సిరా న్యూస్, కోనరావుపేట
గల్ప్‌లో బాధితులకు రూ. 5 లక్షల సాయం
* ఉత్తర్వులు జారీ
గల్ప్ కార్మికులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంది. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా గల్ప్ లో మరణించిన కార్మికుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేసియాను అందించింది. ఇటీవల సౌదీలో రోడ్డు ప్రమాదానికి గురై చనిపోయిన రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ఇద్దరు కార్మికుల కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలోని బావుసాయిపేటకు చెందిన బొడ్డు బాబు మూడు నెలల కిందట బైరన్లో ప్రమాదవశాత్తూ చనిపోయాడు. బతుకుదెరువుకు గల్ప్ వెళ్లిన బాబు చనిపోవటంతో ఆ నిరుపేద కుటుంబానికి దిక్కులేకుండా పోయింది. ఎలాగైనా ప్రభుత్వం తమను ఆదుకోవాలని బాధిత కుటుంబీకులు ఇటీవలే ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ను కలిసి కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇటీవలే ఆది శ్రీనివాస్ ఈ విషయాన్ని ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ముఖ్యమంత్రి వెంటనే ఆ కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి సాయం అందించాలని అధికారులను ఆదేశించారు. సీఎం ఆదేశాలతో వేములవాడ నియోజకవర్గానికి చెందిన బాబు కుటుంబానికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సాయం విడుదల చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.