సిరా న్యూస్, పెందుర్తి:
పెదగాడిలో అక్రమ నిర్మాణాలు…
+ చెరువును కబ్జా చేసి మరీ ఇండ్లు
+ సర్వే నం. 70, 71ని రీసర్వే చేయాలని ఆదేశాలు
విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం పెదగాడి గ్రామంలో అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నాయి. కొంత మంది గ్రామంలోని చెరువును కబ్జా చేసి, ఇండ్లు నిర్మించారు. చెరువుకు చెందిన భూమికి పక్కాగా హద్దులు లేకపోవడంతో పలువురు కబ్జాకు తెరలేపారు. సర్వే నంబరు 70, 71లో చెరువు భూమి ఉండగా, ఎలాంటి పత్రాలు లేకుండా కబ్జాదారులు అక్రమంగా ఇండ్లు నిర్మిస్తున్నారు. దీంతో గ్రామానికి చెందిన గంధం నరేష్ కలెక్టర్ కార్యాలయంలోని ఇరిగేషన్ అధికారులకు ఫిర్యాదు చేసారు. అక్రమంగా ఇండ్లు నిర్మిస్తున్న వారిపై చర్యలు తీసుకొని, చెరువు భూమిని కాపాడాలని అధికారులకు విన్నవించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన అధికారులు ఇరిగేషన్ వర్కింగ్ ఇన్‌స్పెక్టర్ సుబ్బరాజును నిజనిర్ధారణ కోసం పంపించారు. చెరువు స్థలాన్ని పరిశీలించిన అయన చెరువు భూమి కబ్జాకు గురైనట్లు ప్రాథమికంగా నిర్ధారించి, ఉన్నత అధికారులకు నివేదికలు అందించారు. దీంతో సర్వే నంబరు 70, 71లో రీ సర్వే చేసి, హద్దులు నిర్ధారించాలని కోరుతూ పెందుర్తి ఎమ్మార్వో కార్యాలయానికి ఇరిగేషన్ అధికారులు ఇటీవలే లేఖ రాసారు. అయినప్పటికీ రెవెన్యూ అధికారులు ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో అధికారులు వెంటనే చెరువు స్థలాన్ని రీ సర్వే చేసి, హద్దులు నిర్ధారించి, చెరువును కాపాడాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.