశంగా చెప్పుకోవచ్చు. వారిని నమ్ముకొని ఉన్న ప్రజల కోసం కావచ్చు.. వారి రాజకీయ భవిష్యత్తు కోసం కావచ్చు.. అధికారం ఉన్న లీడర్ నీడలోనే ఉండాలను కుంటారు. గతంలో పాయల్ శంకర్‌తో కలిసి పనిచేసిన నాయకులు సైతం ఇప్పుడు మళ్లీ పాయల్ గూటికి చేరాలని తహతహాలాడుతున్నట్లు సమాచారం. అయితే కొంత మంది బీజేపీ నాయకులు మాత్రం, తమకు అడుగడున అడ్డుగా తగిలిన బీఆర్‌ఎస్ నాయకులను ఇప్పుడు పార్టీలో చేర్చుకునే చాన్సే లేదంటూ కుండబద్దలు కొడుతున్నారు. అయితే సర్పంచ్‌లు, ఎంపిటీసీలు, కౌన్సిలర్లు, ఇతర ద్వితీయ శ్రేణి నాయకులు ఎవరైనా వస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో లాభనష్టాల ఆధారంగా నిర్ణయాలు ఉండవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. గెలుపును ఎంజాయ్ చేస్తున్న ఆదిలాబాద్ బీజేపీ ఇప్పుడే వలసలపై పెద్దగా దృష్టి సారించలేదని, ఆ అవసరం కూడ పార్టీకి లేదని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. కానీ స్థానిక సంస్థలు, ఎంపీ ఎలక్షన్ అప్పుడు టైంలో మాత్రం అప్పటి పరిస్థితుల ఆధారంగా వలసలు, చిన్న చిన్న సర్దుబాట్లు ఉండవచ్చని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.