సిరా న్యూస్,ఉరవకొండ;
ఈసారి ఎన్నికల ఫలితాల ప్రకటనలో అనంతపురం జిల్లా లోని, ఉరవకొండ నియోజక వర్గంలో గెలుపు ఓటముల గురించి ఆసక్తికరమైన చర్చలు జరుగుతున్నాయి. ఇక్కడ ఉమ్మడి అభ్యర్థి గా పయ్యావుల కేశవ్,వైసీపీ అభ్యర్థి గా వై.విశ్వేశ్వర్ రెడ్డి బరిలో ఉన్నారు. దీంతో ఇక్కడి అభ్యర్థుల గెలుపోట ములపై ప్రజల్లో ఉత్కంఠ ఎక్కువగా ఉంది. కొన్ని దశాబ్దాలుగా ఉరవకొండ నియోజకవర్గంలో పయ్యావుల కేశవ్, వై.విశ్వేశ్వర్ రెడ్డి మధ్య హోరాహోరీగా పోరు నడుస్తోంది. తమకు పోలవుతున్న ఓట్లలో పెద్దగా తేడా లేకపోవడంతో మొదటి నుంచీ ఇద్దరూ పట్టుదలకు పోతున్నారు. రీ కౌంటింగ్ కోసం పట్టుబట్టడం, చెల్లని ఓట్లపై పేచీలు పెట్టుకోవడం, సంతకాలు చేయకుండా మొరాయించడం… చేస్తుంటారు. పయ్యావుల, విశ్వ ల మధ్య హోరాహోరీతో అర్ధరాత్రి వరకు హైడ్రామా నడిచేది. ప్రతి ఎన్నికల్లోనూ ఇలాంటి పరిస్థితే ఉంటుది. అందుకు ప్రతిసారి తుది ఫలితం ఉరవకొండ నియోజకవర్గం నుంచే వచ్చేది. ఈసారి అటువంటి సంఘటనలు జరగకుండా… ఇందుకోసం పటిష్ట బందోబస్తు, ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు. మిగతా అసెంబ్లీ నియోజక వర్గాల కౌంటింగ్ కు భిన్నంగా ఉరవకొండ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. గతంలో తలెత్తిన ఇబ్బందులను దృష్టి లో పెట్టుకుని టీడీపీ అభ్యర్థి పయ్యావుల కేశవ్ ఎన్నికల కమిషన్ కు లేఖ రాశారు. దీనికి స్పందించిన ఈసీ ఉరవకొండ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాల్సిందిగా జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ కు ఆదేశాలు ఇచ్చింది. దీంతో 18 టేబుళ్లు ఏర్పాటు చేసి కౌంటింగ్ త్వరగా నిర్వహించనున్నారు. మిగతా నియోజకవర్గాల్లో 14 టేబుళ్లే ఉంటాయి.ఉరవకొండకు మాత్రం ప్రత్యేకంగా నాలుగు అదనపు టేబుళ్లు కేటాయిం చారు. దీంతో 15 రౌండ్లలో తుది ఫలితం వెల్లడి కానుంది. నియోజకవర్గ వ్యాప్తంగా మొత్తం 263 పోలింగ్ బూత్ లు ఉన్నాయి. ఒక్కో రౌండుకు 18 లెక్కన 14 రౌండ్లు పూర్తి అయ్యే సరికి 252 బూత్ లు అయిపోతాయి. 15వ రౌండుకు కేవలం 11 టేబుళ్లపై చివరి 11 బూత్ లకు సంబంధించిన ఓట్లు మాత్రమే లెక్కిస్తారు. ఈ లెక్కన సజావుగా లెక్కింపు ప్రక్రియ కొనసాగితే సాయంత్రం నాలుగు గంటలకే తుది ఫలితం వెలువడే అవకాశముంటుంది.
====================