ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్
సిరా న్యూస్,మైలవరం;
మిచాంగ్ తుఫాను కారణంగా కురిసిన వర్షాల వల్ల జరిగిన పంట నష్టాలను అంచనా వేసి, పంట నష్టపోయిన ప్రతి రైతును ప్రభుత్వం ఆదుకుంటుందని అధైర్యపడాల్సిన అవసరం లేదని, ఈ మేరకు సీఎం జగనన్న స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ రైతులకు భరోసా కల్పించారు.
జి.కొండూరు మండలంలోని వెలగలేరు, వెల్లటూరు, మైలవరం మండలంలోని వెల్వడం గ్రామాలలో నేలవాలిన వరి పొలాలను, మైలవరం మార్కెట్ యార్డులో ధాన్యాన్ని ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ బుధవారం సందర్శించారు. భారీ వర్షాల వల్ల పంటలపై పడిన ప్రభావాన్ని స్వయంగా పరిశీలించారు. పంట నష్టం జరక్కుండా పొలాల నుంచి నీటిని బయటకు పంపించేందుకు అధికారులు చేసిన ఏర్పాట్లపై ఆరా తీశారు. ఏ ఒక్క రైతు బాధపడకుండా పంట నష్టం వివరాలను ఖచ్చితంగా నివేదించాలని అధికారులను ఆదేశించారు.
రైతులతో మాట్లాడి ప్రభుత్వ పరంగా పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని అధైర్యపడాల్సిన అవసరం లేదని భరోసా కల్పించారు. ప్రకృతి వైపరీత్యాలతో అకాల వర్షాలు వల్ల చేతికొచ్చిన పంట చేజారిపోవడం బాధాకరమన్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట ముంపునకు గురవడం కలచివేస్తోందన్నారు. పంటనష్టపరిహారం చెల్లింపుతో పాటు తడిసిన, రంగుమారిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తామన్నారు.