36 మంది మావోయిస్టులు హతం
మావోయిస్టులకు కోలుకోలేని ఎదురుదెబ్బ
పెద్ద ఎత్తున ఆయుధాలు స్వాధీనం
సిరా న్యూస్,రాయ్ పూర్;
ఛత్తీస్ గడ్ లో భద్రతా బలగాలు పక్కా ప్రణాళికతో మావోలను మట్టుబెట్టాయి. అబూజ్ మడ్ అటవీ ప్రాంతంలో పెద్ద ఎత్తున మావోలు సమావేశం అయ్యారనే సమాచారంతో 2 వేల మంది భద్రతా బలగాలు మావోలను చుట్టుముట్టారు. మావోయిస్టులు కోలుకునే లోపే భద్రత బలగాల తుపాకులు గర్జించాయి. మావోయిస్టులు తప్పించుకునే పరిస్థితి లేకపోవడంతో ఎదురు కాల్పులకు దిగినా…. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది.వరుస ఎన్కౌంటర్లతో 2024 జనవరి నుండి ఇప్పటి వరకు సుమారు 250 మందికి పైగా మావోయిస్టులు వివిధ ఎన్కౌంటర్లలో మృతిచెందగా, శుక్రవారం ఛత్తీస్ ఘడ్ నారాయణ్ పూర్,దంతే వాడ జిల్లాల సరిహద్దు ప్రాంతం మాద్ అటవీ ప్రాంతంలో పోలీసులకు మావోయిస్టులకు మధ్య భారీగా చోటుచేసుకున్న భీకర ఎదురు కాల్పులలో 36 మంది మావోయిస్టులు మృతిచెందారు. మృతి చెందిన మావోయిస్టుల్లో అగ్ర నేతలు ఉండి ఉంటారనే ప్రచారం జోరుగా సాగుతుంది. పోలీసు ఉన్నతాధికారులు ఎన్కౌంటర్లో మృతి చెందిన మావోయిస్టులను గుర్తించే పనిలో ఉన్నారు.ఘటనా స్థలం నుంచి భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకోవడం జరిగిందని, కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయని ఎస్. పి ప్రభాత్ కుమార్ తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని, ఈ ఎదురు కాల్పులలో భద్రతా బలగాలకు ఎటువంటి నష్టం వాటిల్లలేదని పోలీసు అధికారులు పేర్కొన్నారు.