సిరా న్యూస్, ఆదిలాబాద్:
గృహజ్యోతి కోసం మున్సిపల్ కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్
– మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్
– జీరో బిల్లు రానివారు మరల దరఖాస్తు చేసుకోవాలని సూచన
– పలు వార్డుల్లో ఇంటింటికి తిరుగుతూ జీరో బిల్ రసీదుల పంపిణీ
ఆదిలాబాద్ మున్సిపల్ కార్యాలయంలో గృహజ్యోతి పథకం కోసం ప్రత్యేకంగా కౌంటర్ ఏర్పాటు చేసినట్లు మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ తెలిపారు. ఆదివారం ఈ మేరకు ఆయన పట్టణంలోని పలు వార్డుల్లో ఇంటింటికి తిరుగుతూ జీరో బిల్ విద్యుత్ రసీదులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… గృహ జ్యోతి కోసం దరఖాస్తు చేసుకొని, 200 యూనిట్ల లోపు బిల్లు ఉన్నవారు జీరో బిల్ కు అర్హులని అన్నారు. జీరో బిల్ రానివారు ఆందోళన చెందాల్సిన పనిలేదని మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కౌంటర్లో మరల దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఇప్పటివరకు గృహజ్యోతి పథకం కోసం దరఖాస్తు చేసుకోని వారు సైతం కొత్తగా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందన్నారు. అయితే 200 లోపు బిల్లు ఉన్న వారికే జీరో బిల్ వస్తుందని, 200 యూనిట్లు దాటిన వారి నుండి పూర్తి బిల్లులు వసూలు చేస్తున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి 200 యూనిట్లు దాటిన వారికి, 200 యూనిట్లు మాఫీ చేసి మిగిలిన యూనిట్లకు మాత్రమే బిల్లు వేయాలని డిమాండ్ చేశారు.