జీవో 59తో అడ్డగోలు దందా

సిరా న్యూస్,హైదరాబాద్;
భారత రాష్ట్ర సమితి నేతల భూకబ్జాలపై యాక్షన్ షురూ అయింది. జిల్లాలో రంగంలోకి ఆఫీసర్లు దిగారని, కూల్చివేతలు ప్రారంభించారని, ఖమ్మం జిల్లాలో భారత రాష్ట్ర సమితి కార్పొరేటర్ పై కేసు నమోదు చేశారని, సూర్యాపేటలో 14 మంది గులాబీ నేతల కబ్జాలపై విచారణకు ఆదేశించారని, నిర్మల్, సిద్దిపేట జిల్లాల్లోనూ ఇదే వ్యవహారం కొనసాగుతోందని.. ప్రభుత్వం మారిపోయిన నేపథ్యంలో ప్రజల నుంచి అధికారులకు ఫిర్యాదులు ఎక్కువయ్యాయి. వాస్తవానికి అంతకంటే రెండు రోజుల ముందే ఖమ్మం జిల్లాలో భారత రాష్ట్ర సమితి పార్టీకి చెందిన ఓ మహిళ కార్పొరేటర్ గొల్లగూడెంలోని మమత ఆసుపత్రి రోడ్డులో 415 చదరపు గజాల ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించడం.. దానిని క్రమబద్ధీకరించుకునేందుకు జీవో 59ని అడ్డం పెట్టుకోవడం.. దానికోసం ప్రభుత్వ అధికారులకు తప్పుడు వివరాలు అందజేయడం.. వంటి విషయాలు వెలుగులోకి రావడంతో ఒక్కసారిగా ఈ జీవో 59 వెనుక ఉన్న మతలబేమిటో చూడాలని ముఖ్యమంత్రి నుంచి ఆదేశాలు వచ్చాయి. దీంతో రంగంలోకి దిగిన అధికారులకు దిమ్మతిరిగే వాస్తవాలు కనిపిస్తున్నాయికెసిఆర్ ప్రభుత్వ హయాంలో జీవో 59ని ఆగమేఘాల మీద తెరపైకి తీసుకొచ్చారు. ప్రభుత్వం వద్ద డబ్బులు లేకపోవడంతో సరికొత్త ఆదాయం మార్గానికి అప్పట్లో రంగం సిద్ధం చేశారు. దాని కోసం జీవో 59 ని ప్రవేశపెట్టారు. దీని ప్రకారం సంవత్సరాలుగా ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకున్న వారికి మార్కెట్ రేటు కంటే తక్కువ ఫీజు చెల్లిస్తే క్రమబద్ధీకరిస్తామని ప్రభుత్వం ఆఫర్ ఇచ్చింది. కానీ ఈ జీవో 59లో విధానాలు చాలావరకు లోపభూయిష్టంగా ఉండడంతో గులాబీ నేతలు అడ్డగోలుగా పందేరానికి తెర తీశారు. ఎలాగూ అధికారులు కూడా తమ అడుగులకు మడుగులు వత్తేవారు కావడంతో ఎక్కడికక్కడ స్థలాలను ఆక్రమించుకున్నారు. తర్వాత క్రమబద్దీకరించుకున్నారు. అయితే ఈ క్రమబద్ధీకరణకు సంబంధించి అడ్డగోలుగా నిబంధనలను అతిక్రమించడంతో.. ఇప్పుడు ఆ విషయాలు ఒక్కొక్కటిగా తెరపైకి వస్తున్నాయి.ఉదాహరణకు ఖమ్మం జిల్లా చూసుకుంటే ఈ జిల్లాకు చెందిన అప్పటి మంత్రి అనుచరులు అడ్డగోలుగా భూ దందాలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. ఆ మంత్రి హయాంలో అధికార పార్టీ నగర అధ్యక్షుడు తన సతీమణిని కార్పొరేటర్ గా గెలిపించుకున్నాడు. ఆ తర్వాత భూ దందాలకు తెరలేపాడని.. అడ్డగోలుగా భూములు ఆక్రమించుకున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. పైగా అప్పటి మంత్రి సహకారంతో ఇష్టారాజ్యంగా వ్యవహరించాడు అనే విమర్శలు కూడా ఉన్నాయి. ఇందులో భాగంగా ఖరీదైన ప్రాంతంలో ప్రభుత్వ స్థలాలను తన భార్య పేరుతో క్రమబద్ధీకరించుకున్నాడని.. దీనికోసం ఖమ్మం మున్సిపల్ అధికారులకు కూడా తప్పుడు వివరాలు సమర్పించాడని ఇటీవల వెలుగులోకి వచ్చింది. దీంతో ఖమ్మం జిల్లా కలెక్టర్ విచారణకు ఆదేశించడంతో అసలు విషయాలు వెలుగు చూశాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *