సిరా న్యూస్,హైదరాబాద్;
విశ్వనగరంగా హైదరాబాద్ ఇప్పటికే ఎదిగింది. పెట్టుబడిదారులు భాగ్యనగరానికి క్యూ కడుతున్నారు. ఈ నేపథ్యంలో విశ్వనగరం నుంచి వివిధ దేశాలకు ప్రయాణం సాగించేవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. దీంతో విమానయాన సంస్థలు హైదరాబాద్ నుంచి అంతర్జాతీయ కనెక్టివిటీ పెంచుతున్నాయి.దేశంలో ఫ్లైట్ కనెక్టివిటీ విస్తరిస్తోంది. ఇదే సమయంలో హైదరాబాద్ నుంచి దేశంలోని వివిధ నగరాలతోపాటు, వివిధ దేశాలకు నేరుగా విమానాలు రాకపోకలు సాగిస్తున్నాయి. హైదరాబాద్ నుంచి ఏడు ప్రధాన నగరాలకు ఇటీవలే విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. దీంతో ఉత్తర, దక్షిణాది రాష్ట్రాలకు హైదరాబాద్ ప్రధాన ద్వారంగా మారుతోంది. ఇదే సమయంలో అంతర్జాతీయ కనెకిటవిటీ కూడా పెరుగుతోంది. ప్రయాణికుల డిమాండ్ మేరకు విమాన సర్వీసులు విస్తరించేందుకు ఎయిర్‌లైన్స్ సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి.హైదరాబాద్ నుంచి దేశంలోని అన్ని ప్రధాన నగరాలకు విమాన సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. గతనెలలో కేవలం పది రోజుల వ్యవధిలో ఏడు కొత్త నగరాలకు సర్వీసులు ప్రారంభమయ్యాయి. హైదరాబాద్ నుంచి రాజ్‌కోట్, జమ్మూ కశ్మీర్, అగర్తలా, కాన్‌పూర్, అయోధ్య, ప్రయాగ్‌రాజ్, ఆగ్రా నగరాలకు ఇటీవలే విమాన సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. ఈ సర్వీసుల ఆక్యుపెన్సీ కూడా సంతృప్తికరంగా ఉన్నట్లు ఎయిర్‌పోర్టు వర్గాలు తెలిపారు. రాజ్‌కోట్‌కు ప్రతీరోజూ ఫ్లైన్ నడుపుతున్నారు. అగర్తలాకు వారానికి మూడు రోజులు సర్వీసులు నడుస్తున్నాయి. ఇక జమ్మూ కశ్మీర్‌కు ప్రారంభించిన విమాన సర్వీసులకు పర్యాటకుల నుంచి ఆదరణ లభిస్తోంది. వారానికి మూడు రోజులు విమానాలు నడుపుతున్నారు. దీంతో డొమెస్టిక్ కనెక్టివిటీ 69 నుంచి 76 నగరాలకు పెరిగినట్లు ఎయిర్‌పోర్టు వర్గాలు తెలిపాయి.ఇక హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి న్యితం 60 వేల మంది 6పయాణికులు దేశంలోని వివిధ నగరాలకు రాకపోకలుసాగిస్తున్నారు. ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, కోల్‌కతా నగరాలకు ఎక్కువ మంది ప్రయాణిస్తున్నారు. గోవా, వైజాగ్, కొచ్చి, తిరుపతి, అహ్మదాబాద్ నగరాలకు సైతం హైదరాబాద్ నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. అయోధ్యకు కూడా ప్రయాణికులు పెరిగారు అయితే నేరుగా విమాన సర్వీసులు లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. రైలు ప్రయాణానికి మూడు నాలుగు రోజులు కేటాయించేవారు. గత నెల 27 నుంచి అయోధ్యకు విమాన సర్వీస్‌లు ప్రారంభమయ్యాయి. దీంతో భక్తులు ఎక్కువగా రాకపోకలు సాగిస్తున్నారు. ప్రయాగరాజ్, ఆగ్రాకు కూడా సర్వీసులు ప్రారంభించారు.ఇక హైదరాబాద్ ఎయిర్ పోర్టు నుంచి ప్రస్తుతం 18 అంతర్జాతీయ నగరాలకు విమాన సర్వీసులు కొనసాగుతున్నాయి. రోజుకు 15 వేల మందికిపైగా ప్రయాణాలు సాగిస్తున్నారు. ఈ ఏడాది కొత్తగా జర్మీనీకి సర్వీసులు ప్రారంభించారు. లుప్తాన్సా ఎయిర్‌లైన్స్ వారానికి 5 సర్వీసులు ప్రారంభించింది. ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే బ్యాంకాక్, రియాద్, జెడ్డా తదితర నగరాలకు సర్వీసులు పెరిగాయి. ఈ ఏడాది చివరి వరకు మరిన్ని అంతర్జాతీయ సర్వీసులు ప్రారంభించే అవకాశం ఉంది. న్యూయార్క్, శాన్‌ఫ్రాన్సిస్‌కో, డల్లాస్, మెల్‌బోర్న్, సిడ్నీ, పారిస్, అమ్సాట్యామ్ తదితర నగరాలకు త్వరలో సర్వీసులు అందుబాటులోకి వస్తాయని తెలుస్తోంది.