సిరా న్యూస్,విశాఖపట్టణం;
టీడీపీ నేతలపై ఆ వైసీపీ నేతకు ఉన్నట్లుండి ఒక్కసారిగా ప్రేమ, ఆప్యాయత, అనురాగాలు చిగురించాయి. ఏకంగా ఆ నేతలకు సంఘీభావంగా ట్వీట్ కూడా చేశారు ఆ వైసీపీ నేత. వారికి అన్యాయం జరుగుతోంది.. నేను ఒప్పుకోననే రీతిలో ఆ నేత ట్వీట్ చేసిన తీరుకు సొంత పార్టీ నేతలే షాకయ్యారట. ఇంతకు ఆ నేత ఎవరో తెలుసా.. సాక్షాత్తు వైసీపీ నేత విజయసాయిరెడ్డి.మాజీ సీఎం జగన్ సొంత జిల్లా కడప. ఈ జిల్లాలో ఎన్నికల వేళ ప్రజలు ఇచ్చిన తీర్పు వైసీపీకి షాక్ అని చెప్పవచ్చు. ఉమ్మడి జిల్లా పరిధిలో కేవలం 3 ఎమ్మేల్యే సీట్లు మాత్రమే వైసీపీకి దక్కాయి. మిగిలిన సీట్లన్నీ టీడీపీ కూటమి సొంతమయ్యాయి. జిల్లా కేంద్రమైన కడప నియోజకవర్గం కూడా టీడీపీ వశమైంది. 2019 ఎన్నికలలో వైసీపీ క్లీన్ స్వీప్ చేయగా, 2024 ఎన్నికలకు మాత్రం టీడీపీ కూటమి హవా సాగింది. అయితే ఎంతైనా మాజీ సీఎం జగన్ స్వంత జిల్లా కావడంతో, ఈ ఫలితాలు కొంచెం వైసీపీకి మింగుడు పడని పరిస్థితి. ఊహించని ఫలితాలతో టీడీపీ ఈ జిల్లాలో కూడా జోష్ పెంచిందని చెప్పవచ్చు.తరుణంలో తాజాగా వైసీపీ నేత, ఎంపీ విజయసాయిరెడ్డి ఏకంగా కడప టీడీపీ నేతలకు మద్దతుగా ఓ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ ద్వారా తాను టీడీపీ నేతలకు మద్దతుగా ఉన్నట్లు చెప్పకనే చెప్పారు విజయసాయిరెడ్డి.ఇంతకు ఆ ట్వీట్ లో ఏముండంటే.. మాజీ సీఎం జగన్ స్వంత జిల్లా కడప జిల్లా టీడీపీ నేతలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని, ఇటీవల ప్రకటించిన తిరుమల తిరుపతి దేవస్థానం కమిటీలో కూడా చోటు దక్కలేదని, అలాగే నామినేటెడ్ పదవుల్లో సరిపడా పదవులు లేకపోవడంతో కడప నుండి టీడీపీ, స్వంత నేతలను కూడా పక్కన పెడుతోందని విమర్శించారు. అంతేకాదు రెండు సంవత్సరాలలోగా తప్పనిసరిగా కడప టీడీపీ నేతలందరూ వైసీపీలో చేరడం ఖాయమంటూ జోస్యం చెప్పారు.ఈ ట్వీట్ ను చూస్తే కడప టీడీపీ నేతలను రెచ్చగొట్టే ధోరణిలో వైసీపీ ప్రయత్నిస్తుందని టీడీపీ నేతలు అంటున్నారు. ఎవరికి ఎప్పుడు ప్రాధాన్యత ఇవ్వాలన్నది తమ పార్టీ అధినేత అభిప్రాయమని, ఇటువంటి వాటిని తాము లెక్క చేసేది లేదంటున్నారు టీడీపీ నేతలు. ఏదిఏమైనా టీడీపీ నేతలపై విజయసాయి రెడ్డి ఆప్యాయత అనురాగాలు చూస్తుంటే, వైసీపీ చూపు కడప వైపే ఉందన్న అభిప్రాయం కూడా వ్యక్తం చేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు.