పేదరికం తగ్గిందా…తగ్గలేదా

సిరా న్యూస్,సిరా న్యూస్;
దేశంలో పేదరికం గణనీయంగా తగ్గిందని గత వారం నీతిఆయోగ్ తాజా నివేదికలో ప్రకటించింది. కేంద్రంలోని నరేంద్ర మోడీ నాయకత్వంలో గత తొమ్మిది సంవత్సరాల్లో ఏకంగా 24.82 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని పేర్కొంది. 2022-23తో ముగిసిన ఆర్థిక సంవత్సరం నాటికి దేశంలో పేదరికాన్ని తగ్గించామని నివేదికలో వివరించింది. అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం దీన్ని వ్యతిరేకిస్తోంది. ఇది కేంద్ర ప్రభుత్వం కుట్ర అంటూ కాంగ్రెస్ పార్టీ మండిపడింది. కేంద్రంలోని మోడీ సర్కార్ సంక్షేమ పథకాల్లో కోత పెట్టడానికి, ఉచిత రేషన్ ఇవ్వకుండా తప్పించుకోవడానికి ఇలాంటి గిమ్మిక్కులు చేస్తోందని విమర్శలు గుప్పించింది. 2022-23 నాటికి గత తొమ్మిది సంవత్సరాల్లో అత్యధికంగా ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్‌లో పేదరికం విశేషంగా తగ్గిందని నితీఆయోగ్ తాజాగా విడుదల చేసిననివేదికలో వివరించింది.దేశవ్యాప్తంగా పేదరికం 2013-14 నాటికి 29.17% ఉంటే 2022-23 నాటికి 11.28 శాతానికి దిగి వచ్చింది. 17.89 శాతానికి పేదరికం తగ్గింది. దీనిపై కాంగ్రెస్ అధికార ప్రతినిధి సోషల్ మీడియా డిపార్టుమెంట్ హెడ్ సుప్రియా శ్రీనాతే బిజెపి సర్కార్‌పై మండిపడ్డారు. ఈ లెక్కలన్నీ తప్పులతడక. ఇప్పటి వరకు మోడీ సర్కార్ ఆడుతున్న అబద్ధాల సరసన మరో అబద్ధం వచ్చిచేరిందని, ఇది లేటెస్ట్ జుమ్లా అని విమర్శించారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల వరకు ఇలానే బిజెపి అబద్ధాలువల్లే వేస్తుందని ఆమె విమర్శించారు. నీతిఆయోగ్ కూడా వాస్తవాలు దాస్తోందన్నారు. పేదరికం తగ్గిందని చెబుతున్న నీతిఆయోగ్ ఏ ప్రాతిపదికన దీనిపై అధ్యయనం చేసి పేదరికం తగ్గిందన్న అంచనాకు వచ్చిందని ప్రశ్నించారు. నీతిఆయోగ్ నివేదికలో ఇటు ప్రపంచ బ్యాంకు లేదా ఐఎంఎఫ్ ఏ ప్రాతిపదికన లెక్కించిందో ఆ ప్రాతిపదికన తాము లెక్కించి ఈ అంచనాకు వచ్చామని చెప్పలేదని సుప్రియా గుర్తుచేశారు. థర్డ్ పార్టీ స్టోరీలను నీతిఆయోగ్ ముద్రించి నివేదికగా తయారు చేసిందని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది.నీతిఆయోగ్ పేదరికంపై సర్వే గురించి థర్డ్ పార్టీకి సర్వే చేయమని బాధ్యతలు అప్పగించింది. థర్డ్ పార్టీ ఇచ్చిన నివేదికను నీతిఆయోగ్ ముద్రించి విడుదల చేసింది. వాస్తవానికి చూస్తే ప్రభుత్వం చెప్పే లెక్కలు.. గ్రౌండ్ రియాల్టీ వేరుగా ఉంటుందని ఆమె అన్నారు. ఈ గణాంకాలను బిజెపి ఎన్నికల్లో తమకు అనుకూలంగా వాడుకోవడానికి మాత్రమే పనికి వస్తుందంటోంది కాంగ్రెస్. నీతిఆయోగ్ సర్వేలో దేశంలో నిరుద్యోగం లేనేలేదంటోంది. వాస్తవానికి చూస్తే దేశంలో నిరుద్యోగ సమస్య విపరీతంగా ఉంది. నిత్యావసర సరకుల ధరలు చుక్కలనంటాయి. దేశంలో ఆర్థిక అసమానతలుపెరిగాయి. వేతనాలు తక్కువగా ఉన్నాయి. పేదరికం విపరీతంగా పెరిగిపోయిందని కాంగ్రెస్ పార్టీ తన వాదన వినిపిస్తోంది. వాస్తవానికి చూస్తే ప్రభుత్వం పేదరికాన్ని నిర్మూలించామని చెప్పి పేదలకు అందాల్సిన సంక్షేమ ఫలాలు ఎగ్గొట్టడానికి చేస్తున్న ప్రయత్నమని కాంగ్రెస్ చెబుతోంది.నీతిఆయోగ్ నివేదిక ప్రకారం ప్రస్తుతం 25 కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారు. కాబట్టి వారికి ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలుఅందవు. ఎందుకంటే వారి ఆదాయం పెరిగింది. వారికి ఇక నుంచి సబ్సిడీలు అందవు. ఉచిత రేషన్ లభించదు. ఇప్పటి వరకు ప్రభుత్వం ఇస్తున్న ఉచితాల నుంచి వారు దూరంగా కావాల్సి వస్తుందని శ్రీనాతే అన్నారు. నీతిఆయోగ్ నివేదికను అడ్డుపెట్టుకొని కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఆయాచితంగా లబ్ధిపొందాలనే కుట్ర దీని వెనుక దాగి ఉందని ఆమె విమర్శించారు. కాంగ్రెస్ మాత్రం దేశంలో పేదరికం తగ్గలేదని తమ వాదన వినిపిస్తోంది. దీనికి వారు చెబుతున్న కారణాల ఇలా ఉన్నాయి. ఒకవేళ దేశంలో ఏకంగా 25 కోట్లమంది పేదరికం నుంచి బయటపడ్డారని చెబుతున్న ప్రభుత్వం వాస్తవానికి చూస్తే దేశంలో వినియోగం ఎందుకు తగ్గిందని ప్రశ్నించారు. ఒకవేళ పేదరికం 11.7% తగ్గిందనుకుంటే ఇక దేశంలో పేదలు కేవలం 15 కోట్లు మంది మాత్రమే ఉన్నట్లు లెక్క. మోడీ సర్కార్ దేశంలోని 80కోట్ల మందికి ఉచిత రేషన్ ఎందుకు ఇస్తోందని ప్రశ్నిస్తోంది. ఇక నీతి ఆయోగ్ నివేదికను థర్డ్ పార్టీ ఎవ్వరు ఆమోదించడం లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *