సిరా న్యూస్, ఆదిలాబాద్:
అదిలాబాద్ లో గృహజ్యోతికి కసరత్తు… ఇలా చేస్తే అందరికీ ఉచిత విద్యుత్…
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న ఉచిత విద్యుత్ పథకం “గృహ జ్యోతి” కోసం, ఆదిలాబాద్ లో అధికారులు కసరత్తు ప్రారంభించారు. ప్రతి నెల 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పొందేందుకు వినియోగదారులు తమ రేషన్ కార్డ్, ఆధార్ కార్డ్, సెల్ ఫోన్ నంబర్లను సంబంధిత వారి వారి విద్యుత్ మీటర్ సర్వీస్ నెంబర్ తో లింక్ చేయాల్సి ఉంటుందని ఆదిలాబాద్ ఎస్ఈ జే ఆర్ చౌహాన్ ఒక ప్రకటనలో తెలిపారు. మీటర్ రీడింగ్ కోసం వచ్చే స్పాట్ బిల్లర్ కు వివరాలు అందించాలని పేర్కొన్నారు. కిరాయి ఇండ్లలో నివసించే వారికి సైతం ఈ పథకం వర్తిస్తుందని ఆయన అన్నారు. సర్వీస్ మీటర్ తో రేషన్ కార్డ్, ఆధార్ కార్డ్, ఫోన్ నెంబర్ లింక్ చేయడం వల్ల ఓనర్ షిప్ లో ఎలాంటి మార్పు ఉండబోదని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయమై ఇంటి యజమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. ఇంటి వద్ద వినియోగదారులు ఉండే పరిస్థితి లేని ఎడల ఒక పేపర్ మీద ఆధార్ కార్డు నెంబర్, రేషన్ కార్డు నెంబర్, మొబైల్ నెంబర్ వ్రాసి మీటర్ వద్ద ఉంచాలని ఆయన కోరారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా సర్వీస్ మీటర్ తో తమ వివరాలు లింక్ చేసుకోవాలని సూచించారు.