Jogu Ramanna: ఆదివాసులకు సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలి: మాజీ మంత్రి జోగు రామన్న

సిరాన్యూస్‌,ఆదిలాబాద్‌
ఆదివాసులకు సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలి: మాజీ మంత్రి జోగు రామన్న
* త్వరలోనే  కేసీఆర్‌ బస్సు యాత్రలు

బీఆర్ఎస్ ఎంపీ ఆదివాసి అభ్యర్థిపై సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్య‌లు మాజీ మంత్రివర్యులు జోగు రామన్న తీవ్రంగా ఖండించారు.పార్లమెంట్ ఎన్నికల్లో తమను గెలిపిస్తే పథకాలు సక్రమంగా అమలవుతాయంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఎన్నికల నిబంధనలను అతిక్రమించడమేనని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు, మాజీ మంత్రి జోగురామన్న అన్నారు. మంగ‌ళ‌వారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో ఆయ‌న మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపిస్తే పలు పథకాలు అమలు చేస్తామని మాట ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ… ప్రస్తుతం పార్లమెంట్ లో గెలిపిస్తేనే వాటిని అమలు చేస్తామని మాట మార్చడం వారి చిత్తశుద్ధికి నిదర్శనమని పేర్కొన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన ముఖ్యమంత్రి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఆదివాసి అభ్యర్థిని అవమానపరిచే విధంగా పరుష పదజాలాన్ని వాడారని, వెంటనే ఆదివాసి సమాజానికి ముఖ్యమంత్రి క్షమాపనలు చెప్పాలని ఈ సందర్భంగా జోగురామన్న డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోనే జరిగిన సభలో ప్రధాని నరేంద్ర మోడీని బడే భాయ్ అంటూ సంభోధించిన వ్యక్తి.. ఎన్నికల వేళ విమర్శలు చేయడం దేనికి నిదర్శనమని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి లోపల బీజేపీ, బయట కాంగ్రెస్ అన్న విషయం జన జాతర సభతో స్పష్టమయిందని అన్నారు. ప్రభుత్వాన్ని పడగొడతారంటూ మాజీ సీఎం కెసిఆర్ పై విమర్శలు చేస్తున్నారన్న ఆయన… ప్రభుత్వం కూలుతుందన్న అభద్రత భావంతోనే అనవసర వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. రైతు భరోసా కింద పదిహేను వేల రూపాయల ఆర్ధిక సహాయం, రైతుకూలీలకు ఆర్ధిక సహాయం, నాలుగు వేల పెన్షన్, కళ్యాణ లక్ష్మి కింద తులం బంగారం వంటి హామీలను బుట్టదాఖలు చేశారని మండిపడ్డారు. హామీలను ఎందుకు అమలు చేయడం లేదో ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత సీఎం పై ఉందని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపిస్తేనే హామీలను అమలు చేస్తామంటూ ఓటర్లను భయభ్రాంతులకు గురి చేసేలా వ్యాఖ్యలు చేశారని, ఈ విషయమై అధికారులకు ఫిర్యాదు చేస్తామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తోందన్న విషయం గ్రహించే ప్రజలు సైతం అనుకున్న సంఖ్యలో సభకు హాజరు కాలేదని, ముందుగానే ఓటమిని గ్రహించి కెసిఆర్ పై విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఎంపీ అభ్యర్థిని అవమానించే విధంగా వ్యాఖ్యలు చేశారని అన్నారు. ఇంద్రవేల్లిలో అమాయక ఆదివాసిలను అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వమే పొట్టన పెట్టుకుందని, ప్రస్తుతం ఇంద్రవేల్లిని పర్యాటక కేంద్రంగా మారుస్తామని మాయమాటలు చెప్తున్నారని ధ్వజమెత్తారు. ముందుగా ఎందరు బలయ్యారో వారి కుటుంబాలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి దూరహంకారనికి ప్రజలు ఓటు ద్వారానే బుద్ధి చెప్తారని స్పష్టం చేశారు. 50 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో సీసీఐ , ఎయిర్ పోర్ట్, రైల్వే లైన్ వంటి అంశాలను విస్మరించి… ప్రస్తుతం గత బీ.ఆర్.ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారన్నారు. సీసీఐ ని ప్రభుత్వం తరపున నడిపిస్తామని తమ బీ.ఆర్.ఎస్ ప్రభుత్వ హయంలో ముందుకు వస్తే… ప్రైవేటుకు అప్పచేప్తామని సీఎం వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. ఆదివాసి గూడాలు, తండాల్లో కనీస సౌకర్యాలు కల్పించిన ఘనత తమ బీఆర్ ఎస్‌ ప్రభుత్వానిదేనని, ఈ విషయమై ఆయా ప్రాంతాల్లో పర్యటించేందుకు సైతం సిద్ధమని సవాల్ విసిరారు. త్వరలోనే మాజీ సీఎం కెసిఆర్ బస్సు యాత్రలు, బహిరంగ సభలు ప్రారంభం కానున్నాయని, ఊరు వాడా బీ.ఆర్.ఎస్ కు ప్రజల నుండి బ్రహ్మరథం లభిస్తోందని అన్నారు. స‌మావేశంలో నాయ‌కులు ఇజ్జగిరి నారాయణ, యూనిస్ అక్బాని, సాజితోద్దీన్, యాసం నర్సింగరావు, సలీం పాషా, భూమన్న, పర్వీన్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *