సిరా న్యూస్,ఏలూరు;
ఓ మాజీ ఎమ్మెల్యే. తన ఓటమికి కారణమైన వారిపై యాక్షన్ కూడా తీసుకోవడం లేదని రగిలిపోతున్నారట. ఇక గౌరవం దక్కని చోట ఉండేందుకు..తన దారి తాను చూసుకుంటానంటున్నారు ఓ వైసీపీ నేత. అయితే ఆయనకు సైకిల్ రైడ్ నచ్చుతుందా.? గాజు గ్లాస్‌లో టీ తాగాలనుకుంటున్నారా.? లేకపోతే లోటస్ ఫ్లవరే సో బెటర్ అనుకుంటున్నారా అనేది అంతుచిక్కడం లేదు. కానీ కండువా మార్చడం మాత్రం పక్కా అన్నట్లుగా లీకులు ఇస్తున్నారట. పార్టీ పవర్‌లో నుంచి దిగిపోయింది. మరో ఐదేళ్ల తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు. ఇప్పుడైతే గతంలో దక్కని గుర్తింపు బాధిస్తోంది. అందుకే వైసీపీలో అసంతృప్తులు బయటపడుతున్నాయి. ఐదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు సైలెంట్‌గా ఉన్న నేతలు ఇప్పుడు నిరసన గళం వినిపిస్తున్నారు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ..అధినేత తీరుపై గుస్సా అవుతున్నారు. గోదావరి తీరంలో దూకుడు రాజకీయాలకు పెట్టింది పేరైన మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్..పార్టీకి దూరంగా ఉండటం హాట్ టాపిక్‌గా మారింది. ఆయన పార్టీ మారిపోతారంటూ ప్రచారం జరుగుతోంది. అతని అనుచరులు కూడా ఇదే విషయాన్ని చెప్తున్నారు.గోదావరి జిల్లాలకు చెందిన ముఖ్యనేత, భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ కొన్నాళ్లుగా పార్టీపై అసంతృప్తితో ఉన్నారు. ఎన్నికల్లో ఓడిన తర్వాత అసలు బయటకు రాని గ్రంధి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. అందులో భాగంగా మాజీ సీఎం వైఎస్సార్ జయంతి, వర్ధంతి వేడుకలను కూడా పట్టించుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది. త్వరలో ఆయన వైసీపీని వీడనున్నట్లు ప్రచారం జరుగుతోంది. 2019 ఎన్నికల్లో జనసేనాని పవన్ కల్యాణ్‌ను ఓడించి సంచలనం సృష్టించిన తనకు..మంత్రి పదవి వస్తుందనుకుంటే తగిన గౌరవం, గుర్తింపు దక్కలేదనే అసంతృప్తితో రగిలిపోతున్నారట గ్రంధి.కాపు సామాజికవర్గానికి చెందిన గ్రంధి శ్రీనివాస్‌కు ఆ వర్గంలో మంచి ఫాలోయింగ్ ఉంది. కానీ వైసీపీలో మాత్రం పెద్దగా గుర్తింపు దక్కలేదని ఆవేదనతో ఉన్నారట. పైగా గ్రంధికి పోటీగా పార్టీలో మరో గ్రూపును తయారు చేశారని రగిలిపోతున్నారట. గత ప్రభుత్వంలో మంత్రి పదవిని ఆశించినా ఆయన ఆశ నెరవేర లేదు. విప్ పదవి ఇచ్చి సరిపెట్టింది వైసీపీ అధిష్టానం. తనకు మంత్రివర్గంలో చాన్స్ దక్కకపోడానికి తాడేపల్లి కేంద్రంగా జరిగిన రాజకీయమే కారణమని భావిస్తున్నారట. తొలి విడత మంత్రివర్గంలో చాన్స్ వస్తుందని ఆశిస్తే..రెండో విడతలో ఇస్తామని చెప్పి చివరి నిమిషంలో గ్రంధి శ్రీనివాస్ పేరును తప్పించారని చెబుతున్నారు. అప్పటి నుంచి అసంతృప్తిగా ఉన్న గ్రంధి అధికారంలో ఉండగా ఎప్పుడూ బయటపడలేదు. ఇప్పటికైనా తన నిరసనను అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లకపోతే ప్రయోజనం లేదని భావించి ఇప్పుడు అలకపాన్పు ఎక్కినట్లు తెలుస్తోంది.మరోవైపు భీమవరం నియోజకవర్గంలో తనకు ఎదురే లేదన్నట్లు రాజకీయం చేసిన మాజీ ఎమ్మెల్యే గ్రంధి..పార్టీలో మరో వర్గంతో అంతర్గత పోరు ఎదుర్కోవడం అసంతృప్తికి కారణమైందంటున్నారు. ఇదే నియోజకవర్గానికి చెందిన మోషేన్‌రాజుకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడంపాటు మండలి చైర్మన్ పోస్టు కట్టబెట్టడం గ్రంధికి రాజకీయంగా ఇబ్బందికరంగా మారిందంటున్నారు. నియోజకవర్గంలో తన హవాకు బ్రేక్ వేసేందుకే మోషేన్‌రాజుకు పెద్ద పదవి ఇచ్చారని మాజీ ఎమ్మెల్యే ఆవేదన చెందుతున్నట్లు సమాచారం.ఈ అసంతృప్తులతో పాటు అసెంబ్లీ ఎన్నికల్లో ఓ ముఖ్య నేత తనకు వ్యతిరేకంగా పనిచేశారని ఆరోపిస్తున్నారు మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్. తన ఓటమికి ప్రయత్నించిన నేతల లిస్టు పార్టీ అధిష్టానం దగ్గరున్నా, వారిపై చర్యలు తీసుకోలేదని ఆయన ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ పార్టీలో కొనసాగతారా? లేదా? అనే చర్చ తెరపైకి వస్తోంది. తన వ్యతిరేకులపై చర్యలు తీసుకోనంతవరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు.ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌తో మాజీ మంత్రులు కారుమూరి నాగేశ్వరరావు, పేర్ని నాని సమావేశం కావడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. త్వరలోనే గ్రంధి టీడీపీలో చేరుతారన్న ప్రచారంతో వైసీపీ అధిష్టానం అలర్ట్ అయింది. గ్రంధి శ్రీనివాస్‌తో కారుమూరి, పేర్నినాని దాదాపు గంట సేపు భేటీ అయ్యారు. అయినా వెనక్కి తగ్గలేదు మాజీ ఎమ్మెల్యే. పార్టీ కోసం ఇంత కష్టపడినప్పటికీ అధిష్టానం విప్ పదవితో సరిపెట్టిందని ఆవేదన వ్యక్తం చేశారట. తాడేపల్లి ప్యాలెస్‌లో కొంతమంది పెద్దలు తన ఎదుగుదలను అడ్డుకున్నారని ఆవేదన చెందుతున్నట్లు తెలుస్తుంది. అయితే ఇప్పటికే ఇతర పార్టీల నేతలతో ఆయన జరిపినట్లు తెలుస్తుంది. ఒకవేళ గ్రంధి శ్రీనివాస్ వైసీపీని వీడితే ఏ పార్టీలో చేరతారనే దానిపై భీమవరంలో హాట్ టాపిక్‌గా మారింది. మాజీ మంత్రుల రాయబారం ఫలిస్తుందా? లేక గ్రంధి శ్రీనివాస్ వైసీపీకి దూరమవుతారా అనేది చర్చనీయాంశంగా మారింది.