సిరాన్యూస్, ఆదిలాబాద్
16న ఆదిలాబాద్ జిల్లాకు కేటీఆర్ రాక : మాజీ మంత్రి జోగురామన్న
ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగట్టండి..
తెలంగాణ గొంతుక వినబడాలంటే బీఆర్ఎస్‌ను గెలిపించండి
పార్లమెంట్ లో తెలంగాణ గొంతుక వినబడాలంటే బీఆర్ఎస్ ఎంపీలతోనే సాధ్యమని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ప్రజల ముందుంచి రానున్న ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి ఘన విజయానికి కృషి చేస్తామని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు, మాజీ మంత్రి జోగురామన్న అన్నారు. ఈనెల పదహారవ తేదిన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జిల్లా పర్యటన నేపథ్యంలో ముఖ్య నేతలతో ఆయన సమావేశమయ్యారు. స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కేటీఆర్హాజరు కానున్న కార్యక్రమ విజయవంతానికి చేపట్టవలసిన కార్యాచరణ పై సుదీర్ఘంగా చర్చించారు. పార్లమెంట్ స్థాయి సమావేశంలో భాగంగా బూత్ కార్యకర్తలతో కలిసి కేటీఆర్ సమావేశం కానుండగా… అందుకు సంబంధించిన అంశాలపై చర్చించారు. పార్టీ ముఖ్య నేతలకు దిశా నిర్దేశం చేశారు. ఈ మేరకు మాజీ మంత్రి జోగురామన్న మాట్లాడుతూ… కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో ఘోరంగా విఫలమయ్యాయని, ప్రభుత్వాల వైఫల్యాలను ప్రజల ముందుంచుతామని పేర్కొన్నారు. గత పదేండ్ల కాలంలో జిల్లా అభివృద్ధికి కేంద్రం చేసిందేమీ లేదన్న ఆయన.. ప్రధాని పర్యటనపై కోటి ఆశలు పెట్టుకున్న జిల్లా ప్రజానికానికి ప్రధాని మొండి చేయి చూపారని ధ్వజమెత్తారు. జిల్లా అభివృద్ధిపై కనీస ప్రకటన చేయకపోవడం బీజేపీ చిత్త శుద్ధికి నిదర్శనమని అన్నారు. కేవలం మతం పేరుతో ఓట్లు దండుకుంటున్న బీజేపీ కి తగిన గుణపాటం చెప్పాల్సిన అవసరముందని పేర్కొన్నారు. మరోవైపు 420 హామీలు ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం… రాహుల్ గాంధీ ప్రధాని అయితేనే హామీలను అమలు చేస్తామని ప్రకటించడం వారి అసమర్ధతకు అద్దం పడుతోందన్నారు. హామీలు అమలు కాకపోవడంతో రైతులు, సామాన్యులు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారని అన్నారు. రైతులకు పంట నష్ట పరిహారం, రైతు బందు, పంటలకు బోనస్ వంటి హామీలను ప్రభుత్వం బుట్టదాఖలు చేస్తోందని విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన అనేక హామీల అమలులో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. బీ.ఆర్.ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హాజరు కానున్న బూత్ స్థాయి నేతల సమావేశంలో శ్రేణులకు దిశా నిర్దేశం చేస్తారని వివరించారు. పదహారవ తేదిన గాయత్రి గార్డెన్స్ లో సమావేశం ఉంటుందని, ప్రతి బూత్ కు చెందిన నేతలు సమావేశంలో పాల్గొని విజయవంతం చేయాలనీ పిలుపునిచ్చారు.కార్యక్రమంలో జైనథ్ ఎంపీపీ మార్శెట్టి గోవర్ధన్, రోకండ్ల రమేష్, రౌత్ మనోహర్, జోగు మహేందర్, యాసం నర్సింగ్ రావు, లింగా రెడ్డి, సతీష్ పవార్ తదితరులు పాల్గొన్నారు.