గులాబీ నేతలపై గుర్రు..

సిరా న్యూస్,హైదరాబాద్;
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై మొన్నటి వరకు నిప్పులు చెరిగిన బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారకరామారావు.. మొన్నటి వరకు సైలెంట్‌ అయ్యారు. అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో హరీశ్‌రావు అన్నీ తానై వ్యవహరించాడు. అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా కేటీఆర్‌ పెద్దగా మాట్లాడలేదు.నాగర్‌కర్నూల్‌ లోక్‌సభ నియోజకవర్గస్థాయి సమావేశం ఆదివారం(ఫిబ్రవరి 25న) నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన కేటీఆర్‌ మరోమారు సీఎం రేవంత్‌రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్‌రెడ్డి తెలంగాణకు ఎన్నికైన ముఖ్యమంత్రి కాదని, సీఎం పదవి కోసం ఢిల్లీలో లాబీయింగ్‌ చేసి మేనేజ్‌మెంట్‌ కోటాలో సీఎం అయ్యారని ఆరోపించారు.బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ కన్నా.. ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి అస్సలు మింగుడు పడడం లేదు. మరోవైపు తమకు బద్ధ శత్రువు అయిన రేవంత్‌రెడ్డి సీఎం కావడం కేటీఆర్‌ అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు. తాను కూర్చోవాల్సిన సీటులో రేవంత్‌ కూర్చున్నాడేంటా అని కాలు కాలిన పిల్లిలా ఛాన్స్‌ దొరికినప్పుడల్లా సీఎంను ఏకి పారేస్తున్నాడు. ఈ క్రమంలో నెల క్రితం ‘కనకపు సింహాసనంపై శునకుమును కూర్చోబెట్టిన’ అంటూ సుమతీ శతకం ఫొటోను ఎక్స్‌లో ట్వీట్‌ చేశారు. ఇది రేవంత్‌రెడ్డి ఉద్దేశించి చేసిందే అని చర్చ జరిగింది. ఇక 420 హామీలు అంటూ ప్రచారం చేశారు. తర్వాత గ్యారంటీల అమలుపై నిలదీస్తున్నారు. తాజాగా గాలివాటం సీఎం కాదని సంచలన వ్యాఖ్యలు చేశారు.రేవంత్‌రెడ్డిని కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికలకు ముందే సీఎం అభ్యర్థిగా ప్రకటించి ఎన్నికలకు వెళ్లి ఉంటే కాంగ్రెస్‌ పార్టీ 30 ఎమ్మెల్యే సీట్లు కూడా గెలిచేది కాదని కేటీ ఆర్‌ అన్నారు. అదృష్టవశాత్తు సీఎం పీటం దక్కించుకున్న గాలివాటం సీఎం రేవంత్‌రెడ్డి అని పేర్కొన్నారు. అసలు రేవంత్‌కు సీఎం అయ్యేంత గౌరవం, అర్హత లేదని వ్యాఖ్యానించారు.మరోవైపు గులాబీ నేతలపై ప్రజల్లో కసి ఇంకా తగ్గడం లేదు. తమ ఓటమిపై సమీక్ష చేసుకోకుండా, తమ తప్పులు తెలుసుకోకుండా ఇంకా అహంకార పూరితంగా సీఎం రేవంత్, ప్రభుత్వంపై విమర్శలు ఆరోపణలు చేయడాన్ని ప్రజలు గమనిస్తున్నారు. తీరు మార్చుకోకుంటే వచ్చే పార్లీమెంట్‌ ఎన్నికల్లోనూ బీఆర్‌ఎస్‌ భారీ మూల్యం చెల్లించుకోకతప్పదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయినా గులాబీ నేతల్లో ఓటమిపై పశ్చాత్తాపం ఏ కోశాన కనిపించడం లేదు. రేవంత్‌ సీఎం అయ్యాడన్న ఆక్రోశం, ఎప్పుడు ఆయనను గద్దె దించాలన్న కుట్ర కోణమే ఎక్కువగా కనిపిస్తోంది. రేవంత్‌ మాజీ సీఎం, ప్రస్తుత ప్రతిపక్ష నేతలు అసెంబ్లీకి రావాలని మర్యాదగా కోరుతుంటే.. ఆ పార్టీ నేతలు మాత్రం ఆ విషయాన్ని పట్టించుకోవడం లేదు. తమది ఎదురు దాడే అన్నట్లు వ్యవహరించడం బీఆర్‌ఎస్‌లోనే చర్చకు దారితీస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *