పేరు మారిస్తే…. రాత మారుతుందా….

సిరా న్యూస్, హైదరాబాద్;
బీఆర్ఎస్ పేరును మళ్లీ టీఆర్ఎస్‌గా మార్చాలన్న ప్రతిపాదన వచ్చేసింది. ఆ పార్టీ సీనియర్ నేత కడియం శ్రీహరి పార్టీ వేదికపైనే దీని గురించి ప్రస్తావించారు. అందుకే ఈ అంశంపై చర్చ ప్రారంభించారు. నిజానికి తెలంగాణ అనే పదమే కేసీఆర్‌కు బలం. అయినా కేసీఆర్ రిస్క్ చేసుకుని పేరులో నుంచి తెలంగాణ తీసేసి భారత రాష్ట్ర సమితిగా పార్టీని మార్చారు. అనుభవమైతే కానీ తత్వం బోధఫడదన్నట్లుగా ఓటమి తర్వాత తాము చేసిన తప్పేమిటో తెలిసి వచ్చినట్లయిందన్న అభిప్రాయం వినిపిస్తోంది. భారత రాష్ట్ర సమితి పార్టీ పేరును మళ్లీ తెలంగాణ రాష్ట్ర సమితిగా మార్చాలన్న డిమాండ్లు ఆ పార్టీలో వినిపించడం ప్రారంభించాయి. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలని భావించి తెలంగాణ రాష్ట్ర సమితి ని భారత్ రాష్ట్ర సమితి గా మార్చారు కేసీఆర్. అయితే తెలంగాణ అస్థిత్వాన్ని కోల్పోయినట్లుగా అయింది. అలా పేరు మార్చినప్పుడే.. చాలా మంది తెలంగాణతో ఇక బీఆర్ఎస్‌కు సంబంధంలేదని ప్రచారం చేశారు. దీంతో ఇప్పుడు బీఆర్ఎస్ తిరిగి టీఆర్ఎస్‌గా మార్చాలనే ప్రతిపాదనలు వస్తున్నాయి. బీఆర్ఎస్ పేరుతో ఎన్నికలకు వెళ్లి ఓడిపోయామని.. పార్టీ తిరిగి పూర్వపేరుకు వెళ్లడం ద్వారా ప్రజలకు తిరిగి దగ్గరవ్వాలని భావిస్తోంది. తెలంగాణ రాష్ట్ర సమితి అనే పేరులో ఓ ఎమోషన్ ఉంది. అది తెలంగాణ ప్రజలకు మాత్రమే తెలుసు. తెలంగాణ వాదం నరనరాన నింపుకున్న వారికి మాత్రమే అనుభవమవుతుంది. ప్రతి రాజకీయ పార్టీలు కొంత ఓటు బ్యాంక్ ఉంటుంది. చాలా పార్టీలకు కులం.. బీజేపీకి మతం వంటివి ఓటు బ్యాంకులు. కానీ టీఆర్ఎస్‌కు ఓటు బ్యాంక్ తెలంగాణ వాదం. కుల, మతాలకు అతీతంగా తెలంగాణ వాదమో ఓటు బ్యాంక్. ఓ రకంగా ఈ సెంటిమెంటే బీఆర్ఎస్‌కు కవచ కుండలాలు కానీ.. కేసీఆర్ ఏం ఆలోచించారో కానీ..జాతీయ నాయకుడు అయిపోవాలన్న ఉద్దేశంతో ఆ సెంటిమెంట్ ను వదిలేసుకున్నారు. కారణం అది అయినా కాకపోయినా పరాజయం ఎదురైంది. అసలు పేరు మార్పు లక్ష్యం మాత్రం పూర్తిగా పక్కకుపోయింది. ఇప్పుడు బీఆర్ఎస్ పేరుతో ఇతర రాష్ట్రాల్లో పోటీ చేయలేని దుస్థితి. తెలంగాణ వాయిస్‌ను మాత్రమే పార్లమెంట్ లో వినిపిస్తామని బీఆర్ఎస్‌కే ఓటేయాలని అడగాలని విధానంగా పెట్టుకున్నారు కాబట్టి ఇతర రాష్ట్రాల్లో పోటీ ఆలోచన కూడా ఉండదు. గతంలో మహారాష్ట్ర, తెలంగాణలో కలిసి యాభై లోక్ సభ సీట్లు గెలిస్తే కేంద్రంలో చక్రం తిప్పవచ్చని కేసీఆర్, కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పుడు .. మహారాష్ట్ర వైపు చూసేందుకు కూడా తీరిక ఉండటం లేదు. అలా చూస్తే తెలంగాణలో ఉన్న బేస్ కూడా మిస్ అయిపోయే ప్రమాదం ఏర్పడింది. దీన్ని గుర్తించిన సీనియర్ నేతలు.. పేరు మార్పు ప్రతిపాదనను హైకమాండ్ ముందు పెట్టారు. పార్టీలో తెలంగాణను తీసేసి భారత్‌ను చేర్చడం వల్ల బీఆర్ఎస్ తమది కాదన్న భావన ప్రజల్లోకి వెళ్లిందని.. ప్రజలు అలా భావించి దూరమై ఉంటారని భావిస్తున్నారు. వారిని తిరిగి ఆకర్షించాలంటే పార్టీ పేరును మార్చడం తప్ప మరోమార్గం లేదన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. అంతేకాదు, ఎక్కువమంది కార్యకర్తలు కూడా అదే అభిప్రాయపడుతున్నట్టు నేతలు చెబుతున్నారు. ఈ పేరు మార్పు అంశంపై కేటీఆర్, హరీష్ రావు ఎలాంటి స్పందన వ్యక్తం చేయలేదు. కానీ పలువురు క్యాడర్ మాత్రం మద్దతు తెలుపుతున్నారు. కానీ ఇప్పుడు మళ్లీ పార్టీ మార్చడం సాధ్యమేనా అన్న అంశంపై కూడా చర్చ జరుగుతోంది. సాంకేతికంగా పేరు మార్చడానికి పెద్ద ఇబ్బందేం ఉండదని.. తీర్మానం చేసి పంపితే.. ఎన్నికల సంఘం ప్రాసెస్ ప్రకారం నిర్ణయం తీసుకుంటుంది కానీ ఇలా చేయడం వల్ల నిలకడ లేని రాజకీయ విధానంపై ప్రజల్లో ఎక్కువగా చర్చ జరుగుతుందని అది ఇంకా మైనస్ అవుతుందన్న అభిప్రాయంతో కొంత మంది ఉన్నారు. భారత రాష్ట్ర సమితి అనే పేరు ఎక్కువగా ప్రచారం జరగకుండా చూసుకున్నా ప్రయోజనం ఉండటం లేదని.. కేసీఆర్ జాతీయ రాజకీయాలకు వెళ్తారని ఎక్కువ మంది భావించడంతోనే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశారని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.ఇప్పటికిప్పుడు బీఆర్ఎస్ పేరును టీఆర్ఎస్ గా మార్చకపోయినా తర్వాత జరిగే పరిణామాలను బట్టి.. రెండు, మూడేళ్ల తర్వాత కేసీఆర్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత పరిస్థితల్ని అంచనా వేసి.. మళ్లీ తెలంగాణ వాదంతో కేసీఆర్ తనదైన మార్క్ చూపిస్తే పాత బలాన్ని.. నిరూపించుకోవచ్చని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *