సిరా న్యూస్,విజయవాడ;
వచ్చే ఎన్నికల్లో వైసీపీ సిట్టింగ్ లను జగన్ మార్చనున్నారా? ప్రజా వ్యతిరేకత కలిగిన ఎమ్మెల్యేలకు ఈసారి టిక్కెట్ లేనట్టేనా? వారి స్థానంలో ప్రత్యామ్నాయ నాయకులకు అవకాశం కల్పించనున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ముఖ్యంగా తెలంగాణ ఎన్నికల ఫలితాలను జగన్ గుణపాఠంగా తీసుకుంటున్నారు. అక్కడ సిట్టింగులను మార్చక పోవడం వల్లే బీఆర్ఎస్ ఓటమి చవిచూసిందని తెలియడంతో అన్ని విధాలా జాగ్రత్త పడుతున్నారు.2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓటమికి ప్రధాన కారణం ఎమ్మెల్యేలపై ఉన్న వ్యతిరేకత. దీనిని అప్పట్లో చంద్రబాబు లైట్ తీసుకున్నారు. తనపై నమ్మకంతో ప్రజలు గెలిపిస్తారని విశ్వసించారు. కానీ ఆయన ఒకటి తలిస్తే.. ఏపీ ప్రజలు మరోలా తీర్పు ఇచ్చారు. వైసీపీకి అంతులేని విజయం కట్టబెట్టారు. తెలుగుదేశం పార్టీకి 23 స్థానాలకే పరిమితం చేశారు. ఇప్పుడు తెలంగాణలో సైతం అదే సీన్ కనిపించింది. చాలామంది సిట్టింగ్ ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత ఉంది. ఈ విషయాన్ని కెసిఆర్ సైతం గుర్తించారు. కానీ తనపై నమ్మకంతో ప్రజలు గెలిపిస్తారని భావించారు. కానీ ఆ అంచనా తప్పైంది.ఇప్పుడు తెలంగాణ ఫలితం.. ఏపీలో సైతం రిపీట్ అవుతుందని విశ్లేషణలు ప్రారంభమయ్యాయి. ఇది జగన్కు ఏమాత్రం మింగుడు పడడం లేదు. దీంతో సిట్టింగ్ ఎమ్మెల్యేల మార్పు అనివార్యంగా మారనుంది. ఇప్పటికే జగన్ పలుమార్లు సర్వేలు చేయించుకున్నారు. వెనుకబడిన ఎమ్మెల్యేలను హెచ్చరించారు. ప్రజల్లోకి వెళ్లాలని ఆదేశించారు. లేకుంటే మార్చేస్తానని హెచ్చరించారు. దాదాపు 60 మంది ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత ఉందని ప్రచారం జరుగుతోంది. వారందరి స్థానంలో ప్రత్యామ్నాయ నాయకులను తీసుకురావాలని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవైపు ప్రజా వ్యతిరేకత, మరోవైపు టిడిపి, జనసేన కూటమి కట్టడం జగన్ కలవరపాటుకు కారణం. ఆ 60 మంది సిట్టింగులను మార్చకుంటే మాత్రం దెబ్బ తినడం ఖాయంగా తెలియడంతో జగన్ అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తప్పనిసరిగా మార్పునకు మొగ్గు చూపుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.