Jainath EGS: జైనథ్‌ ఉపాధి హామీలో అక్రమాలు…?!

సిరా న్యూస్, జైనథ్‌:

జైనథ్‌ ఉపాధి హామీలో అక్రమాలు…?!
+ సామాజిక తనిఖితో వెలుగులోకి
+ పూర్తి అయిన ప్రజావేధిక
+ జీపీల వారీగా అక్రమాల లెక్క తేలుస్తున్న అధికారులు

ఆదిలాబాద్‌ జిల్లా జైనథ్‌ మండలంలో 2022–23 ఆర్థిక సంవత్సరంలో నిర్వహించిన ఉపా«ధి హామీ పనుల్లో అక్రమాలు చోటుచేసుకున్నట్లు ఆడిట్‌ బృంధం తేల్చారు. నెల రోజుల పాటు గ్రామ పంచాయతీల్లో నిర్వహించిన తనిఖీల్లో భాగంగా పలు అక్రమాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. కాగా మంగళవారం మండల పరిషత్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజా వేధికలో ఈ మేరకు ఆడిట్‌ బృందం గ్రామ పంచాయతీల వారీగా నివేధికలను చదివి వినిపించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డీఆర్డీవో సాయన్న నివేధికలను క్షుణ్ణంగా పరిశీలించి, గ్రామ పంచాయతీల వారీగా అక్రమాలకు సంబంధించిన అంతిమ నివేధికలు సిద్దం చేసినట్లు సమాచారం.

రూ. 2.013 కోట్ల పనులు…
జైనథ్‌ మండలంలోని వివిద గ్రామ పంచాయతీల్లో 01.04.2022 నుండి 31.03.2023 వరకు దాదాపు రూ. 2.013 కోట్లతో ఉపాధి హామీ పనులు చేపట్టారు. వీటిలో కొన్ని గ్రామాల్లో కూలీలు పనులు చేపట్టకుండానే డబ్బులు చెల్లించినట్లు అధికారులు గుర్తించారు. మరికొన్ని గ్రామాల్లో ఉపాధి హామీలో హాజరు కోసం రాసే మస్టర్‌లలో సైతం కొట్టివేతలు ఉన్నట్లు నివేధికల్లో పేర్కొన్నారు. మేడిగూడ గ్రామంలో అయితే కూలీల వద్ద నుండి మస్టర్‌కు ఇంతా అంటూ సిబ్బంది వసూలు చేసారని ఆడిట్‌ బృందం ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దాదాపు 240మంది కూలీలు దీన్ని సమర్తిస్తూ సంతకాలు చేసినట్లు అధికారులు తెలిపారు. అయితే అదే గ్రామానికి చెందిన కొంత మంది కూలీలు ప్రజా వేధికకు హాజరై తమ గ్రామంలో కూలీల నుండి ఎవరూ కూడ డబ్బులు వసూలు చేయలేదని అధికారులకు చెప్పడం గమనార్హం. ఇక్కడ ఆడిట్‌ సిబ్బంది నివేదికలు తప్పా? లేదంటే ఈజీఎస్‌ సిబ్బంది తప్పా? అనే సంశయం నెలకొంది. వాస్తవంగా ఆడిట్‌ బృందం అక్రమాల లెక్కలు తేల్చిన తరువాత, ప్రజావేధికలో వాటి తీవ్రతను బట్టి డీఆర్డీవో చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఏపీవో, ఆపరేటర్, టీఏలు, ఎఫ్‌లు, అప్పట్లో ఈజీఎస్‌లో పనిచేసిన పంచాయతీ కార్యదర్శుల వద్ద నుండి రికవరీకి ఆదేశించడం లేదంటే, షోకాజ్‌ నోటీసులు జారీ చేయడం, విధుల నుండి సస్పెండ్‌ చేయడం వంటి చర్యలు తీసుకోవడం జర్గుతుంది. అయితే మరో రెండు రోజుల్లో గ్రామ పంచాయతీల వారీగా అక్రమాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఆధికారులు వెల్లడించే అవకాశం ఉంది. దీంతో ఎవరిపై ఎలాంటి చర్యలు ఉంటాయోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *