సిరాన్యూస్, ఆదిలాబాద్
అధికారుల నిర్లక్ష్యం.. డీఎస్సీ అభ్యర్థులపై ఆర్థిక భారం
* హిందీ భాషా సమితి జిల్లా అధ్యక్షులు సుకుమార్ పెట్కులే
డీఎస్సీ పరీక్ష కేంద్రాల కేటాయింపులో అభ్యర్థులు తమకు అనుకూలమైన కేంద్రాలను ప్రాధాన్యత క్రమంలో పెట్టినప్పటికీ అధికారుల నిర్లక్ష్య ధోరణి కారణంగా ఆదిలాబాద్ జిల్లాకు చెందిన అనేకమంది అభ్యర్థులకు కరీంనగర్, వరంగల్ జిల్లాలో పరీక్ష కేంద్రాలను కేటాయించడం వల్ల వారు వ్యయ ప్రయాసలకు ఓర్చుకొని పరీక్షా కేంద్రాలకు చేరుకోవాల్సి వస్తుందని హిందీ భాష సేవా సమితి జిల్లా అధ్యక్షులు సుకుమార్ పెట్కులే అన్నారు. బుధవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఒక జిల్లా నుండి ఇంకో జిల్లాకి పరీక్ష కేంద్రాలు కేటాయించబడ్డ డీఎస్సీ అభ్యర్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించి ఆదుకోవాలని కోరారు. జూలై 18 నుండి ఆగస్టు మూడు వరకు జరిగే ఈ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు పరీక్షా కేంద్రాల వద్ద పరీక్షకు ముందు పరీక్ష తర్వాత భోజన వసతి సౌకర్యాన్ని కల్పించాలని, పరీక్ష కేంద్రాల వరకు ఆర్టీసీ బస్సులను నడిపే విధంగా చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. నిరుద్యోగ డీఎస్సీ అభ్యర్థుల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదని, అవసరమైతే నెలరోజుల పాటు డీఎస్సీని వాయిదా వేసి పోస్టుల్ని పెంచి నోటిఫికేషన్ జారీ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.