హాట్ టాపిక్ గా జగన్ రాజీనామా

సిరా న్యూస్,కడప;
మాజీ సీఎం జ‌గ‌న్‌.. ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేసి క‌డ‌ప ఎంపీగా పోటీ చేస్తార‌ని విస్తృత ప్ర‌చారం జ‌రుగుతోంది. దీనిపై వైసీపీ నుంచి ఎలాంటి స్పంద‌న లేకపోవటంతో ఆ పార్టీ శ్రేణులు అయోమయంలో ఉన్నాయి. YCP మౌనం అంగీకార‌మా? లేక ఎప్ప‌ట్లాగే ఉదాసీన‌తా ? అనేది అర్థం కావ‌డం లేదనే చ‌ర్చ సాగుతోంది. ఇంతకీ.. జగన్‌ రిజైన్‌ చేయటం ఏమిటి? అసలు.. ఆ వార్తలెలా వస్తున్నాయిఏపీలో జగన్ రాజీనామా అంశం హాట్ టాపిక్‌గా మారింది. గత ఎన్నికల్లో కేవలం 11 సీట్లకే పరిమితం అయిన వైసీపీ అధినేత.. అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కోసం స్పీకర్‌కు లేఖ రాశారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో తమ పార్టీకి ప్రతిపక్ష హోదా రాదని నిర్ధారించుకున్న తర్వాత.. ఆయన ఢిల్లీ వేదికగా రాజకీయాలు చేయాలని యోచనలో ఉన్నట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. ఈ వార్తలను అటు జగన్‌ కానీ ఇటు వైసీపీ నేతలు కానీ ఖండించకపోవటం చర్చనీయాంశంగా మారింది. కొందరు వైసీపీ నేతలు మాత్రం ఇదంతా టీడీపీ చేస్తున్న ప్రచారమని చెబుతున్నారు. అంతేకాని జగన్ రాజీనామా చేస్తారన్న వార్తల్ని ఖండించడం లేదు. అంటే జగన్ రాజీనామా చేయడం నిజమా ? అవినాష్ తో ఎంపీగా రాజీనామా చేయించి.. సైడ్ చేస్తారా ? కుటుంబంలో ఉన్న వ్యతిరేకతను పోగొట్టుకునేందుకు ఈ ఎత్తు వేశారా లేక.. అసెంబ్లీలోకి వెళ్లడం ఇష్టం లేక అలా చేయాలని ప్లాన్ చేశారా ?ఇటీవలే జరిగిన YSR జయంతి కార్యక్రమంలో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఈ వ్యవహారాన్ని మరో మలుపు తిప్పాయి. ఒకవేళ కడపలో ఉపఎన్నిక జరిగితే.. APCC అధ్యక్షురాలైన షర్మిలను గెలిపించే బాధ్యతను తాను తీసుకుంటానని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. నియోజకవర్గంలో ప్రతి ఇంటికీ వెళ్లి.. ఓట్లు అడుగుతానని ఆయన సభలో బహిరంగ ప్రకటన చేశారు. దీంతో ఉపఎన్నికకు సంబంధించిన వార్తలకు మరింత బలం చేకూరినట్లు అయింది. పోగొట్టుకున్న చోటే వెతకాలన్న సామెత ప్రకారం ఏపీ కాంగ్రెస్ పావులు కదుపుతోందని వాదనలు వినిపిస్తున్నాయి. పార్టీ బలోపేతం కోసం ఎలాంటి సహాయమైనా చేయడానికి తాము సిద్ధమంటూ TPCC చీఫ్‌, సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటనతో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. కడప ఎంపీ ఉపఎన్నిక ఖాయమైతే.. షర్మిల, జగన్ ల మధ్య హోరాహోరీ పోటీ ఖాయం. రేవంత్ రెడ్డి బరిలోకి దిగి షర్మిలకు సపోర్ట్ చేస్తే.. జగన్ ఓడిపోవడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.ఇక రాహుల్‌ గాంధీని ప్రధానిగా చూడాలంటే కాంగ్రెస్ శ్రేణులంతా ఒక్కటై పని చేయాలంటూ తెలంగాణ సీఎం రేవంత్‌ చేసిన వ్యాఖ్యలు.. హస్తం నేతలను ఆలోచనలో పడేశాయని రాజకీయవర్గాలు చెప్పుకుంటున్నాయి. ఇప్ప‌టికైనా జ‌గ‌న్ రాజీనామాపై వైసీపీ అధిష్టానం మౌనం వీడాలి. లేదంటే వైసీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల్లో గంద‌ర‌గోళానికి కార‌ణ‌మ‌వుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్ర‌త్య‌ర్థుల మైండ్‌గేమ్‌కు వైసీపీ మౌనం అగ్గికి ఆజ్యం పోసిన‌ట్టు అవుతుంద‌ని అంటున్నారు. జ‌గ‌న్ రాజీనామా ప్ర‌చారంపై ఇప్ప‌టికైనా వైసీపీ పెద్ద‌లు స్ప‌ష్ట‌త ఇవ్వాల్సిన అవ‌స‌రం ఉందని చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *