హైడ్రాకు ఫిర్యాదు చేస్తామంటూ బెదిరించి వసూళ్లకు పాల్పడితే జైలుశిక్ష

హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌ హెచ్చరిక
 సిరా న్యూస్,హైదరాబాద్‌ ;
హైడ్రాకు ఫిర్యాదు చేస్తామంటూ బెదిరించి వసూళ్లకు పాల్పడితే జైలు జీవితం తప్పదని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌ హెచ్చరించారు. కొద్ది రోజులుగా ట్రై సిటీ పరిధిలో హైడ్రా విభాగం అక్రమ నిర్మాణాల తొలగింపులు చేపడుతున్న నేపథ్యంలో కొద్దిమంది సామాజిక కార్యకర్తల ముసుగులో అక్రమాలకు పాల్పడుతున్నారు. బఫర్ జోన్, ఎఫ్.టి.ఎల్ పరిధిలో లేదా వాటి పరిసరాల్లో నిర్మాణం చేపడుతున్న బిల్డర్ల ను ఇది అక్రమ నిర్మాణమని, బఫర్ జోన్, ఎఫ్.టి.ఎల్ పరిధిలో నిర్మిస్తున్నారని హైడ్రాకు ఫిర్యాదు చేస్తామని బెదిరిస్తున్నారు.అలాగే అధికారులతో ఉన్న ఫొటోలు చూపించి హైడ్రా విభాగంలోని ఉన్నతాధికారులతో తమకు పరిచయాలు ఉన్నాయని, మీకు ఎలాంటి సమస్య రాకుండా చేస్తామని ఇందుకోసం కొంత డబ్బు ముట్టజెప్పాలని ఒత్తిడి చేస్తున్నారని చెప్పారు. హైడ్రాకు ఫిర్యాదు చేస్తామని కొంతమంది వ్యక్తులు, సంస్థలు, బిల్డర్లను, బహుళ అంతస్తులు, వ్యక్తిగత గృహల్లో నివాసం ఉంటున్న వారి వద్ద ఇలాంటి బెదిరింపులకు పాల్పడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు.ఎవరైనా ఇలాంటి బెదిరింపులకు పాల్పడినా ఇతర ప్రభుత్వ విభాగలైన రెస్క్యూ, మున్సిపల్, నీటి పారుదల విభాగాల్లో ఇలా ఒత్తిడి చేస్తే ప్రజలు, బిల్డర్లు తక్షణమే స్థానిక పోలీస్ స్టేషన్‌లో గాని ఎస్పీ, సీపీకి గాని లేదా హైడ్రా కమిషనర్, ఏసీబీకి ఫిర్యాదు చేయాలన్నారు. ఈ విభాగాన్ని నీరు గార్చాలని చూసినా, తప్పుదోవ పట్టించే విధంగా ప్రయత్నించినా అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *