పెద్దపల్లి జిల్లాలో పట్టాలు తప్పిన గూడ్స్‌ రైలు..

నిలిచిపోయిన రైళ్లు

సిరా న్యూస్,పెద్దపల్లి;
రాఘవాపూర్‌లో అర్ధరాత్రి గూడ్స్‌ రైలు పట్టాలు తప్పింది. కర్ణాటకలోని బల్లారి నుంచి యూపీలోని ఘజియాబాద్‌కు స్టీల్‌లోడ్‌తో వెళ్తున్న గూడ్స్‌ రైలులో 11 బోగీలు అదుపు తప్పి బోల్తా పడ్డాయి. రాఘవాపూర్ సమీపంలోని కన్నాల రైల్వే గేటుకు కొద్ది దూరంలో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో లోలో పైలట్‌, గార్డు సురక్షితంగా బయటపడ్డారు. 44 బోగీలతో వెళ్తున్న ఈ గూడ్స్‌ రైలు అధిక లోడ్‌ వల్లే పట్టాలు తప్పినట్లు అధికారులు భావిస్తున్నారు.
ఈ ప్రమాదం వల్ల మూడు ట్రాక్‌లు దెబ్బతిన్నాయి. దీంతో అప్రమత్తమైన ఉన్నతాధికారులు ఖాజీపేట – బల్లార్షా మార్గంలో వెళ్లాల్సిన పలు రైళ్లను ఆయా స్టేషన్ల వద్ద నిలిపివేశారు. ప్రమాదం జరిగిన కొద్దిసేపటికే పెద్దపల్లి స్టేషన్‌లో సంపర్క్‌ క్రాంతి, భాగ్యనగర్‌ ఎక్స్‌ప్రెస్‌లను నిలిపివేశారు. అలాగే బిజిగిరి షరీఫ్‌ దగ్గర నవజీవన్‌ ఎక్స్‌ప్రెస్‌ను ఆపివేశారు.అనంతరం ఘటనాస్థలి వద్ద మరమ్మతు పనులు మొదలు పెట్టారు. రైలు పట్టాల పునరుద్ధరణ, బోల్తా పడిన బోగీలను తొలగించి రైళ్ల రాకపోకలను ప్రారంభించేందుకు 24 గంటల సమయం పట్టే అవకాశం ఉంది.కేంద్రమంత్రి ఆరా రైలు ప్రమాదం గురించి తెలిసిన వెంటనే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ స్పందించారు. రైల్వే అధికారులతో ఫోన్‌లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. తక్షణమే ట్రాక్‌ను పునరుద్ధరించాలని కోరారు. అలాగే ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *