కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్
సిరా న్యూస్,న్యూఢిల్లీ ;
లోన్ యాప్స్ ద్వారా రుణాలు తీసుకునేవారు తిరిగి ఆ రుణాలు చెల్లించలేక ప్రాణాలు తీసుకుంటున్న ఘటనలు ఈ మధ్య కాలంలో చాలా వెలుగుచూశాయి. దాంతో ఇలాంటి వాటిని నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలకు దిగింది. లోన్ యాప్స్ మీద కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.లోక్‌సభలో సభ్యులు అడిగిన ఓ ప్రశ్నకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో నిర్మలా సీతారామన్ లోన్ యాప్స్ గురించి పేర్కొన్నారు. ప్రజలకు ప్రాణ సంకటంగా మారిన లోన్ యాప్స్‌ను గూగుల్ సంస్థ తొలగిస్తున్నదని తెలిపారు. 2021 ఏప్రిల్ నుంచి 2022 జూలై మధ్య కాలంలో ఏకంగా 2,500 మోసపూరిత లోన్ యాప్‌లను గూగుల్ తొలగించిందని వెల్లడించారు.ప్రజలను మోసం చేస్తున్న యాప్‌ల మీద కఠినమైన చర్యలు తీసుకుంటామని తన సమాధానంలో నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. వర్షానికి మొలిచిన పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న ఫ్రాడ్ లోన్ యాప్‌ల మీద కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నదని తెలిపారు. అందుకోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో కలిసి పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు.ఫ్రాడ్ లోన్ యాప్స్ గురించి ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, జనం వాటిపై అవగాహన పెంచుకుంటే మోసాల బారినపడకుండా ఉండవచ్చని సూచించారు. మోసపూరిత రుణ యాప్‌లను నియంత్రించేందుకు తీసుకుంటున్న చర్యలలో భాగంగా, చట్టపరమైన నియమాలను పాటిస్తున్న యాప్‌ల జాబితాను ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ గూగుల్‌తో పంచుకుందని తెలిపారు.