రాజకీయాలపై జనసేనాని పట్టు

సిరా న్యూస్,విజయవాడ;
ఒకటి మాత్రం నిజం.. ఏపీ పాలిటిక్స్ ను దగ్గర నుంచి పరిశీలించిన వారికి ఇప్పుడు ఒక విషయం స్పష్టంగా తెలుస్తుంది. అదే జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఉంటేనే పాలిటిక్స్ ఉంటాయి. లేదంటే లేదు అన్నట్లుగా ఏపీ రాజకీయాలు నడుస్తున్నాయి. ఇటు అధికార పక్షం గాని, అటు విపక్షం గాని పవన్ నామస్మరణ లేకుండా మాత్రం పూట గడవటం లేదు. పవన్ కల్యాణ్ ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ లో నెంబర్ వన్ గా నిలిచారంటే వినేవాళ్లకు అతిశయోక్తి అనిపించొచ్చు గాని.. ఆయన చేతుల మీదుగానే రాజకీయాలు నడుస్తున్నాయన్నది వాస్తవం. ఆయనతో గొడవలు పెట్టుకుంటే లాస్ అయ్యేది తమదేనన్న భావన మిగిలిన రాజకీయ పార్టీల నేతలకు బలంగా పడిపోయింది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ మళ్లీ ఎన్నికలకు ముందు తరహా రాజకీయాలను ప్రారంభించినట్లే కనపడుతుంది. ఫుల్లు ఎఫెన్స్ లో కనపడుతున్నారు. నిన్నటి వరకూ తన పని ఏదో తాను చూసుకుంటూ పవన్ కల్యాణ్ పెద్దగా బయటకు కనిపించలేదు. ఆయన తనకు కేటాయించిన శాఖలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీశాఖలను ఆయన పూర్తిగా అధ్యయనం చేశారు. అధికారులతో సమీక్షలు, ఉత్తర్వులకే పరిమితమైన పవన్ కల్యాణ్ నేడు గ్రౌండ్ లోకి ఎంటర్ అయ్యారు. వచ్చీ రావడంతోనే ఇటు కూటమి ప్రభుత్వంపైనా, అటు విపక్షంపైనా విరుచుకుపడుతూ వెళ్లడం దేనికి సంకేతం అన్న చర్చ జరుగుతుంది.ఏడాది క్రితం వరకూ పవన్ కల్యాణ్ ను ఎవరూ పెద్దగా కేర్ చేసే వారు కాదు. వైసీపీ అప్పట్లో అధికారంలో ఉన్నప్పుడు పవన్ పై ఘటు విమర్శలు చేసేది. వ్యక్తిగత విమర్శలకు కూడా దిగేది. కానీ పవన్ నుంచి మౌనమే సమాధానమయ్యేది. ఇటు టీడీపీ నుంచి కూడా కొందరు నేతలు అడిగిన సీట్లు ఎందుకిస్తాం? బలహీనమైన పార్టీకి అన్ని స్థానాలు అవసరమా? అని వెటకారం చేసిన వాళ్లు కూడా లేకపోలేదు. అన్నింటినీ సహించిన, ఓర్పు వహించిన పవన్ కల్యాణ్ సమయం కోసం వేచిచూశారు. అదే టీడీపీకి తన అవసరమేంటో చెప్పకనే తెలియజెప్పారు. రాజమండ్రి జైలు ఆవరణ బయట నుంచే పొత్తు ప్రకటన చేసి సంచలనం సృష్టించారు. ఇప్పుడు పవన్ కల్యాణ్ ను తక్కువగా చూసిన పార్టీలు కూడా ఆయనను పొలిటికల్ గాడ్ చూడటం ప్రారంభమయింది. 2019 ఎన్నికల్లో ఒక్క సీటుతో సరిపెట్టుకుని, రెండు స్థానాలలో పోటీ చేసి ఓడిపోయిన పవన్ కల్యాణ్ అదే 2024 ఎన్నికలకు వచ్చేసరికి సీన్ మొత్తం మార్చేశారు. 