Jadav Rajesh Babu: ఉమ్మడి జిల్లాలో జాదవ్‌ రాజేష్‌ బాబు ప్రచార రథాలు…

సిరా న్యూస్, బ్యూరో–ఇన్‌–చీఫ్, ఆదిలాబాద్‌:

ఉమ్మడి జిల్లాలో జాదవ్‌ రాజేష్‌ బాబు ప్రచార రథాలు…
+ ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ బరిలో నిలిచేందుకు సన్నాహాలు…?!
+ కేంద్ర ప్రభుత్వ పథకాలను వివరిస్తు కదులుతున్న రథాలు
+ ఆసక్తి చూపుతున్న ప్రజానికం

భైంసా మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మెన్, బీజేపీ రాష్ట్ర నాయకులు జాదవ్‌ రాజేష్‌ బాబు కేంద్ర ప్రభుత్వ పథకాలను వివరిస్తూ ప్రత్యేక ప్రచార రథాలను ఏర్పాటు చేయడం ఉమ్మడి అదిలాబాద్‌ జిల్లాలో హాట్‌ టాపిక్‌గా మారింది. కేంద్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రవేశపెట్టిన అనేక పథకాలను వివరిస్తూ రథాలు సిద్ధం చేసారు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో మొత్తం 14 రథాలు ప్రతీ రోజు గ్రామాల్లో తిరుగుతుండటంతో ప్రజలు రథాలను ఆసక్తిగా తిలకిస్తున్నారు. ఎంపీ ఎన్నికలకు నోటిఫికేషన్‌ జారీ కంటే ముందే రాజేష్‌ బాబు బీజేపీ నాయకులు, తన ఫోటోలతో ఉన్న ప్రచార రథాలు ఏర్పాటు చేయడంతో ఇతర ఎంపీ టికెట్‌ ఆశావాహులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ముథోల్‌కు చెందిన రాజేష్‌ బాబు, పార్టీ ఆదేశిస్తే ఈ సారి పార్లమెంట్‌ ఎన్నికల బరిలో ఉండటమే కాకుండా, గెలిచి సత్తా చూపిస్తామనే ధీమాలో ఉన్నట్లు తెలుస్తోంది.

ఉమ్మడి జిల్లాపై పట్టు…
హార్టికల్చర్‌ ఆఫీసర్‌గా పనిచేసిన జాదవ్‌ రాజేష్‌ బాబు ప్రజా సేవపై మక్కువతో ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చారు. అప్పట్లో మాజీ మంత్రి పడాల భూమన్న పీ.ఏ. గా పనిచేసిన ఆయన, తదనంతరం తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొని, ఉద్యమ నాయకుడిగా పేరుగాంచారు. తన స్వగ్రామంలో రైతులందరికి డ్రిప్‌ ఇరిగేషన్‌ ఏర్పాటు చేయడంతో పాటు, గ్రామంలో సెంట్రల్‌ లైటింగ్‌ సిస్టం ఏర్పాటు చేసారు. అతని పేరిట ముథోల్‌లో ‘రాజేష్‌ బాబు తండా’ అనే ప్రత్యేక ఊరునే ఏర్పాటు చేయడం ఆయన సేవలకు నిదర్శనంగా చెప్పవచ్చు. అనేక హోదాల్లో పనిచేసిన రాజేష్‌ బాబుకు ఉమ్మడి జిల్లాలో రాజకీయా నాయకులతో మంచి సత్సంబందాలు ఉండటం ఈ సారి కలిసి వచ్చే అంశంగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఆయనకు నిర్మల్‌ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌ రెడ్డి, ముథోల్‌ ఎమ్మెల్యే రామారావ్‌ పటేల్, కాగజ్‌ నగర్‌ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌ బాబు అండదండలు ఉన్నట్లు టాక్‌ నడుస్తోంది. అయితే ప్రచార రథాల వ్యవహారం ఇప్పటికే బీజేపీ ఉన్నత స్థాయి నాయకత్వం దృష్టికి వెళ్లినట్లు సమాచారం. తాను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వ పథకాలపై ప్రచారం కోసం రథాలను ఏర్పాటు చేసానని నాయకత్వానికి రాజేష్‌ బాబు చెప్పినట్లు వినికిడి. మూడో సారి కూడ కేంద్రంలో మోడీ రావాలనే సంకల్పంతో ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నాని, ఒక వేళ పార్టీ ఆదేశిస్తే ఆదిలాబాద్‌ ఎంపీ బరిలో ఉంటానని ఆయన చెప్పినట్లు తెలిసింది. అయితే ఈ పరిణామాలను బీజేపీ అగ్ర నాయకత్వం ఎలా చూస్తుంది? రాజేష్‌ బాబుకు ఎంపీ టికెట్‌ ఖాయమేనా? అనేది ఇంకా సస్పెన్స్‌గానే మిగిలింది. కాగా ఆదిలాబాద్, బోథ్‌ నియోజక వర్గాల్లో బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి లోక ప్రవీణ్‌ రెడ్డి ఆధ్వర్యంలో ఈ ప్రచార రథాలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. లోక ప్రవీణ్‌ రెడ్డి ఇప్పటికే బీజేపీకి చెందిన పలువురు అగ్ర నాయకులను కలిసి ఈ సారి టికెట్‌ రాజేష్‌ బాబుకు ఇస్తే బాగుంటుందని విన్నవించినట్లు తెలుస్తోంది. అయితే రాజేష్‌ బాబు అభిమానులు, బీజేపీకి చెందిన పలువురు పార్టీ శ్రేణులు మాత్రం ఈ సారి లంబాడా కమ్యూనిటీకి చెందిన రాజేష్‌ బాబుకే ఆదిలాబాద్‌ బీజేపీ ఎంపీ టికెట్‌ ఇవ్వాలని పట్టుబడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *