సిరా న్యూస్,హైదరాబాద్;
కాంగ్రెస్ హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను వంద రోజుల్లో అమలు చేసి రాష్ట్రాన్ని సంక్షేమ రాజ్యంగా మారుస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ఆరు గ్యారెంటీల్లోని రెండు పథకాలైన మహలక్ష్మి, చేయూత పథకాల్ని ప్రారంభించారు. మహాలక్ష్మి పథకంలో భాగంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంతో పాటు ఆరోగ్యశ్రీ పరిమితిని 10 లక్షల రూపాయలకు పెంచింది కాంగ్రెస్. ఆర్టీసీ బస్సుల్లో సోమవారం రికార్డు స్థాయిలో ప్రయాణికుల రాకపోకలు సాగించారు. 50 లక్షల మందికి పైగా బస్సుల్లో ప్రయాణించినట్లు ఆర్టీసీ అధికారులు వివరించారు. ఆదివారం సుమారు 41 లక్షలున్న ఈ సంఖ్య, సోమవారానికి మరో 9 లక్షలు పెరిగింది. ఉచిత ప్రయాణం అందుబాటులోకి రావడం.. కార్తిక మాసం ఆఖరి సోమవారం కావడంతో మహిళలు రికార్డు స్థాయిలో బస్సుల్లో ప్రయాణాలు చేశారు. ఈ రద్దీని ముందే ఊహించిన ఆర్టీసీ ఉన్నతాధికారులు రెగ్యులర్‌తో పాటు స్పేర్ బస్సులను నడిపించగా డ్రైవర్లు, కండక్టర్లు వారాంతపు సెలవు తీసుకోకుండా విధులు నిర్వహించారు.