సిరా న్యూస్,నెల్లూరు;
వైసీపీలో వలసలు ఆగినట్లేనా? లేక తాత్కాలికమా? ఇక వెళ్లేవారు ఎవరూ లేరా? అంటే రాజ్యసభ సభ్యుల్లో మాత్రం లేరనే చెప్పాలి. ఎందుకంటే మిగిలిన రాజ్యసభ సభ్యులు ఎక్కువ మంది తాము జగన్ పార్టీలోనే ఉంటామని చెప్పారు. మరికొందరు నేరుగా చెప్పకపోయినా జగన్ కు అత్యంత ఇష్టులు, సన్నిహితులు కావడంతో వారు కూడా పార్టీ మారే అవకాశం లేదంటున్నారు. ఇక రాజ్యసభ పదవికి రాజీనామా చేస్తే మళ్లీ చంద్రబాబునాయుడు తమను పెద్దల సభకు ఎంపిక చేస్తారన్న గ్యారంటీ కూడా లేదు. దీంతో ఇక దాదాపుగా వలసలు ఆగిపోయినట్లేనని పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. కానీ ఎమ్మెల్సీలు మాత్రం పార్టీని వీడే అవకాశాలున్నాయి.. వైసీపీకి రాజ్యసభ సభ్యులు మొత్తం పదకొండు మంది ఉన్నారు. వీరిలో మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ యాదవ్ లు పార్టీని వీడి వెళ్లారు. వీరు టీడీపీలో చేరుతున్నా వారికి రాజ్యసభ పదవి ఇచ్చే అవకాశం లేదంటున్నారు. ఇక మిగిలిన తొమ్మిది మందిలో ఆర్ కృష్ణయ్య, మేడా రఘునాధరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, విజయసాయిరెడ్డి, గొల్ల బాబూరావులు క్లారిటీ ఇచ్చారు. తమ రాజకీయ ప్రయాణం జగన్ తోనేనని తేల్చి చెప్పారు. అంటే ఆరుగు రాజ్యసభ సభ్యులు ఈ విషయాన్ని చెప్పారు. ఇక మిగిలిన ఇద్దరు సభ్యుల్లో వైవీ సుబ్బారెడ్డి పార్టీ మారే అవకాశమే లేదు. మరొక సభ్యుడు పరిమళ నత్వాని కూడా రాజీనామా చేయకపోవచ్చు. దీంతో తొమ్మిది మంది రాజ్యసభ సభ్యులు పార్టీనే అంటిపెట్టుకునే ఉంటారన్న భరోసా పార్టీ అధినేత జగన్ లో ఉంది. ఎమ్మెల్సీల విషయంలో… మరోవైపు ఎమ్మెల్సీల విషయంలో ఈ గ్యారంటీ లేదు.ఎందుకంటే ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్సీలు పార్టీని వదిలి పెట్టి వెళ్లారు. మిగిలిన వారు వెళ్లరన్న గ్యారంటీ లేదు. ఎందుకంటే వైఎస్ జగన్ ఎమ్మెల్సీ పదవులు పార్టీ పట్ల అంకితభావం, నిబద్దత లేని వారికి ఇచ్చారని పార్టీ వర్గాలే అంగీకరిస్తున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు కేవలం ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యుల మీదనే ఫోకస్ పెట్టారు. ఎందుకంటే ఏ పదవి ఖాళీ అయినా అది తమ కూటమి ఖాతాలోనే పడుతుంది. ఎమ్మెల్యేలు వైసీపీకి పదకొండు మంది ఉన్నా వారి జోలికి వెళ్లదలచుకోలేదు. దీనికి కారణం కూడా లేకపోలేదు. పార్టీలోకి రావాలంటే రాజీనామా చేయాలని షరతు పెట్టడంతో ఏ ఎమ్మెల్యే రాజీనామాకు అంగీకరించే అవకాశం అయితే లేదు. మరో వైపు వైసీపీ అధినేత జగన్ యూకే పర్యటనకు వెళుతున్నారు. దాదాపు ఇరవై రోజుల పాటు ఆయన రాష్ట్రంలోనే ఉండరు. ఈ సమయంలో పార్టీ మారేందుకు ఎమ్మెల్సీలు సిద్ధపడతారా? అన్న చర్చ జరుగుతుంది. వారిని ఆపేందుకు జగన్ కూడా అందుబాటులో ఉండరు. ఇదే కరెక్ట్ సమయమని జంపింగ్ నేతలు భావిస్తారు. అందుకే సెప్టంబరు నెలలో ఎక్కువగా ఎమ్మెల్సీలు మారతారన్న ప్రచారం జరుగుతుంది. కానీ ఎమ్మెల్సీలు కూడా తమకు పదవి తిరిగి ఇస్తామని గ్యారంటీ టీడీపీ నుంచి వస్తే తప్ప మారరు. కానీ చంద్రబాబు ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీ మారుతున్న వారికి అలాంటి హామీ ఇచ్చే అవకాశం లేదన్న భరోసా తప్ప వైసీపీ నేతల్లో మరొకటి కనిపించడం లేదు. మరి ఈ ఇరవై రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి మరి.