పార్టీ మారితే… కుక్కలు, నక్కలు అయిపోతారా…

సిరా న్యూస్,నల్గోండ;
తెలంగాణలో పార్లమెంటు ఎన్నికల వేళ రాజకీయం వేడెక్కుతోంది. మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు రైతుల పరామర్శ పేరుతో క్షేత్రస్థాయిలోకి వచ్చారు. మూడు జిల్లాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడారు. వారి సమస్యలు తెలుసుకున్నారు. తర్వాత నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో కీలక వ్యాఖ్యలు చేశారు.యాసంగి పంటలకు కాంగ్రెస్‌ ప్రభుత్వం సాగునీరు ఇవ్వకపోవడంపై కేసీఆర్‌ ఫైర్‌ అయ్యారు. బీఆర్‌ఎస్‌ అధికారంలో ఎన్నప్పుడు ఎకరం పొలం కూడా ఎండిపోలేదని, కేసీఆర్‌ ఓడిపోయినంక ఎందుకు ఎండిపోతున్నాయని ప్రశ్నించారు. అన్నీ రెడీ చేసి పెట్టినా నడపడం చేత కావడం లేదని ఆరోపించారు. కరెంటు కూడా కేసీఆర్‌ దిగిపోంగనే స్విచ్‌ ఆఫ్‌ చేసినట్లు ఆగిపోతుందని ఎద్దేవా చేశారు. నడిపించడం చేతకాకనే రాష్ట్రంలో కరువు, కరెంటు కోతలు ఏర్పడ్డాయన్నారు. ఇది వచ్చిన కరువు కాదని, కాంగ్రెస్‌ తెచ్చిన కరువని ఆరోపించారు.ఇక బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, నాయకులు పార్టీని వీడి అధికార కాంగ్రెస్‌లోకి వెళ్తుండడంపైనా కేసీఆర్‌ స్పందించారు. కుక్కలు, నక్కలను చేర్చుకుంటున్నారని ఆరోపించారు. చిల్ల రాజకీయాలు చేయడం మాని ప్రజల సమస్యలపై దృష్టిపెట్టాలని ప్రభుత్వానికి సూచించారు. ఒకరిద్దరు పోతే పార్టీకి నష్టం లేదన్నారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వం వెంట పడతామని, తరుముతామని హెచ్చరించారు.ఇక కేసీఆర్‌ చాలా రోజుల తర్వాత తనదైన శైలిలో సొంత పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులపైనే తీవ్ర పదజాల వాడారు. ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా ఇదే అంశంపై చర్చ జరుగుతుంది. కుక్కలు, నక్కలు అయితే టికెట్లు ఎందకు ఇచ్చాడని కొందరు ప్రశ్నిస్తున్నారు. బీఆర్‌ఎస్‌లో ఉన్నప్పుడు మంచి లీడర్‌ అని పొగిడి, ఎన్నికల్లో ప్రచారం చేసిన కేసీఆర్‌.. అధికారం పోగానే, నేతలు పార్టీ వీడుతుండగానే అదే నేతలు, కుక్కలు, నక్కలు అవుతారా అన్న ప్రశ్నలు కూడా వస్తున్నాయి. ఈ భాష కూడా మొన్నటి ఎన్నికల్లో గులాబీ పార్టీకి తీవ్ర నష్టం చేసిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయినా.. మళ్లీ అలాగే మాట్లాడడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. నచ్చిన వారిని అందలం ఎక్కించడం.. నచ్చని వారిని అధః పాతాళానికి తొక్కడ కేసీఆర్‌కు అలవాటే అని గులాబీ భవన్‌లోనే ఆ పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *