Good News for Youth: నిరుద్యోగులకు నెలకు రూ. 6-10 వేలు

సిరా న్యూస్, డిజిటల్;

+ నిరుద్యోగులకు బంపర్ ఆఫర్

మహారాష్ట్రలోని ఏక్ నాథ్ శిండే ప్రభుత్వం సంచలన పథకాన్ని ప్రకటించింది. డిగ్రీ పూర్తి చేసిన నిరుద్యోగులకు భారీ నిరుద్యోగ భృతిని ప్రకటించింది. ఈ పథకంలో భాగంగా 12వ తరగతి పాసైన వారికి నెలకు రూ.6 వేల భృతిని ప్రభుత్వం అందించనుంది. డిప్లొమా పూర్తి చేసిన వారికి నెలకు రూ.8 వేలు లభించనుంది. ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన వారికి అత్యధికంగా నెలకు రూ.10 వేలు ప్రభుత్వం ఇవ్వనుంది. విద్యార్థులు తమ చదువు పూర్తి చేసుకొని ఉద్యోగం సాధించేవరకూ అండగా ఉండే ఉద్దేశంతో ఈ ఆర్థిక సాయం ప్రకటించినట్లుగా ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షించే వెల్లడించారు. తొలి ఏకాదశి సందర్భంగా పండరిపూర్‌లో ముఖ్యమంత్రి ఈ పథకాన్ని ప్రకటించారు.ఈ భారీ పథకాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగానే ఈ సమయంలో ప్రకటించింది. మరికొద్ది నెలల్లో మహారాష్ట్ర శాసనసభకు ఎన్నికలు జరగనున్నాయి. అందులో నిలదొక్కుకోవడం కోసమే ఏక్ నాథ్ షిండే ప్రభుత్వం ఈ పథకాన్ని ఇప్పుడు తెచ్చిందని చెబుతున్నారు. ఈ పథకం అమలు చేస్తే ప్రభుత్వంపై ఏకంగా రూ.5,500 కోట్ల భారం పడనుంది. ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే ఈ పథకాన్ని ప్రకటిస్తూ.. ‘లాడ్లీ బెహన్ యోజన’ పథకం గురించి కూడా ప్రస్తావించారు. మహిళల కోసం ఈ పథకాన్ని ప్రారంభించామని తెలిపారు. త్వరలోనే నెలకు రూ.1500 మా అక్కాచెల్లెళ్ల ఖాతాలో జమ చేస్తామని అన్నారు. ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం జూలై 1, 2024 నుండి అమలు చేస్తామని చెప్పారు. అందుకే, అన్నదమ్ముల కోసం కూడా కొత్త పథకాన్ని మొదలుపెట్టినట్లు చెప్పారు.లబ్ధిదారుల ఎంపిక కూడా ఇలా ఉంటుందని సీఎం చెప్పారు. చదువు పూర్తయిన యువకుడు ఏడాదిపాటు పరిశ్రమ లేదా పరిశ్రమయేతర కంపెనీలో అప్రెంటిస్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత అక్కడ వర్క్ ఎక్స్ పీరియన్స్ సంపాదించి, ఆ అనుభవంతో ఉద్యోగం కూడా సంపాదించుకోవచ్చు. ఒక విధంగా ఈ పథకం ద్వారా స్కిల్ కలిగిన మానవవనరులను సృష్టిస్తున్నట్లు ఏక్ నాథ్ షిండే చెప్పారు. రాష్ట్రంతో పాటు దేశంలోని పరిశ్రమలకు నైపుణ్యం కలిగిన యువతను అందించబోతున్నామని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *