సిరా న్యూస్, ఆదిలాబాద్:
శిథిలమవుతున్న జైనథ్ టెంపుల్
+ లోక రక్షకుడికే కరువైన రక్షణ
+ కరిగి పోతున్న నల్ల రాయి
+ కనుమరుగవుతున్న శిల్పకళ
+ ఆందోళన వ్యక్తం చేస్తున్న భక్తజనం
తెలంగాణ రాష్ట్రంలో అతి పురాతనమైన ఆలయాల్లో శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయం ఒకటి. ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండల కేంద్రంలో కొలువైన అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయానికి ఘన చరిత్ర ఉంది. 11వ శతాబ్దంలో జైనుల కాలంలో నిర్మించినట్లుగా చరిత్రకారులు చెబుతున్న ఈ ఆలయానికి అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. ఉన్నతమైన శిల్పకళ, వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఆయలయం ప్రసుతం సరైన నిర్వాహణలేక నిర్లక్ష్యానికి గురౌతున్నది. ఆలయ నిర్మాణానికి వాడిన నల్ల రాయి రోజు రోజుకు కరిగిపోతూ…శిల్పకళ కనుమరుగౌతున్నది. అటు ఎండోమెంట్ అధికారులుగానీ, ఇటు పురావస్తు శాఖ అధికారులుగానీ దీని రక్షణ ప్రత్యేక చర్యలేవి తీసుకోకపోవడంతో ఇది శిథిలావస్థకు చేరుకుంటోంది. సరైన సంరక్షణ లేక ఆలయానికి వాడిన నల్ల రాయి కరిగి, పెచ్చులూడుంతోంది. ఇలా పెచ్చులూడిన ప్రాంతంలో నిర్లక్ష్యంగా సిమెంటుతో మెరుగులు దిద్దడంతో ఆలయం తన ఆనవాళ్లు కోల్పోతున్నది. ఇదే నిర్లక్ష్యం కొనసాగితే రాబోవు తరాల వారు ఆలయాన్ని పుస్తకాల్లోనూ, పోటోల్లోనూ చూసి సంబరపడాల్సిన దుస్థితి వస్తుందని భక్తులు, గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఆలయ ప్రాశస్త్యం…
11, 13 వ శతాబ్దంలో జైనుల హయాంలో ఈ ఆలయాన్ని నిర్మించారని ప్రతీతి. ఉన్నతమైన శిఖరం కల్గి, గొప్ప శిల్పకళతో నిర్మించిన ఈ ఆలయానికి ముందు భాగంలో పెద్ద జలాశయం ఉన్నది. ఈ ఆలయ నిర్మాణానికి వాడిన రాయి చుట్టు ప్రక్కల గ్రామాల్లో ఎక్కడ కనిపించదు. ఈ రాయిని మహరాష్ట్ర లోని యవత్‌మాల్ నుండి తెప్పించి వుంటారని చరిత్రకారులు భావిస్తారు. 60 గజముల ఎత్తు, 40 గజముల వైశాల్యమున్న అష్టకోణాకార మండపము పైన్న గర్భగుడిలో లక్ష్మీ నారాయణ స్వామి విగ్రహము ప్రతిష్టించబడి వుంది. ప్రతి సంవత్సరం మార్చ్, ఎప్రిల్, సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో సూర్యకిరణాలు నేరుగా స్వామి వారి పాదాలను తాకుతాయి. ప్రతీ సంవత్సరం కార్తిక శుద్ద ఏక దశి నుండి స్వామి వారి బ్రహ్మోత్సవాలు మెదలవుతాయి. ఇటీవలే స్వామి వారి బ్రహ్మోత్సవాలు పూర్తి అయ్యాయి.
ఇది అసలు సమస్య…
దాదాపు 36 సంవత్సరాలక్రితం ఆలయానికి సున్నం వేయడం జర్గింది. దాంతో శిల్ప కళ అనేది చాలవరకు నాశనం అయ్యింది. తరువాత 2002లో దీనికి నల్లని పెయింట్ వేయడంతో అసలు సమస్యలు మొదలయ్యాయి. సున్నం, నల్లని పెయింట్ రెండు కలిసి ఆలయ రాయిని కర్గించడం వల్ల ఆలయపు బయటి గోడలు పెలుసుగామారి పగులుతున్నాయని పలువురి వాదన. ఆలయం పై పిచ్చి మొక్కలు, తీగలు మొలుస్తున్నప్పటికీ కూడ పట్టించుకునే నాథుడు కరువయ్యాడు. ఆలయ సంరక్షణకు ఎండోమెంట్ అధికారులు, పురావస్తు శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చెస్తున్నారు. వర్షానికి ఆలయం లోపల ఊరుస్తుండటంతో గత బీఆర్‌ఎస్ హయాంలో కొన్ని మెరుగులు దిద్దారు. సీసీ రోడ్లు, జలాశంలోకి బ్రిడ్జి, ఇతరాత్ర పనులకు నిధులు మంజూరు చేసినప్పటికీ ఆలయ సంరక్షణకు పెద్దగా చర్యలు తీసుకోలేదని స్థానికుల చెబుతున్నారు. కొత్త ప్రభుత్వం కొలువుదీరిన నేపథ్యంలో ఆలయ సంరక్షణకు నిధులు మంజూరు చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు. నిరుపయోగంగా ఉన్న జలాశంలో బోటింగ్ ఏర్పాటుతో పాటు భక్తుల స్నానాలకు ఉపయోగంగా మార్చాలని కోరుకుంటున్నారు.