21 అసెంబ్లీ స్థానాలు, రెండు పార్లమెంటు స్థానాల్లో పోటీ చేసి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రయిక్ రేట్ సాధించారు. దీంతో పవన్ ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది. పవన్ లేనిదే గెలుపు లేదన్నది మొన్నటి ఎన్నికల్లో స్పష్టంగా తెలిసింది. దీంతో పవన్ కల్యాణ్ తోడు ఉంటే చాలు అన్న సీన్ ను రాజకీయాల్లో క్రియేట్ చేయగలిగారు. దీంతో పవన్ కు పాలిటిక్స్ లో ప్రాధాన్యత పెరిగింది.ఇక పిఠాపురం నియోజకవర్గం పర్యటన తర్వా పల్నాడు ప్రాంతానికి పవన్ కల్యాణ్ చేరుకున్నారు. అక్కడ వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు సంబంధించిన సరస్వతీ పవర్ భూములను సందర్శించారు. రైతులతో ముఖాముఖి మాట్లాడారు. అన్యాక్రాంతమైన భూముల విషయాలను పవన్ ప్రస్తావించారు. పేదల భూములను జగన్ బలంవంతంగా సొంతం చేసుకున్నారంటూ మండిపడ్డారు. జగన్ సీఎం అయిన తర్వాత ఈ కంపెనీకి భూముల లీజును యాభై ఏళ్ల పాటు పొడిగించుకున్నారన్నారు. కోడెల శివప్రసాద్ ను ఫర్నిచర్ కోసం వేధించి నాటి ప్రభుత్వం చంపేసిందంటూ పల్నాడు పర్యటనలో వ్యాఖ్యానించారు. భూములు లాక్కున్న వారికి సరస్వతీ పవర్స్ లో ఉద్యోగాలు ఇవ్వాల్సిందేనంటూ రైతుల వద్ద ఆయన డిమాండ్ చేశారు. డిప్యూటీ చీఫ్ మినస్టర్ గా ఉన్న పవన్ కల్యాణ్ ఇలా ఆవేశంగా మాట్లాడటం.. తన, తరతమ బేధల్లేకుండా మాట్లాడుతుండటం రాజకీయంగా చర్చకు దారితీసింది. అసలు పవన్ కల్యాణ్ మనస్సులో ఏముందన్నది ఎవరికీ అర్థం కావడం లేదు.ఢిల్లీ నుంచి ఏదైనా సిగ్నల్స్ అందా‍యా? అన్న చర్చకూడా ఏపీ పాలిటిక్స్ లో జరుగుతుంది. పవన్ కల్యాణ్ ఇన్నాళ్లు మౌనంగా ఉండి, చంద్రబాబు నాయుడుపై ప్రశంసలు కురిపించి కొంచెం ఇమేజ్ తగ్గడంతో తిరిగి దానిని పొందేందుకు ప్రయత్నిస్తున్నారా? అన్న అనుమానం కూడా లేకపోలేదు. పవన్ కల్యాణ్ కు కోపమొచ్చినా, ఒక మాట అనినా ఆయనను బుజ్జగించేందుకే అధికార పార్టీ తంటాలు పడుతుంది. ఆయన ఆవేశంతో అన్న మాటలుగా భావించినప్పటికీ, ఆయనను సర్దుబాటు చేసే ప్రయత్నాలను ఎప్పటికప్పుడు చేస్తుంది. అందుకే నలభై ఐదేళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు సయితం పవన్ కు ఎనలేని ప్రాధాన్యత ఇస్తున్నారు. పవన్ వ్యాఖ్యలను పెద్దగా సీరియస్ గా తీసుకోకుండా ఆయనను పిలిపించుకుని వివరణ ఇస్తున్నారంటే పవన్ కు ఏ రేంజ్ లో ప్రాముఖ్యత పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. 2029 ఎన్నికల్లో తిరిగి కలసి పోటీ చేయాలన్న ఉద్దేశ్యం బలంగా ఉండటంతోనే పవన్ కు అంత ప్రాధాన్యత దక్కుతుంది. ఆయన వెనక ఉన్న ఫ్యాన్స్, కాపు సామాజికవర్గం బలం ఆయనకు మరింతగా బలవంతుడిని చేస్తుందనే చెప్పాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *