పెండింగ్ భూ సమస్యల పరిష్కారానికి తీసుకోవాలి

 – జిల్లా కలెక్టర్లు ,అదనపు కలెక్టర్లు తహసిల్దారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన సీసీఎల్ఏ కమిషనర్

సిరా న్యూస్,పెద్దపల్లి;

భూ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ప్రవేశ పెట్టనున్న  నూతన ఆర్వోఆర్ చట్టం ముసాయిదా బిల్లు పై అభిప్రాయాలను ఈ నెల 23 వరకు సమర్పించాలని సిసిఎల్ఏ కమిషనర్ నవీన్ మిట్టల్ తెలిపారు. శనివారం సిసిఎల్ఏ కమిషనర్ నవీన్ మిట్టల్  హైదరాబాద్ సీసీఎల్ఏ కార్యాలయం నుంచి రాజన్న సిరిసిల్ల , జగిత్యాల , జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్ , పెద్దపల్లి ఆసిఫాబాద్ నారాయణపేట, ములుగు, ఆదిలాబాద్ , జనగామ నిర్మల్ ,నిజామాబాద్  జిల్లాల కలెక్టర్లతో పెండింగ్ భూ సమస్యల పరిష్కారం పై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రివ్యూ నిర్వహించారు. సమీకృత జిల్లా కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష, అదనపు కలెక్టర్ జి.వి. శ్యామ్ ప్రసాద్ లాల్ తో కలిసి ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు  పెండింగ్ ధరణి దరఖాస్తుల పరిష్కారానికి తీసుకున్న చర్యల పై జిల్లాల వారీగా అడిగి తెలుసుకున్నారు. రికార్డులు పరిశీలించి క్షేత్రస్థాయిలో విచారణ చేసిన తర్వాత సంబంధిత దరఖాస్తుల  ఆన్ లైన్ లో అప్ డేట్ చేసి పరిష్కరించాలని అన్నారు.
సీసీఎల్ఏ కమిషనర్ నవీన్ మిట్టల్ మాట్లాడుతూ
రాష్ట్రంలో ఉన్న పెండింగ్ భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని,  నూతన ఆర్వోఆర్ చట్టం ముసాయిదా బిల్లును రూపొందించి ప్రజలకు అందుబాటులో పెట్టిందని అన్నారు. నూతన చట్టం ముసాయిదా  క్రింద సెక్షన్ 4 ప్రకారం క్రోత్త ఆర్వోర్ రికార్డ్ రూపకల్పన, అందుబాటులో ఉన్న రికార్డ్ సవరణకు అవకాశం ఉందని, గత చట్టం కింద నిలిచిపోయిన సాదాబైనామా దరఖాస్తుల పరిష్కారానికి సెక్షన్ 6 వెసులుబాటు కల్పించిందని, సిసిఎల్ఏ వెబ్ సైట్ నందు ముసాయిదా బిల్లు అందుబాటులో ఉందని అన్నారు. ఆర్వోఆర్ ముసాయిదా బిల్లు పై  ప్రజలు తమ సలహాలు సందేహాలు, అభిప్రాయాలను సిసిఎల్ఏ   వెబ్ సైట్ www.ccla.telangana.gov.in ద్వారా లేదా ror-rev@telangana.gov.in  మెయిల్ ద్వారా ఆగస్టు 23 వరకు తెలియజేయాలని ఆయన తెలిపారు. రాష్ట్రంలోని అదనపు కలెక్టర్లు, రెవెన్యూ డివిజన్ అధికారులు నూతన ఆర్వోఆర్ చట్టం ముసాయిదా బిల్లును పరిశీలించి, క్షేత్రస్థాయిలో ఉన్న భూ సమస్యల పరిష్కారానికి అవసరమైన సలహాలు సూచనలు సకాలంలో అందజేయాలని సీసీఎల్ఏ కమిషనర్ సూచించారు. ప్రజల నుండి వచ్చిన సూచనలు సలహాలు మేరకు కొత్త చట్టాన్ని ప్రభుత్వం రూపొందిస్తుందని సీసీఎల్ఏ కమిషనర్ తెలిపారు.
నూతన ఆర్వోఆర్ చట్టం అమలులోకి వచ్చే లోపు పెండింగ్ ధరణి దరఖాస్తులను పరిష్కరించాలని, మరో 3 వారాల వ్యవధిలో  పూర్తి స్థాయిలో ధరణి దరఖాస్తులు పరిష్కారమయ్యే విధంగా అధికారులు క్షేత్రస్థాయిలో పనిచేయాలని ఆయన ఆదేశించారు. ధరణి ద్వారా వచ్చిన దరఖాస్తులను తిరస్కరించే పక్షంలో తప్పనిసరిగా కారణాలను తెలియజేయాలని సీసీఎల్ఏ కమిషనర్ అధికారులకు సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో రెవెన్యూ డివిజన్ అధికారులు,  బి.గంగయ్య, వి.హనుమా నాయక్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *