సిరా న్యూస్;
జపాన్ దేశానికి చెందిన చారిత్రక పట్టణాల్లో హిరోషిమా ఒకటి. జపాన్‌లోని అతిపెద్ద ద్వీపమైన హోంషులో ఉంది. రెండవ ప్రపంచ యుద్ధం చివరిలో అనగా.. 1945 సంవత్సరం ఆగస్టు 6వ తేదీన అగ్రదేశం అమెరికా జపాన్‌పై ఈ అణుబాంబు దాడి జరిపింది. ఈ దాడి జరిగిన క్షణాల్లోనే హిరోషిమా నగరం భస్మీపటలమైంది. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా అణుబాంబు దాడికి గురైన నగరం కూడా ఇదే. ఆ తర్వాత అదే ఏడాది, అదే నెల తొమ్మిదో తేదీన నాగసాకిపై అమెరికా రెండో అణు బాంబును ప్రయోగించి ఆ ప్రాంతాన్ని సర్వనాశనం చేసింది.
హిరోషిమా నగరాన్ని 1589లో మోరి టెరిమోటో స్థాపించాడు. ఆ తర్వాత జరిగిన యుద్ధాల్లో ఈ నగరం మరెందరో రాజుల వశమైంది. బలమైన ఆర్థిక వ్యవస్థ మరియు సైనిక వ్యవస్థను కలిగి ఉండటం దీని సొంతం. రెండో ప్రపంచ యుద్ధంలో చుగోకు ప్రాంత సైన్యపు ప్రధాన స్థావరం హిరోషిమా నగరం కావడం విశేషం. సైన్యానికి సరఫరా చేసే అనేక ఆయుధ డిపోలు ఈ నగరంలో ఉండేవి. అందుకే ఈ నగరంపై అమెరికా కన్నుపడింది.
ఫలితంగానే అమెరికా 1945, ఆగస్టు ఆరో తేదీన ఉదయం గం.8.15 నిమిషాలకు బి-29 అనే బాంబర్ విమానం ద్వారా అణుబాంబును హిరోషిమాపై జారవిడిచింది. ఇలా మొదటిసారిగా అణుబాంబు ద్వారా ధ్వంసం చేయబడ్డ తొలి నగరంగా హిరోషిమా ప్రపంచ చరిత్ర పుటలకెక్కింది. అణుబాంబు దాడి జరిగిన కొన్ని క్షణాల్లోనే 70 వేల మందికి పైగా మరణించగా, అణుధూళి వల్ల మరో 90 వేల నుంచి లక్షా 40 వేల మంది మరణించినట్లు గణాంకాలు చెపుతున్నాయి.
నాటి దాడికి హిరోషిమాలోని భవనాల్లో సుమారు 69 శాతం నేలమట్టమయ్యాయి. అంతేకాదు 1942లో 4,19,182గా ఉన్న నగర జనాభా అణు దాడితో 1,37,197కు చేరిందంటే దాడి ప్రభావం ఎంత తీవ్రమైనదో అర్థం చేసుకోవచ్చు. నేటికి ఈ సంఘటన జరిగి సరిగ్గా 79సంవత్సరాలు. 1955 నాటికి పూర్తిగా కోలుకున్న ఈ నగరం.. అంచెలంచెలుగా అభివృద్ధి చెందింది.