సిరా న్యూస్,రాజమండ్రి;
ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంత ప్రజలకు మిచౌంగ్ తుపాను తీరని నష్టం చేసింది. మూడు రోజుల పాటు కోస్తా జిల్లాలతో పాటు, రాయలసీమలో కొన్ని ప్రాంతాల్లో తీవ్ర నష్టం కలిగించింది. కోతకొచ్చి పంట నీట మునిగిన దృశ్యాలు కోస్తా జిల్లాలో ఎక్కడ చూసినా కనిపిస్తున్నాయి.బాపట్ల వద్ద మంగళవారం తీరం దాటే క్రమంలో గంటకు 100 నుండి 120 కి.మీ వేగంతో వీచిన ప్రచండ గాలులతో అనేక చోట్ల చెట్లు, విద్యుత్ స్థంబాలు నేలకూలాయి. గ్రామాలు అంధకారంలో చిక్కుకున్నాయి. భారీ వర్షాలతో అసలే అంతంతమాత్రంగా ఉన్న రోడ్లు మరింతగా దెబ్బతిన్నాయి. ఈ లెక్కలన్నీ తేలితే కానీ, వాస్తవంగా జరిగిన నష్టం ఎంతన్నది స్పష్టం కాదు.లక్షలాది ఎకరాల వరిపంట నీట మునిగింది. కొన్ని చోట్ల కోసి పొలాల్లో వేసిన ఓదేలు నీళ్లలో తేలుతూ కనపడుతున్నాయి. కళ్లాల్లో పోసిన ధాన్యం కూడా తడిసిముద్దయింది. తుపాన్ తీరం దాటిన బాపట్ల జిల్లాలోనే దాదాపు 2 లక్షల ఎకరాల దాకా వరిపంట నీటమునిగినట్టు ప్రాధమిక సమాచారం. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో కూడా కొంచెం అటుఇటుగా ఆ స్థాయిలోనే నష్టం జరిగినట్టు చెబుతున్నారు. నెల్లూరు,తిరుపతి జిల్లాలతో పాటు ఉమ్మడి గోదావరి జిల్లాల్లో కూడా కూడా వరిపంట నీట మునిగింది. వేల రూపాయల పెట్టబడితో పాటు, ఆరుగాలం పడ్డ కష్టం నీళ్ల పాలు కావడం రైతాంగం గుండెలు బాదుకుంటోంది. మిర్చి, పొగాకు, వేరుశనగ, పసుపు తదితర పంటలు కూడా దెబ్బతిన్నాయి. ఈ ఏడాది సీజన్ ప్రారంభంలో వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో నానా కష్టాలు పడి పంటలు సాగు చేసిన రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. తుపాను రాష్ట్రం వైపు దూసుకు వస్తుందని వారం రోజుల కింద నుంచే వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. కానీ ప్రభుత్వం వైపు నుంచి తీసుకున్న చర్యలపై స్పష్టత లేదు. కానీ తుపాను వస్తుందని తెలిసినా.. నాగార్జున సాగర్ డ్యామ్ ను వివాదాస్పద రీతిలో అధీనంలోకి తీసుకుని నీటిని విడుదల చేసుకున్నారు. కానీ ఆ నీరు పొలాల్లోకి చేరే సరికి తుపాను వచ్చింది. ఆ నీరు వల్ల ఉపయోగం లేకపోయింది. అసలు సాగర్ డ్యామ్ పై డ్రామా విషయంలో రాజకీయం ఉందన్న ఆరోపణలు వచ్చాయి. ఈ విషయాన్ని పక్కన పెడితే.. తుపాను సూచనలు వారం ముందు తెలిసినా.. రైతులు కనీసం ధాన్యాన్ని జాగ్రత్త చేసుకునే సౌకర్యాలు కూడా కల్పించలేదన్న విమర్శలను ప్రభుత్వం ఎదుర్కొంటోంది. ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు చాలా నింపాదిగా వ్యవహరిస్తారు. మూడేళ్ల క్రితం కడప జిల్లాలో అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయినప్పుడు ఆయన చాలా ఆలస్యంగా అక్కడ పర్యటించారు. ఆ సమయంలో ముఖ్యమంత్రి విచిత్రమైన వాదన వినపించారు. తాను అక్కడికి వెళ్తే.. పనులకు ఆటంకం అవుతుందని అధికారులు అందరూ తనతో ఉంటే.. పనులు ఎవరు చేస్తారని అన్నారు. ఈ వాదన విన్న వారికి కాస్త విచిత్రంగా అనిపిస్తుంది. ముఖ్యమంత్రి ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారంటే అధికారులు మరింత గట్టిగా పని చేస్తారు. కానీ సీఎం జగన్ మాత్రం అలా అనుకోవడం లేదు. ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ముఖ్యమంత్రి అక్కడకు వెళ్లాల్సిన అవసరం ఏమిటని.. సీఎం అక్కడకు వెళ్తే అధికారులంతా ఆయన వెంటే ఉంటారని ఇక సహాయ చర్యలు ఎవరు చేస్తారని చాలా సార్లు ప్రశఅనించారు. ఆ తర్వాత పలుమార్లు విపత్తులు వచ్చాయి కానీ సీఎం జగన్ అంత వేగంగా స్పందించలేదు. ఇప్పుడు మించౌంగ్ తుపాను విషయంలోనూ అంతే. ఓ వైపు తుపాను బీభత్సం సృష్టిస్తూంటే.. ఆయన ఓ పార్టీ నాయకుని కుటుంబంలో పెళ్లికి వెళ్లారు. కనకదుర్గ ఆలయంలో గతంలో చేసిన శంకుస్థాపనలకే మళ్లీ శంకుస్థాపనలు చేశారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు పర్యటన ఖరారైన రోజునే ఆయన కూడా ఒక్క రోజు వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించాలని నిర్ణియంచుకున్నారు.