బీజేపీపై ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు
సిరా న్యూస్,న్యూ డిల్లీ;
కేంద్రంలోని అధికార బీజేపీపై ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు చేశారు. తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను కొనేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని చెప్పారు. ఇందులో భాగంగానే ఏడుగురు ఎమ్మెల్యేలకు పార్టీ మారితే ఒక్కొక్కరికి రూ.25 కోట్లు ఇస్తామంటూ ఆఫర్ చేసిందని తెలిపారు.ఆప్‌కు చెందిన మొత్తం 21 మంది ఎమ్మెల్యేలతో బీజేపీ పెద్దలు చర్చలు జరిపారని, ఢిల్లీ మద్యం కేసులో కేజ్రీవాల్‌ను త్వరలోనే అరెస్ట్ చేస్తామంటూ ఎమ్మెల్యేలను బెదిరించారని అన్నారు. తమ ప్రభుత్వాన్ని కూలగొట్టే ప్రయత్నంలో భాగంగానే ఇలా చేస్తోందని మండిపడ్డారు. ఈ మేరకు కేజ్రీవాల్ ఓ ట్వీట్ చేశారు. ‘21 మంది ఎమ్మెల్యేలతో చర్చలు జరిగాయి. ఇతర ఎమ్మెల్యేలతో కూడా సంప్రదింపులు జరుపుతున్నాం. ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వాన్ని కూల్చేస్తాం. మీరు కూడా మాతో రావొచ్చు. రూ.25 కోట్లు ఇస్తాం ఎన్నికల్లో బీజేపీ టికెట్‌పై పోటీ చేయండి’ అంటూ తమ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే ప్రయత్నం చేసిందని కేజ్రీవాల్ ఆరోపించారు. అయితే ఆప్ ఎమ్మెల్యేలు అందరూ బీజేపీ ఆఫర్‌ను తిరస్కరించినట్లు వెల్లడించారు.