Jogu Ramanna: అత్రం సక్కును ఎంపీగా గెలిపిద్దాం: మాజీ మంత్రి జోగు రామన్న

సిరాన్యూస్, ఆదిలాబాద్‌
అత్రం సక్కును ఎంపీగా గెలిపిద్దాం: మాజీ మంత్రి జోగు రామన్న
* కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలం
*  కారు గుర్తుకు ఓటు వేయాలి
* ప్రచార రథం ప్రారంభం

అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమయిందని, ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపిస్తే హామీలు అమలవుతాయంటూ ఆ పార్టీ నేతలు వ్యాఖ్యలు చేయడం మరోమారు అబద్దానికి నిదర్శనమని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు, మాజీ మంత్రి జోగురామన్న అన్నారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం పట్టణంలోని పలు వార్డుల్లో ఆయన ప్రచారం నిర్వహించారు. మొదట స్థానిక దుర్గానగర్ నవ దుర్గా మాత ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే ప్రచార రథానికి పూజ చేసి ప్రారంభించారు. దుర్గా నగర్ తో పాటు పలు కాలనీలలో ఇంటింటి ప్రచారం చేపట్టారు. కాలనీ వాసులను కలిసి కారు గుర్తుకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ప్రజలకు వివరిస్తూ… గత బీ.ఆర్.ఎస్ ప్రభుత్వ హయంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల తీరును వివరించారు. పార్లమెంట్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి బీ.ఆర్.ఎస్ అభ్యర్థి ఆత్రం సక్కును భారి మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ మేరకు మాజీ మంత్రి జోగురామన్న మాట్లాడుతూ… గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో బూటకపు హామీలు ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం…. ప్రస్తుతం వాటిని అమలు చేయడంలో పూర్తిగా విఫలమయిందని ఆరోపించారు. మహిళలకు 2500 రూపాయల పెన్షన్, కళ్యాణ లక్ష్మి కింద తులం బంగారం వంటి హామీలను బుట్టదాఖలు చేసిందని మండిపడ్డారు. వంద రోజుల్లో ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి… ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపిస్తేనే పథకాలు కొనసాగుతాయని వ్యాఖ్యలు చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాల ఫలాలు అందాయని స్పష్టం చేశారు. ప్రజల ఆకాంక్షలను గుర్తించలేని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు రానున్న ఎన్నికల్లో గుణపాటం చెప్పాల్సిన అవసరముందని పేర్కొన్నారు.కార్యక్రమంలో నాయకులు అలాల్ అజయ్, యూనుస్ అక్బని, సంద నర్సింగ్, ధమ్మపాల్, స్వరూప రాని,కొండ గణేష్, భూమన్న, స్వరూప, పర్వీన్, దాసరి రమేష్, విజ్జగిరి నారాయణ, పండ్ల శ్రీను, వేనుగంటి ప్రకాష్, సంజయ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *