షెల్జా చుట్టూ హర్యానా రాజకీయం

 సిరా న్యూస్,ఛండీఘడ్;
హర్యానా అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి కుమారి సెల్జా దూరం పాటించడంతో రాజకీయాలు వేడెక్కాయి. సెల్జాను బుజ్జగించాల్సిన కాంగ్రెస్ హైకమాండ్ సైతం మౌనం పాటిస్తుండగా.. రాష్ట్ర అగ్రనేత, మాజీ సీఎం భూపేందర్ సింగ్ హుడా కూడా ఆమెను పూర్తిగా విస్మరించారు. ఈ పరిస్థితిని తమకు అనుకూలంగా మలచుకునేందుకు భారతీయ జనతా పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ సహా వివిధ రాజకీయ పార్టీలు ప్రయత్నాలు సాగిస్తున్నాయి. బీజేపీ నేత, కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ మాత్రమే కాదు, అర్జున్ రామ్ మేఘ్వాల్, బీఎస్పీ సమన్వయకర్త ఆకాష్ ఆనంద్ కాంగ్రెస్ నేత కుమారి సెల్జాతో మంతనాలు సాగిస్తున్నారు. తమ పార్టీలో చేరాలంటూ ఎవరికి వారు ఆమెకు ఆహ్వానాలు పంపుతున్నారు. సెల్జాకు ఆఫర్ల మీద ఆఫర్లు ఇస్తూ బీఎస్పీ, బీజేపీ ఎన్నికల ఎజెండాను సెట్ చేయడం ప్రారంభించాయి. దీంతో హర్యానా ఎన్నికల్లో కుమారి సెల్జా ఒక ప్రచారాంశంగా మారిపోయారు. తాజాగా బీఎస్పీ అధినేత్రి మాయావతి సైతం కుమారి సెల్జా పేరుతో దళిత నేతలను, తన వర్గం ఓటర్లను ఆకర్షించేందుకు ఎత్తుగడ వేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికల్లో ఎవరికి లాభం, ఎవరికి నష్టం జరుగుతుందన్న చర్చ జరుగుతోంది.సమాజంలో అత్యంత వెనుకబాటుతనానికి, సామాజిక వివక్షకు గురైన దళిత వర్గం ఓటర్లు దేశంలోని చాలా రాష్ట్రాల్లో నిర్ణయాత్మక శక్తిగా ఉన్నారు. హర్యానాలో ఈ అసెంబ్లీ ఎన్నికల్లో దళితుల ఓట్లు అత్యంత కీలకంగా మారాయి. కాంగ్రెస్ ఆశలన్నీ దళితుల ఓట్లపైనే ఉండగా.. లోక్‌సభలో కాంగ్రెస్‌కు లభించిన దళితుల ఓట్లను చీల్చడమే లక్ష్యంగా ప్రత్యర్థి పార్టీలు వ్యూహాలు అమలు చేస్తున్నాయి. బీజేపీ నుంచి బీఎస్పీ వరకు అందరూ కుమారి సెల్జా కోపాన్ని దళితుల ఆత్మగౌరవంతో ముడిపెడుతున్నారు. కుమారి సెల్జా దళితురాలు కాబట్టే ఆమెను కాంగ్రెస్ అవమానించిందని కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ నుంచి ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ, అనిల్ విజ్ వరకు బీజేపీ సీనియర్ నేతలు నిరంతరం చెబుతున్నారు. దళితులను అవమానించడమే కాంగ్రెస్ సంప్రదాయమని కుమారి సెల్జా గురించి కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ అన్నారు. ఏ నాయకుడిని దూషించడాన్ని బీజేపీ సహించదని, దూషించే పదాల వాడకాన్ని అసలు ప్రోత్సహించదని అన్నారు. భూపేంద్ర సింగ్ హుడా, ఆయన మద్దతుదారులు కుమారి సెల్జాను అవమానించిన తీరును ప్రజలు ఎప్పటికీ మరచిపోరని, ఇందుకు కాంగ్రెస్ తగిన ప్రతిఫలం అనుభవించాల్సి ఉంటుందని ఉంటుందని ఆయన అన్నారు. ఇదే మాదిరిగా ఇతర బీజేపీ నేతలు కూడా మాట్లాడుతున్నారు.బీజేపీ ప్రయత్నాలు ఇలా ఉంటే.. దళిత బహుజన వర్గాల గొంతుకగా పేరున్న బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) కూడా సెల్జా కోసం తమ ద్వారాలు తెరిచింది. ఆ పార్టీ సీనియర్ నేత ఆకాష్ ఆనంద్ నుంచి పార్టీ అధినేత్రి మాయావతి వరకు కుమారి సెల్జా సాకుతో దళిత వర్గాలను తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కుమారి సెల్జా కోసం బీఎస్పీ తలుపులు ఎప్పటికీ తెరిచే ఉంటాయని ఆకాష్ అన్నారు. దళిత నేతలను కాంగ్రెస్ గౌరవించడం లేదని మాయావతి కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్‌, ఇతర కులవృత్తుల పార్టీలు దళిత సంఘాల నాయకులను, ఓట్లను గడ్డు కాలంలో మాత్రమే వాడుకుని, ఆ తర్వాత విస్మరిస్తున్నాయని చెప్పేందుకు దేశంలో ఇప్పటివరకు జరుగుతున్న రాజకీయ పరిణామాలు నిదర్శనమని ఆమె వ్యాఖ్యానించారు. దళిత నాయకులు తమ దూత డాక్టర్ అంబేద్కర్‌ను స్ఫూర్తిగా తీసుకుని ఇలాంటి పార్టీలకు దూరం కావాలని పిలుపునిచ్చారు. అలాగే దళిత సమాజాన్ని సైతం ఇలాంటి పార్టీలకు దూరంగా ఉంచాలని అన్నారు.సిర్సా ఎంపీ కుమారి సెల్జా హర్యానాలో కాంగ్రెస్ పార్టీకి దళిత ముఖంగా ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ టికెట్‌ పంపిణీలో మాజీ సీఎం హుడా క్యాంప్‌కే ప్రాధాన్యం లభించగా సెల్జా తనకు సన్నిహితంగా ఉండే 8 నుంచి 10 మంది నేతలకు మాత్రమే టిక్కెట్లు ఇప్పించగలిగారు. ఇది మాత్రమే కాదు, ఆమె తన ఓఎస్డీ డాక్టర్ అజయ్ చౌదరికి కూడా టిక్కెట్టు ఇప్పించలేకపోయారు. ఈ పరిస్థితిలో హుడా క్యాంప్ మద్దతుదారులు చేసిన వ్యాఖ్యలతో సెల్జా కోపంగా ఉన్నారు. అలాగే ఎన్నికల ప్రచారానికి సైతం దూరంగా ఉన్నారు. హర్యానా రాజకీయాల్లో జాట్ సామాజికవర్గానిదే ఆధిపత్యం. అందులోనూ కాంగ్రెస్ పార్టీలో జాట్ వర్గం నేతలే పెత్తనం చెలాయిస్తూ ఉంటారు. అందుకే 90 అసెంబ్లీ నియోజకవర్గాలున్న హర్యానాలో ముఖ్యమంత్రి రేసులో ఉన్న కుమారి సెల్జా తన వర్గానికి టికెట్లు ఇప్పించుకోలేకపోయారు.హర్యానాలో దాదాపు 21 శాతం దళిత ఓటర్లు ఉన్నారు. రాష్ట్రంలోని మొత్తం 90 సీట్లలో 17 అసెంబ్లీ స్థానాలు ఎస్సీ రిజర్వ్ కేటగిరీలో ఉన్నాయి. అయితే వారి ప్రాబల్యం రిజర్వుడు సీట్లకు మాత్రమే పరిమితం కాలేదు. ఇంకా అనేక నియోజకవర్గాల్లో గెలుపోటములను ప్రభావితం చేసే సంఖ్యలో దళిత ఓటర్లున్నారు. కుమారి సెల్జా ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండటం వల్ల కాంగ్రెస్ అనుకూల దళిత వర్గాల్లో ఆగ్రహం, అసహనం పెరిగే అవకాశం లేకపోలేదు. రాష్ట్రంలో ఏ పార్టీనైనా మట్టికరిపించగల శక్తి దళిత ఓటర్లకు ఉంది. కుమారి సెల్జా కాంగ్రెస్ నుంచి దూరం జరిగితే, కాంగ్రెస్ ఎన్నికల వ్యూహాలన్నీ బెడిసికొట్టే ప్రమాదం ఉంది. ఎందుకంటే జాట్-దళిత సమీకరణం సహాయంతో అధికారం పొందాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఇప్పుడు బీఎస్పీ నుంచి బీజేపీ వరకు అందరూ సెల్జాను ప్రచారాంశంగా మార్చడంతో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి.కుమారి సెల్జా కారణంగా ప్రభావం పంచకుల, అంబాలా, యమునా నగర్, హిసార్ మరియు సిర్సాలోని 20 అసెంబ్లీ స్థానాలపై ఉంది. సెల్జా అసంతృప్తి కారణంగా, ఈ నియోజకవర్గాల్లో పార్టీ సమీకరణాలు చెదిరిపోవచ్చు. కుమారి సెల్జా సిర్సా నుండి లోక్‌సభ ఎన్నికలలో గెలుపొందిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ కంచుకోట నియోజకవర్గాలుగా ఉన్న ఈ స్థానాల్లో పాగా వేసేందుకు బీజేపీ, బీఎస్పీలు సెల్జాను ఒక అస్త్రంగా మార్చుకోవాలని చూస్తున్నాయి. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లలో వర్గీకరణ నిర్ణయం ద్వారా దళితుల్లో కొన్ని ఉప కులాలను తమవైపు తిప్పుకోవాలని బీజేపీ చూస్తోంది. దళితుల్లో అనేక ఉప కులాలు ఉన్నప్పటికీ, ఒకట్రెండు కులాలు మాత్రమే దళిత రిజర్వేషన్ల ఫలాలను అటు విద్య, ఉద్యోగాల్లో, ఇటు రాజకీయాల్లో బాగా ఉపయోగించుకుంటున్నాయి. మిగతా దళిత ఉపకులాలు మాత్రం తీవ్ర నిర్లక్ష్యానికి, నిరాదరణకు గురవుతున్నాయి. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లలో వర్గీకరణ కారణంగా ఈ ఉపకులాలు ప్రయోజనం పొందనున్నాయి. దళితుల ప్రాబల్యం ఉన్న ఈ 15-20 స్థానాల్లో బీజేపీ గ్రాఫ్ ఏమాత్రం బాగోలేదు. ఈ పరిస్థితుల్లో సెల్జా పార్టీలో చేరితే బీజేపీ ఈ స్థానాల్లో తమ గ్రాఫ్ మెరుగుపర్చుకుని విజయం సాధించవచ్చని భావిస్తోంది. ఎన్నికలకు ముందు బీజేపీ హర్యానా ప్రభుత్వం దళితులకు 20 శాతం రిజర్వేషన్లను రెండు భాగాలుగా విభజించి పెద్ద రాజకీయ ఎత్తుగడ వేసింది.హర్యానాలోని దళిత వర్గంలో అతిపెద్ద ప్రభావం రవిదాసీ కులానిదే, దళిత సమాజంలో 50 శాతానికి పైగా ఈ కులం ప్రజలున్నారు. రవిదాసీతో పాటు వాల్మీకి తదితర దళిత సంఘాలు అధిక సంఖ్యలో ఉన్నాయి. రవిదాసీ దళితులు పూర్తిగా కాంగ్రెస్‌తో ఉన్నారు. ఇతర దళిత సంఘాలు వివిధ పార్టీల ఓటర్లుగా చీలిపోయాయి. రవిదాసి వర్గం హర్యానా రాజకీయాల్లో ఆధిపత్యం చెలాయిస్తుంది. హర్యానాలో పదేళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం దళిత రిజర్వేషన్లను రెండు భాగాలుగా విభజించింది. ఇందులో రవిదాసిలకు 10% మరియు రవిదాసియేతర దళిత కులాలకు 10% రిజర్వేషన్లు కల్పించింది. రవిదాసియేతర కులాల్లో 36 కులాలున్నాయి. సెల్జా కూడా అత్యంత వెనుకబాటుకు గురైన ఈ 36 కులాల సమూహం నుంచే వచ్చారు.కుమారి సెల్జా కాంగ్రెస్ ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉంటే, బీజేపీ దాని నుండి రెట్టింపు ప్రయోజనం పొందే అవకాశం ఉంది. జాట్-దళిత కాంబినేషన్ ద్వారా లబ్ది పొందాలన్న కాంగ్రెస్ వ్యూహాలను దెబ్బతీయవచ్చు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు విజయాన్ని అందించిన దళిత ఓట్లను చీల్చి ప్రయోజనం పొందవచ్చు. మరోవైపు BSP కూడా తన కోర్ ఓటు బ్యాంకును తన గుప్పిట్లోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది. దీని కారణంగా ఆకాష్ ఆనంద్ నుండి మాయావతి వరకు అందరూ కుమారి సెల్జా వ్యవహారాన్ని రాజకీయం చేస్తున్నారు. ఇలా దళితుల ఓట్లను రాబట్టుకునేందుకు ఎవరికి వారు ఎత్తుగడలు వేస్తున్నారు. కానీ ఈ రాజకీయ చదరంగంలో ఎవరి ఎత్తులు ఫలించి ఎవరు ఎవరికి చెక్‌మేట్ చెబుతారు.. ఎవరు గెలుస్తారు అన్నది ఫలితాలే చెబుతాయి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *