సిరా న్యూస్, చిగురుమామిడి
ఉచిత కరెంటు మాకు వర్తించదా..?
* ఎంపీడీవో కార్యాలయం ముందు బాధితులు ఆందోళన..!
* తమ దరఖాస్తులు ఆన్లైన్లో నమోదు చేయలేదంటూ మండిపాటు
రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీలో భాగంగా గృహజ్యోతి 200 యూనిట్ల ఉచిత కరెంటు తమకు వర్తించడం లేదని కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల ఎంపీడీవో కార్యాలయం ముందు ప్రజాపాలన దరఖాస్తు పారం కరెంట్ బిల్లు చూపిస్తూ బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం మండల వ్యాప్తంగా 17 గ్రామాల్లో ఉన్న ప్రజాపాలన దరఖాస్తుదారులు ఉచిత కరెంటు జీరో బిల్లు రాకపోవడంతో మళ్లీ దరఖాస్తులు ఇవ్వడానికి ఎంపీడీవో కార్యాలయానికి పెద్ద ఎత్తున తరలివచ్చారు.ప్రజాపాలన దరఖాస్తు ఫారంలో గృహజ్యోతి 200 యూనిట్ల ఉచిత కరెంటు అప్లై చేసుకున్న…. అసలు ప్రజాపాలన దరఖాస్తులనే ఆన్లైన్లో నమోదు చేయకపోవడంతో అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనబడుతుందని బాధితులు ఆరోపిస్తున్నారు. చిగురుమామిడి మండల వ్యాప్తంగా దాదాపు 1450 ప్రజాపాలన దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు.సుమారు 650 నుంచి 700 వరకు గృహజ్యోతి ఉచిత కరెంటు కోసం దరఖాస్తులు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ దరఖాస్తులు ఆన్లైన్ నమోదు చెయ్యడానికి కొద్దిమంది ప్రైవేట్ వ్యక్తులు,రెవిన్యూ ఎంపీడీవో కార్యాలయం సిబ్బంది తో చేయించారు. ఏలాంటి అనుభవం లేని ప్రైవేట్ వ్యక్తులతో దరఖాస్తులు ఆన్లైన్ చేయించడంతోనే సరిగా నమోదు చేయక తప్పులు దొర్లయని ఆరోపిస్తున్నారు.అధికారుల నిర్లక్ష్యం వల్ల ఉచిత కరెంటు పథకం వర్తించడం లేదని వాపోయారు. మా పరిస్థితి ఏంటని బాధితులు అధికారులను అడగగా ధరఖాస్తులు మాత్రం తీసుకున్నారు. ఒకవైపు ప్రభుత్వం ప్రజాపాలన నిరంతర ప్రక్రియని చెబుతోంది.ఆన్లైన్ చెయ్యడానికి మాత్రం అధికారులేమో రెండు నుంచి నాలుగు నెలల సమయం పడుతుందని చెబుతుండడంతో బాధితులు ఆందోళన చెందుతున్నారు. నిజమైన లబ్ధిదారులమైన తమకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న గృహ జ్యోతి 200 యూనిట్ల ఉచిత కరెంటు పథకాన్ని వర్తింపచేయాలని హుస్నాబాద్ ఎమ్మెల్యే,రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ను వేడుకున్నారు. మండల వ్యాప్తంగా ఎంతోమందికి అన్యాయం జరిగింది.అధికారులు వారికి న్యాయం చేయాలి.బిజెపి గ్రామ ప్రధాన కార్యదర్శి బండి సందీప్, అన్నారు
మా దరఖాస్తులు ఆన్‌లైన్ చేయలేదు.. (బండి సందీప్, బొమ్మనపల్లి)
ప్రజాపాలనలో గృహజ్యోతి ఉచిత కరెంటు పథకం కోసం దరఖాస్తు చేసుకున్నాను. 20/4 దరఖాస్తు నంబర్. ఉచిత కరెంట్ రాలేదని ఎంపీడీవో కార్యాలయంలో చూపిస్తే మీ దరఖాస్తులు ఆన్లైన్ చేయలేదని అధికారులు చెబుతున్నారు.
అధికారం నిర్లక్ష్యం వల్ల ఉచిత కరెంట్ పథకాన్ని నేను కోల్పోయాను.
ఉచిత కరెంటు ఇవ్వాలి (బోడకుంట మల్లయ్య, ముదిమాణిక్యం)
ప్రజాపాలనలో గృహజ్యోతి పథకం కోసం దరఖాస్తు చేసుకున్నాడు.ధరఖాస్తు నంబర్ 04/29.ప్రజాపాలన దరఖాస్తును ఆన్లైన్ చేయలేదు.