సిరా న్యూస్,విజయవాడ;
పింఛన్లు పెంపు, మెగా డీఎస్సీ , ఉచిత ఇసుక, ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు సహా పలు హామీలు నిలబెట్టుకున్న కూటమి ప్రభుత్వం…మరో మూడు కీలక ఎన్నికల హామీలు అమలు దిశగా అడుగులు వేస్తోంది. పేదల ఆకలి తీర్చే అన్నక్యాంటీన్లు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, హెల్త్ ఇన్స్‌రెన్స్ పథకాలు అమల్లోకి తెచ్చేందుకు కసరత్తు చేస్తోంది. ఆగస్టు 15నుంచి అన్న క్యాంటీన్లు అందుబాటులోకి రానున్నాయి. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కూడా అదే రోజు నుంచి అందుబాటులోకి తీసుకురానున్నారుతెలుగుదేశం( ప్రభుత్వం హయాంలో అత్యంత ఆదరణ పొందిన అన్నక్యాంటీన్లు జగన్ మూతవేశారు. ఐదురూపాయలకే పేదల ఆకలి తీర్చే ఈ క్యాంటీన్లను మళ్లీ పునరుద్ధరిస్తామని ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు హామీ ఇచ్చారు. అలాగే కర్ణాటక, తెలంగాణ(లో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కారణమైన ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణసౌకర్యాన్ని సైతం మహిళలకు కల్పిస్తామని తెలిపారు. ఈ మేరకు ఆగస్టు 15 నుంచి అన్న క్యాంటీన్లు అందుబాటులోకి రానున్నాయి. శిథిలావస్థకు చేరిన క్యాంటీన్ భవనాలను తిరిగి పునరుద్ధరిస్తున్నారు. ఇప్పటికే 183 అన్నక్యాంటీన్లు అందుబాటులోకి తెచ్చేందుకు స్థానిక పురపాలకశాఖకు అప్పగించారు. దాదాపు 20 కోట్ల రూపాయల నిధులను రాష్ట్ర ప్రభుత్వం అందజేసింది. మరోవైపు అన్నక్యాంటీన్లకు అవసరమైన కంప్యూటర్లు, ప్రింటర్లు, ఇంటర్‌నెట్ పరికరాల కొనుగోలు కోసం మరో 7 కోట్ల రూపాయలు అందజేసింది. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే నిర్మాణ దశలో ఆగిపోయిన మరో 20 అన్నక్యాంటీన్ భవనాలు నిర్మాణాలు పూర్తి చేసేందుకు 65 కోట్ల రూపాయలు త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయనుందిఈసారి అన్నక్యాంటీన్ల నిర్వహణలో ప్రజలను సైతం భాగస్వామ్యం చేయనున్నారు. గతంలో ప్రభుత్వం ఐదురూపాయలకే టిఫిన్, భోజనం అందించగా…ఈసారి ప్రజలను సైతం ఇందులో మమేకం చేయనున్నారు. వాస్తవానికి ఇప్పటికే చాలచోట్ల అన్నక్యాంటీన్లను తెలుగుదేశం ఆధ్వర్యంలో ప్రారంభించి నిరంతరం భోజనం అందిస్తున్నారు. దాతల సహకారంతో ఈ క్యాంటీన్లు సొంతంగా నడుపుతున్నారు. పెళ్లిరోజులు, పుట్టినరోజులు లేదా తల్లిదండ్రుల జ్ఞాపకార్థం ఎవరైనా ఆరోజు ఆహారం అందించేందుకు సాయం చేస్తే వారి పేరిట భోజనాలు పెడుతున్నారు. ఇక మీదట కూడా దీన్ని కొనసాగించనున్నారు. ఎవరైనా ముందుకు వచ్చి వారు సూచించిన వారి పేరిట భోజనం పెట్టాలని కోరితే….అందుకు తగ్గ రుసుము తీసుకుని ఆ రోజు వారి పేరిట భోజనం అందించనున్నారు. అదేరోజు క్యాంటీన్ ఆవరణలో దాతల పేర్లు ప్రదర్శించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎంతమందికి భోజనం పెడితే ఎంత ఖర్చు అవుతుందనే వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు. అలాగే విరాళాలు సైతం సేకరించే పనిలో ఉన్నారు. అన్నక్యాంటీన్ పేరిట ట్రస్టు ఏర్పాటు చేసి దీనిద్వారా నిధులు సమీకరించనున్నారు. ఇటు దాతల సహకారం, అటు ప్రభుత్వ నిధులతో అన్న క్యాంటీన్లు గతం కన్నా మిన్నగా నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉంది.కూటమి పార్టీలు ఎన్నికల్లో ఇచ్చిన మరో కీలకహామీ మహిళలకు ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం. దీన్ని సైతం ఆగస్టు 15న ప్రారంభించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఆర్టీసీకి వచ్చే నష్టాన్ని ప్రభుత్వం భర్తీ చేయనుంది.ఆధార్ కార్డు ఆధారంగా రాష్ట్రంలో ఉన్న మహిళల అందరికీ ఈ అవకాశం కల్పించేందుకు చకచకా ఏర్పాట్లు సాగిపోతున్నాయి. ఇప్పటికే కర్ణాటక(, తెలంగాణలో ఈ పథకం పనితీరును పరిశీలించిన అధికారులు అక్కడి ఇబ్బందులు, సాంకేతిక అంశాలు, నిర్వహణ భారంత తదితర అంశాలపై ఓ అవగాహనకు వచ్చారు. అక్కడి కన్నా మెరుగ్గా ఇక్కడ నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన మరో కీలక హామీని సైతం అమలు చేసేందుకు ఏపీ సర్కార్ కసరత్తు చేస్తోంది. ప్రతి కుటుంబానికి 25లక్షల ఆరోగ్య బీమాకల్పించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. కేంద్రం ఇప్పటికే ఆయూష్మాన్ భారత్ పేరిట 5 లక్షల ఇన్స్‌రెన్స్ అందిస్తుండగా…దీన్ని పది లక్షలకు పెంచనుంది. దీనికి అదనంగా 15 లక్షలు కలిపి ప్రజలకు అందించేలా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. 15 లక్షలకు అవసరమైన రాష్ట్రవాటాను ప్రభుత్వం అందించనుంది.
=====================